నిజమైన స్నేహితులు!

‘జలకళ’ అనే చెరువులో చేపలు, కప్పలు, తాబేళ్లు ఎంతోకాలంగా జీవిస్తున్నాయి. నడి వేసవిలోనూ ఆ చెరువులో పుష్కలంగా నీరు ఉంటుండటంతో ఆ జీవాలకు హాయిగా కాలం గడిచిపోయేది.ఆ చెరువులో ‘మీనా’ అనే చేప, ‘మండూక’ అనే కప్ప, ‘కమఠ’ అనే తాబేలు మంచి స్నేహితులు.

Published : 26 Feb 2022 01:07 IST

‘జలకళ’ అనే చెరువులో చేపలు, కప్పలు, తాబేళ్లు ఎంతోకాలంగా జీవిస్తున్నాయి. నడి వేసవిలోనూ ఆ చెరువులో పుష్కలంగా నీరు ఉంటుండటంతో ఆ జీవాలకు హాయిగా కాలం గడిచిపోయేది.
ఆ చెరువులో ‘మీనా’ అనే చేప, ‘మండూక’ అనే కప్ప, ‘కమఠ’ అనే తాబేలు మంచి స్నేహితులు. అప్పుడప్పుడూ మండూక చెరువు నుంచి బయటకి వచ్చి చుట్టుపక్కల పచ్చికలో తిరిగి వచ్చేది. కమఠ కూడా నెమ్మదిగా నడుచుకుంటూ చెరువు చుట్టూ తిరిగేది. అలా అవి బయట నుంచి నీళ్లలోకి వెళ్లగానే ‘మీనా’కు పచ్చిక బయళ్లు, పచ్చని అందాల గురించి కథలు కథలుగా చెబుతుండేవి.
అప్పటికప్పుడే తానూ ఆ రమణీయ దృశ్యాలను చూడాలనే ఉత్సాహంతో.. మీనా కూడా నీటి మధ్యలోంచే పైకి ఎగురుతుండేది. నిజంగానే ఆ కొద్ది సమయంలోనే పరిసరాలు దానికి ఎంతో అందంగా కనిపించేవి. దాంతో ప్రతిసారీ తనను కూడా బయటకు తీసుకెళ్లమని స్నేహితులను కోరేది మీనా. కానీ, అవి ‘వద్దు. నువ్వు బయట ఎక్కువసేపు ఉండలేవు. అక్కడ జరిగే విశేషాలను మేమొచ్చి నీకు చెబుతుంటాం’ అనేవి. మిత్రులు కాదనడంతో మీనాకు కోపమొచ్చి వాటితో మాట్లాడటం మానేసింది. మండూక, కమఠ మాత్రం మీనాతో మాటలు కలిపే ప్రయత్నం చేస్తూ.. నిత్యం దాన్ని గమనిస్తూ ఉండేవి.
అదేరోజు సాయంత్రం మీనా గట్టు దగ్గరకొచ్చి కళ్లు బయటపెట్టి ప్రపంచాన్ని చూస్తుండటాన్ని ‘బకము’ అనే కొంగ గమనించింది. వెంటనే, ‘మిత్రమా! నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అలా కళ్లు మాత్రమే బయటపెట్టి చూస్తున్నావేంటి?’ అని అడిగిందా కొంగ. ‘అదా.. నా మిత్రులిద్దరూ అప్పుడప్పుడూ బయటకు వచ్చి చుట్టూ ఉన్న చెట్లు, పక్షులను చూసి వచ్చి.. వాటి గురించిన ఎన్నో వింతలు, విశేషాలను నాకు చెబుతుంటాయి. నేనూ వస్తాను అంటే అవి ఒప్పుకోవడం లేదు’ దీనంగా బదులిచ్చింది చేప.
‘అయ్యో.. అలా అయితే నీ కోరిక తీర్చలేని ఆ రెండూ నీకు స్నేహితులు ఎలా అవుతాయి? రేపు ఉదయాన్నే మళ్లీ రా.. నేను తీసుకెళ్లి, దగ్గరుండి అన్నీ చూపిస్తా. సాయంత్రానికి చెరువులో దిగబెడతా’ అంటూ నమ్మించింది కొంగ. సరేనంటూ ఆనందంగా నీటి లోపలికి వెళ్లిపోయింది మీనా.
మీనా గట్టు దగ్గర కొంగతో మాట్లాడిన మాటలన్నీ మండూక, కమఠ విన్నాయి. అందుకే, మీనా నీళ్లలోకి రాగానే దాని దగ్గరకు వెళ్లి ‘నువ్వు జిత్తులమారి కొంగతో మాట్లాడిందంతా విన్నాము. దాంతో స్నేహం ప్రమాదకరం. నీ మంచిని కోరే మా మాట విను. దాంతో బయటకు వెళ్లవద్దు’ అని బతిమిలాడాయి. కానీ, మీనా వాటి మాటలను లెక్క చేయలేదు సరికదా.. ‘నేను అందంగా ఉంటానని అసూయ మీకు. నన్ను తీసుకెళ్తే బయటివాళ్లు ఎక్కడ మిమ్మల్ని ఈసడించుకుంటారోనని మీ బాధ’ అంటూ కోపగించుకుంది.
మీనా మాటలకు అవి బాధపడలేదు. పైగా దాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకు ఓ పథకమూ రచించాయి. మరుసటి రోజు ఉదయమే మీనా గట్టు దగ్గరకు చేరుకొని, కళ్లు బయటకు పెట్టి చూసింది. అక్కడే కాచుకొని ఒంటికాలిపై నిలబడి ఉంది కొంగ. మీనాను చూసి.. ‘వచ్చావా మిత్రమా! నీకోసమే చూస్తున్నా. ఒక్క గెంతు గెంతితే గట్టు మీదకొచ్చి పడతావు. వెంటనే నిన్ను తీసుకెళ్లి చుట్టూ ఉండే కొండలు, అడవి అందాలను చూపించి తీసుకొస్తా’ అంది.
‘ఓ.. అలాగే’ అంటూ ఒక్క గెంతుతో గట్టు మీద పడి కొట్టుకోసాగింది మీనా. రెప్పపాటులో దాన్ని నోట కరుచుకుంది కొంగ. ‘అయ్యో.. అసలే ఊపిరాడక గింజుకుంటుంటే, నన్ను నోట కరుచుకున్నావేంటి?’ అతికష్టమ్మీద అమాయకంగా అడిగింది మీనా. ‘నిన్ను తినడానికే ఈ పథకమంతా’ అని కొంగ నోరు తెరిచేసరికి.. నోట్లోంచి మీనా బయటకు దూకేసింది. వెంటనే దాన్ని కాలితో తొక్కిపట్టింది కొంగ.
చెరువులోంచి ఇదంతా గమనిస్తున్న మండూక, ఒక్కసారిగా ఎగిరి గట్టుపైనున్న కొంగ పీక పట్టుకునేసరికి అది బోర్లాపడిపోయింది. మరుక్షణమే మీనా దాని కాలి కింద నుంచి తప్పించుకుంది. కమఠ నడుచుకుంటూ వచ్చి కొంగపైన కూర్చోవడంతో.. దాని బరువుకు అది ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు విడిచింది. గట్టుపైన గిలగిలా కొట్టుకుంటున్న మీనాను తన కాళ్లతో పట్టుకొని చెరువులోకి గెంతింది మండూక. దానివెంటే కమఠ కూడా నీళ్లలోకి చేరింది.
తాను చేసిన పొరపాటు ఏంటో మీనాకు తెలిసొచ్చింది. అప్పటినుంచి మిత్రులతో స్నేహంగా ఉండసాగింది.  

- కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని