ఎవరికి వారే మేటి!

ఎనిమిదో తరగతి చదివే ప్రణవి అద్భుతమైన నాట్యప్రదర్శన చూసి సభ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రణవి చదివే బడిలోనే.. మయూరి ఆరో తరగతి చదువుతోంది. ప్రణవిలాగా తనకు కూడా నాట్యం చేయాలనే కోరిక కలిగింది. తను కూడా నాట్యం నేర్చుకుని ప్రదర్శనలు

Published : 19 Jan 2022 00:05 IST

ఎనిమిదో తరగతి చదివే ప్రణవి అద్భుతమైన నాట్యప్రదర్శన చూసి సభ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రణవి చదివే బడిలోనే.. మయూరి ఆరో తరగతి చదువుతోంది. ప్రణవిలాగా తనకు కూడా నాట్యం చేయాలనే కోరిక కలిగింది. తను కూడా నాట్యం నేర్చుకుని ప్రదర్శనలు ఇచ్చి, అందరి మెప్పూ పొందాలని ఆశపడింది. మరుసటి రోజే.. ప్రణవి నాట్యం ఎక్కడ నేర్చుకుంటోంది, తదితర వివరాలన్నీ అడిగి తెలుసుకుంది.

మయూరి నాట్యం మీద ఆసక్తి చూపడంతో ఆమె తల్లి ఎంతగానో సంతోషించింది. మయూరి చురుకైన పిల్ల కావడంతో తను బాగా నేర్చుకోగలదని ఆమె తల్లికి తెలుసు. అందుకే మయూరి ఆశ పడినట్టుగానే ప్రణవి నేర్చుకునే నాట్యకళామందిరంలోనే చేర్పించింది.

మయూరి అక్కడ గురువు చెప్పినట్టుగానే చేసేది కానీ.. ఎందుకో ఆమె నాట్యం బాగా చేయలేకపోయేది. మయూరి నాట్యం చేస్తున్నంత సేపు.. ప్రణవి నాట్యప్రదర్శనే కళ్ల ముందు కనిపించేది. ప్రణవిలాగా అద్భుతంగా నాట్యం చేయటం తనకు ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచనే మయూరి మనసులో ఉండేది.

ఒకరోజు గురువుగారు ప్రణవిని పిలిచి ‘అమ్మా! నీకు నేను కొత్త గురువును నియమిస్తున్నాను. ఆయన శిక్షణలో నువ్వు బాగా రాణిస్తావని నా నమ్మకం’ అని చెప్పారు. తను సరిగా నాట్యం చేయలేకపోవడం వల్లనే వేరే గురువు దగ్గరకు పంపిస్తున్నారని బాధపడింది మయూరి. మరుసటి రోజు నుంచి కొత్త గురువు గారి దగ్గరకు శిక్షణకు వెళ్లడం ప్రారంభించింది.

మొదటి రోజు మయూరికి ఒక తెల్లకాగితం ఇచ్చి నచ్చిన బొమ్మ గీయమన్నారు కొత్త గురువుగారు. నృత్యం నేర్చుకోవడానికి వస్తే బొమ్మ ఎందుకు వేయమన్నారో అర్థం కాలేదు మయూరికి. కానీ గురువుగారి మాటకు గౌరవం ఇచ్చి అలాగే చేసింది. మరుసటి రోజు మయూరిని ఆయన పాట పాడమన్నారు. ముందురోజు అంత ఆశ్చర్యపడకుండా.. ఆయన అడిగినట్లు పాట పాడింది. మూడో రోజు గురువుగారు ఆమెను సొంతంగా ఒక పాట రాయమన్నారు. ఆయన చెప్పినట్లే చేసింది. కానీ తనకు నాట్య శిక్షణ మొదలు పెట్టనందుకు కాస్త నిరుత్సాహపడింది మయూరి.

ఇలా ఒక వారం గడిచింది. మయూరికి మాత్రం నాట్యతరగతులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇంతలో ప్రణవి మరో నాట్య ప్రదర్శన ఇవ్వడంతో మయూరి చాలా అసహనంగా ఉంది. గురువు దగ్గరకు వెళ్లి.. ‘గురువుగారూ! నాకు నాట్యం సరిగా చేయడం రాదనే మీరు నేర్పట్లేదా?’ అనడిగింది బాధగా.

ఆయన అనునయంగా.. ‘తల్లీ! నువ్వు నాట్యం చాలా బాగా చేయగలవు. కానీ నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు. ప్రణవి ఆరేళ్లుగా నాట్యం నేర్చుకుంటోంది. అందుకే ఇప్పుడు ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి వచ్చింది. నువ్వూ ఆ స్థాయికి చేరుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. తనను స్ఫూర్తిగా తీసుకుని నాట్యం నేర్చుకోవాలనుకోవడం మంచిదే కానీ.. తనతో పోల్చుకోవడం తప్పు. ఎవరితోనూ పోలిక తగదు. ఎవరికి వారే ప్రత్యేకం. అలాగే నువ్వు కూడా.

నీలో ఏమేమి ప్రతిభలు ఉన్నాయో తెలుసుకోవడం కోసమే నీకు రోజుకోరకమైన పరీక్ష పెట్టాను. నీకు మంచి గాత్రంతో పాటు రచనా శక్తి ఉంది. అది నీ వయసు పిల్లల్లో అరుదుగా కనిపించే అసాధరణ ప్రతిభ. మన బలాలను తెలుసుకుని ఆ దిశగా కృషి చేస్తే మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. అలాగే పట్టుదల ఉంటే కాదేదీ అసాధ్యం. నువ్వు ఇష్టపడే నాట్యంలో ప్రదర్శనలిచ్చేస్థాయికి ఎదగాలంటే నిరంతర సాధన అవసరం. ఆ సమయం వచ్చే వరకు మనం చేయాల్సిన పని మీద మాత్రమే దృష్టిపెట్టాలి’ అన్నారు.

గురువు మాటలతో మయూరికి తను చేయాల్సిందేంటో అర్థమైంది. కొంతకాలంలోనే మయూరి నృత్యంతోపాటు సంగీతసాహిత్యాల్లోనూ మంచి పట్టు సాధించింది.

- హారిక చెరుకుపల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు