Published : 22 Jan 2022 00:53 IST

ఓ బాటసారి.. ఓ దొంగ!

విపురంలో రెండురోజులుగా ఒక ఇంటికి తాళం వేసి ఉంది. అది గమనించాడు నాగులు అనే దొంగ. వాళ్లు ఏదో పనిమీద హడావుడిగా ఊరెళ్లారని తెలుసుకున్నాడు. ఆ రాత్రివేళ ఊరంతా గాఢనిద్రలో మునిగిపోయాక తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లాడు. బీరువాలో బోలెడు నగలతోపాటు మిలమిలలాడే మూడు వజ్రాలు కూడా ఉండడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. విప్పారిన మొహంతో అన్నింటినీ సంచిలో వేసుకుని బయటపడ్డాడు. వేగంగా పట్నం వైపు నడక సాగించాడు. వెలుగురేఖలు విచ్చుకుని తెలతెలవారే సమయానికి మరో పల్లెనూ దాటి.. అడవిలోకి ప్రవేశించాడు.

ఆ చిన్నపాటి అడవిని దాటేస్తే హాయిగా పట్నం చేరిపోవచ్చు. ఆ సొమ్ముతో దర్జాగా బతకొచ్చు. బరువైన సంచిలో సొమ్ముల విలువ ఊహించుకుని మురిసిపోతూ రకరకాల ఊహల్లో మునిగితేలుతున్నాడు నాగులు. అంత విలువైన నగలను అందులోనూ వజ్రాలను తస్కరించడం ఇదే తొలిసారి.

వేగంగా నడుస్తున్న నాగులుకు చెవిపురం డొంకదారి వద్ద మరో వ్యక్తి తారసపడ్డాడు. నాగులును చూడగానే అతడి మొహం విప్పారింది. ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ నడవక్కర్లేకుండా.. తోడు దొరికినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు.

ఆ బాటసారి తన చేతిలో సంచిని పదిలంగా పట్టుకున్న తీరు చూసి అందులో విలువైన వస్తువో, డబ్బో ఉందని నాగులు దొంగబుద్ధి పసిగట్టింది.

మధ్యాహ్నం అయ్యేవేళకు ఇద్దరూ అలసటతో ఒక మర్రిచెట్టు కింద ఆగారు. ‘తినేసి కాసేపు ఈ నీడలో సేదదీరి బయలుదేరదాం’ అన్నాడా బాటసారి స్నేహపూర్వకంగా. ‘అయ్యో.. నా దగ్గర తినడానికేమీ లేవు’ అన్నాడు నాగులు నొచ్చుకుంటూ. ‘ఏం ఫర్వాలేదు. నేను గోంగూరపచ్చడి, పెరుగన్నం తెచ్చాను. ఇద్దరం కలిసి తిందాం’ అన్నాడా బాటసారి ఆప్యాయంగా.

ముందు మొహమాట పడినా.. ఆకలి మీదున్న నాగులు కడుపారా తిన్నాడు. భుజానున్న తుండుగుడ్డ పరిచి నడుం వాల్చారు ఇద్దరూ. రాత్రంతా నిద్రలేని కారణం వల్లో, కడుపారా తినడం చేతో.. మరి నాగులుకు వెంటనే కునుకు పట్టేసింది. మెలకువ వచ్చేసరికి తలంతా దిమ్ముగా ఉంది. పక్కన బాటసారి లేడు. తన సంచి కూడా లేదు. పైగా చీకటి కావస్తోంది. అంటే తాను అయిదారుగంటలకు పైనే మొద్దు నిద్రపోయుండాలి. ఆ బాటసారి ఆహారంలో ఏదో మత్తుమందు కలిపి ఉంటాడు. అంటే అతడూ దొంగే అన్నమాట అనుకున్నాడు.

‘నిజానికి ఆ బాటసారికి నిద్రపట్టగానే అతని దగ్గరున్న సంచి తీసుకుని నేను ఉడాయిద్దామనుకున్నాను. కానీ అతడే నా సంచి పట్టుకుపోయాడు. తాడిని తన్నేవాడు ఉంటాడనుకుంటే తలను తన్నేవాడు ఉంటారంటారు.. అంటే ఇదేనేమో’ అని తనలో తాను అనుకున్నాడు. ‘ఒక్కరాత్రిలో శ్రమపడి దోచిన సొమ్ము మరో దొంగపాలైతేనే నాకింత బాధ కలిగింది కదా. మరి జీవితాంతం సంపాదించిన ఒకరి కష్టార్జితాన్ని తాను దొంగిలించినపుడు వారి శోకానికి అంతుంటుందా?’ అనుకుంటూ పట్నంవైపు నడక ప్రారంభించాడు మారిన దొంగ.. నాగులు.

- గుడిపూడి రాధికారాణి


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని