సరదాల సంక్రాంతి

అయిదో తరగతి చదువుతున్న చిన్నా.. ఇంట్లోకి వస్తూనే ‘రేపటినుంచి మాకు సంక్రాంతి సెలవులోచ్‌!’ అంటూ ఆనందంగా అరిచాడు.  చిన్నా చేతిలో ఉన్న పుస్తకాల సంచి అందుకుంటూ ‘అయితే సెలవులకు తాతయ్య ఇంటికి

Published : 15 Jan 2022 01:04 IST

యిదో తరగతి చదువుతున్న చిన్నా.. ఇంట్లోకి వస్తూనే ‘రేపటినుంచి మాకు సంక్రాంతి సెలవులోచ్‌!’ అంటూ ఆనందంగా అరిచాడు.  చిన్నా చేతిలో ఉన్న పుస్తకాల సంచి అందుకుంటూ ‘అయితే సెలవులకు తాతయ్య ఇంటికి వెళదామా’ అంది అమ్మ. ‘వద్దమ్మా.. తాతయ్య వాళ్లుండేది పల్లెటూరు కదా! సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా సరిగా రావు. పోయిన సంవత్సరం సంక్రాంతికి తాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు.. నేనెప్పుడూ ఫోన్‌లో ఆడుతుంటానని.. తాతయ్య నన్ను తిట్టాడు. అందుకే తాతయ్యంటే నాకు కోపం. నేను తాతయ్య ఇంటికి రాను’ అసహనంగా అన్నాడు చిన్నా.

ఇంతలో అమ్మ.. చిన్నాకు గ్లాసుతో పాలు అందిస్తూ ‘చిన్నా! సంక్రాంతి పండగ సరదా చూడాలంటే పల్లెటూరు వెళ్లాల్సిందే! మొదటిరోజు భోగి.. పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. చెత్తా చెదారం, పనికిరాని వస్తువులను అందులో వేస్తారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని మరీ భోగి దండలు ఆ మంటల్లో వేస్తారు. సరదాగా గడుపుతారు. రెండో రోజు సంక్రాంతి.. పెద్దవాళ్లందరూ వారి బంధువులు, స్నేహితులతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఒకవైపు హరిదాసుల కీర్తనలు, మరో వైపు గంగిరెద్దు ఆటలు.. ప్రతీ ఇంటి ముందూ రంగు రంగుల ముగ్గులు.. వీధులన్నీ సంక్రాంతి సంబరాలతో కళకళలాడిపోతాయి. ఇక మూడో రోజు ప్రభల తీర్థం.. చూడాలంటే రెండు కళ్లూ చాలవు. కన్నుల పండుగగా ఉంటుంది. దేశ విదేశాల్లో, పట్నాలలో ఉండే వాళ్లంతా.. పనిగట్టుకుని మరీ సంక్రాంతి పండగ సరదా కోసం పల్లెటూళ్లు వస్తారు. అప్పుడు.. తాతయ్య కూడా నీ మంచికోసమే మందలించారు. ఆయన టీచర్‌ కదా! క్రమశిక్షణ తప్పకూడదని అలా అన్నారని గమనించు’ అని చెప్పింది.

అమ్మ అంతలా చెప్పినా కూడా చిన్నాకు తాతయ్య ఇంటికి వెళ్లాలనిపించలేదు. అమ్మకు సమాధానం చెప్పకుండానే తన దినచర్యలో భాగంగా ఇంటి పెరట్లోకి వెళ్లాడు. అక్కడున్న జామచెట్టు పైకి చూశాడు. రోజూ.. చిట్టి అనే కాకి, చిన్నాతో కబుర్లు చెప్పడం కోసం సాయంత్రం క్రమం తప్పకుండా వస్తుంది. ఒక జామ పండుని చిన్నా చేతిలో వేసి, కాసేపు కబుర్లు చెప్పి ఎగిరి వెళ్లిపోతుంది. అలాగే ఈరోజు కూడా చిట్టి ఎగురుకుంటూ వచ్చి జామచెట్టు మీద వాలింది. చిన్నాను చూస్తూనే ‘చిన్నా..! ఎందుకు దిగులుగా ఉన్నావ్‌’ అని అడిగింది. ‘అమ్మ, ఈ సంక్రాంతికి కూడా తాతయ్య ఇంటికి వెళదామంటుంది. మా తాతయ్య అంటే నాకు కోపం అని నీకు తెలుసుగా! అందుకే నేను రానని చెప్పేశాను. అలా చెప్పడం తప్పా చిట్టీ?’ అని అడిగాడు చిన్నా.

అప్పుడు చిట్టి నవ్వుతూ.. ‘చిన్నా! నీకు ఎప్పుడో చెప్పాను. ‘పెద్దవాళ్లు ఏది చెప్పినా అది మన మంచి కోసమే చెబుతారని. నా చిన్నప్పుడు మా అమ్మకు చెప్పకుండా దూరంగా ఎగిరి వెళ్లిపోయాను. అప్పుడు అమ్మ మందలించింది. కానీ అమ్మ మీద నేను కోపం తెచ్చుకోలేదు. నా కోసమే కదా చెప్పింది అనుకున్నాను’ అంది. ‘అవునా..’ అని ఆశ్చర్యంగా అడిగాడు చిన్నా. ‘అవును చిన్నా.. అన్నట్లు నేను ఈ సంక్రాంతికి కూడా మా బంధువుల ఇంటికి వెళుతున్నాను. పల్లెటూళ్లో మా వాళ్లు ఎంతో ఐక్యంగా ఉంటారు. వాళ్లను చూస్తే భలే ముచ్చటగా ఉంటుంది. కనుమ రోజు కాకి కూడా నదిలో స్నానం చేస్తుందనే సామెత ఉంది. అది నిజమే!

సంక్రాంతి మూడు రోజులూ మా బంధువుల మధ్య ఆనందంగా గడిపి, తిరిగి వస్తాను. అది నీకు చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను. మరి నువ్వేం చేస్తావు? మీ తాతయ్య ఇంటికి వెళతావా? లేదా?’ అని చిన్నాను అడిగింది చిట్టి. ‘నువ్వూ అమ్మా చెప్పాక కూడా.. నేను ఎందుకు వెళ్లను. తాతయ్య నా మంచికోసమే చెప్పారని అర్థమైంది. తాతయ్య మీద కోపం పోయింది. కాబట్టి ఇప్పుడే అమ్మ దగ్గరకు వెళ్లి.. తాతయ్య ఇంటికి వస్తానని చెబుతాను’ అని చిట్టితో అన్నాడు చిన్నా. ‘మంచిది చిన్నా.. ఇదిగో జామపండు’ అంటూ పండును కోసి చిన్నా చేతిలో వేసింది చిట్టి. ఆ జామపండును అందుకుంటూ ‘సంక్రాంతి సెలవులు అయ్యాక మళ్లీ కలుద్దాం.. టాటా చిట్టీ’ అంటూ ఇంట్లోకి నడిచాడు చిన్నా.

చిన్నా అటు వెళ్లగానే ‘చిన్నా.. నాకు రెక్కల్లో బలం తగ్గింది. రోజూ నీకోసం ఎగురుకుంటూ రావడం కష్టంగా ఉంటోంది. కొంత విశ్రాంతి తీసుకుంటే రెక్కల్లో ఓపిక వస్తుంది. నువ్వు మీ తాతయ్య ఇంటికి వెళ్లాలనే నేను మా బంధువుల ఇంటికి వెళుతున్నానని చెప్పాను. నన్ను మన్నించు చిన్నా. సంక్రాంతి పండగ రోజుల తర్వాత నీకోసం తప్పకుండా తిరిగి వస్తాను’ అని చిట్టి తన మనసులో అనుకుని అక్కణ్నుంచి ఎగిరి వెళ్లిపోయింది.  

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని