రాజ్యాంగానికి పట్టాభిషేకం!

మాధవరావు మాస్టారు.. నాలుగో తరగతి ఉపాధ్యాయుడు. ప్రతి రోజూ పది తెలుగు పదాలు చెప్పి, పిల్లలు సరిగా రాస్తున్నారో లేదో తనిఖీ చేయడం ఆయనకు అలవాటు. ఒకరోజు గోపీ అనే అబ్బాయి, రాయకుండా ఉండటం మాస్టారు గమనించారు. వెంటనే ‘ఏంటి గోపి.. రాయకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమైంది?’ అని అడిగారు. ‘ఏం లేదు మాస్టారూ’ అని తడబడ్డాడు గోపి

Published : 26 Jan 2022 00:52 IST

మాధవరావు మాస్టారు.. నాలుగో తరగతి ఉపాధ్యాయుడు. ప్రతి రోజూ పది తెలుగు పదాలు చెప్పి, పిల్లలు సరిగా రాస్తున్నారో లేదో తనిఖీ చేయడం ఆయనకు అలవాటు.
ఒకరోజు గోపీ అనే అబ్బాయి, రాయకుండా ఉండటం మాస్టారు గమనించారు. వెంటనే ‘ఏంటి గోపి.. రాయకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమైంది?’ అని అడిగారు. ‘ఏం లేదు మాస్టారూ’ అని తడబడ్డాడు గోపి. కానీ మాధవరావు మాస్టారు అంత సులభంగా ఏదీ వదలరు. అందుకే ‘ఫర్వాలేదు గోపి.. దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పు.. మనసులో దాచుకుంటే తెలివితేటలు ఎలా వికసిస్తాయి. ఏం సందేహమున్నా అడిగి తెలుసుకోవాలి. కలెక్టరవుతానని అన్నావుగా. అన్ని విషయాలు తెలుసుకుంటేనే.. చదువులో ముందుంటావు, కలెక్టరు కూడా అవుతావు. చెప్పు’ అంటూ ప్రోత్సహించారు మాస్టారు.
అప్పుడు గోపి నిలబడి ‘పొద్దున్న గ్రౌండ్‌లో హెడ్మాస్టారు గారు రిపబ్లిక్‌డే రోజున జెండా ఎగరేయాలి’ అని అన్నారు. అసలు ఆగస్టులో కదా స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజు జెండా ఎగరేశాం. మళ్లీ రిపబ్లిక్‌ డే రోజు ఎందుకు? అసలు రిపబ్లిక్‌ డే అంటే ఏంటి మాస్టారు’ అన్నాడు. ‘ఓ అదా నీ సందేహం’ అని నవ్వుతూ అన్నారు మాస్టారు. ‘అవును మాస్టారు.. నా సందేహం తీర్చండి’ అన్నాడు గోపి.
‘ఎలా చెబితే అర్థమవుతుంది?’ అనుకుంటూ ఆలోచనలో పడ్డారు మాస్టారు. అంతలో చిన్న తరగతి పిల్లలను, పెద్ద తరగతుల పిల్లలు ఆడే ఆటలను చూపించడానికి తీసుకు వెళ్లమని పిలుపొచ్చింది. పిల్లలంతా సరదా పడ్డారు. అందరూ మైదానం చేరారు. అప్పటికే కొంతమంది పిల్లలను రెండు జట్లుగా చేసి, అక్కడున్న డ్రిల్‌ మాస్టారు ఆ పిల్లలకు కబడ్డీ ఆట నిబంధనలు తెలియజేస్తున్నారు. తన తరగతి పిల్లలను కబడ్డీ ఆట నిబంధనలు వినమని చెప్పారు మాధవరావు మాస్టారు.
ఆట మొదలయింది. డ్రిల్‌ మాస్టారు, విద్యార్థులు ఆడే ఆటను జాగ్రత్తగా గమనిస్తూ ఎవరైతే నిబంధనలు అతిక్రమించి ఆడుతున్నారో వారిని ఔట్‌ చేయడమో లేదా చివాట్లు పెట్టి సరైన రీతిలో ఆటాడించడమో చేస్తున్నారు. ఆట పూర్తయింది. డ్రిల్‌ మాస్టారు విజయం సాధించిన జట్టును ప్రకటించారు. అక్కడున్న పిల్లలంతా ఆ జట్టును అభినందించారు. మాధవరావు మాస్టారు తరగతి పిల్లలు, మరికొన్ని ఆటలు చూసి.. తరగతి గదికి చేరుకున్నారు.
అందరూ కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మాస్టారు ‘పిల్లలూ మీరిప్పుడు ఆటలు ఆడే తీరు చూశారు కదా! మీకేం తెలిసింది?’ అని అడిగారు. వెంటనే గోపి లేచి ‘ఆటలు నిబంధనల ప్రకారం ఆడాలి అని తెలుసుకున్నానండి’ అని చెప్పాడు. అప్పుడు మాస్టారు ‘గుడ్‌ గోపి.. ఆటలకు నిబంధనలు ఎలా ఉంటాయో.. అదేవిధంగా పరిపాలనకోసం కూడా నిబంధనలు ఉంటాయన్నమాట’ అన్నారు మాస్టారు. పిల్లలంతా ఆసక్తిగా వినేందుకు సిద్ధమయ్యారు.
మళ్లీ మాస్టారు అందుకుని ‘మన దేశం స్వాతంత్య్రం సాధించాక.. ఎలా పరిపాలన చేసుకోవాలో తెలియడానికి మన పెద్దలు, కొన్ని నిబంధనలు సమకూర్చారు. ఆ నిబంధనలను తెలుపుతూ పెద్ద పుస్తకమే రాశారు. ఆ పుస్తకాన్నే రాజ్యాంగం అంటారు. ప్రభుత్వాన్ని నడిపేవారు, ఆ రాజ్యాంగం ప్రకారం పాలన చెయ్యాలి. అలా చేస్తేనే మన పెద్దలు మన మంచికోసం చేసిన నిర్ణయాలు అమలవుతాయి. అప్పుడే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజా పరిపాలన వర్థిల్లుతాయి. అలా జరగనప్పుడు మనం దుర్మార్గ పాలనకు గురవుతాం. ఇప్పుడు తెలిసిందా పిల్లలూ మన రాజ్యాంగం గొప్పతనం. అంతేకాదు.. మనం బ్రిటిష్‌ వారి నుంచి స్వాతంత్య్రం పొందాక మన పెద్దలు రాసే రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నారు. అది పందొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి 26వ తేదీన ఆరంభమయింది. కాబట్టి ఆ రోజు మన రాజ్యాంగానికి పట్టాభిషేకం జరిగిందన్నారు. అందుకే గుర్తుగా ఆరోజున రిపబ్లిక్‌డే పండగ చేసుకుంటాం అన్నమాట’ అని చెప్పారు మాస్టారు. పిల్లలంతా రిపబ్లిక్‌ డే గొప్పతనం తెలుసుకున్నందుకు సంతోష పడ్డారు. ఇంతలో గోపీ లేచి ‘రాజ్యాంగం లేకపోతే పరిపాలన చేసేవారు వారికి నచ్చినట్లు చేస్తారు. ప్రజలకు మంచి జరగడానికి రాజ్యాంగం భలేగా ఉపయోగపడింది మాస్టారూ. ఈరోజు మంచి విషయం తెలుసుకున్నాం’ అన్నాడు. గోపి ముఖంలో సంతృప్తిని చూసి మాధవరావు మాస్టారు ఎంతో ఆనందించారు.  

-బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని