మహిరుధ్‌ ఎక్కడికెళ్లాడు...!

ఒక రోజు తెలుగు మాస్టారు రామాచారి ఏడో తరగతి విద్యార్థులకు పాఠం చెబుతున్నారు. గదిలో తేరిపారా చూసి... ‘మహిరుధ్‌ ఎక్కడ?’ అని అడిగారు. ‘మొదటి పీరియడ్‌ అయ్యాక వెళ్లిపోయాడు సార్‌’ పిల్లలంతా ఒకేసారి

Updated : 01 Mar 2022 00:50 IST

క రోజు తెలుగు మాస్టారు రామాచారి ఏడో తరగతి విద్యార్థులకు పాఠం చెబుతున్నారు. గదిలో తేరిపారా చూసి... ‘మహిరుధ్‌ ఎక్కడ?’ అని అడిగారు. ‘మొదటి పీరియడ్‌ అయ్యాక వెళ్లిపోయాడు సార్‌’ పిల్లలంతా ఒకేసారి జవాబు చెప్పారు. ఇంకోరోజు పాఠశాల వదలక ముందే, మహిరుధ్‌ గేటు దాటి వెళ్లడం మాస్టారు గమనించారు. అలా రెండు మూడు సార్లు, చెప్పకుండానే మహిరుధ్‌ బడి నుంచి వెళ్లిపోవడం చూశారాయన..

‘వీడి వ్యవహారం ప్రధానోపాధ్యాయుడికి చెప్పాలి’ అనుకున్నారు. ఒకరోజు ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ రామాచారి మాస్టారు.. విద్యార్థి మహిరుధ్‌ గురించి చెప్పారు. ఇంతలో అక్కడికి ఒక పోలీసాయన వచ్చి, ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకుని మాట్లాడుతూ... ‘దగ్గర్లోని రైల్వేస్టేషన్‌లో జేబుదొంగలు ఎక్కువగా ఉన్నారు. వారిలో మీ పాఠశాల విద్యార్థులెవరైనా ఉన్నారేమోనని మా అనుమానం. విచారణకు మీరు మాకు సహకరించాలి’ అని అడిగాడు.

చాలా మంది ఉపాధ్యాయులకు ఆ మాటలు నమ్మశక్యం కాలేదు. పోలీసు చెప్పిన విషయాలు విన్నాక, రామాచారి మాస్టారికి మహిరుధ్‌పై అనుమానమొచ్చింది. ‘మహిరుధ్‌ ప్రవర్తన గమనిస్తుంటే.. దొంగతనాలతో వీడికి సంబంధం ఉన్నట్లుంది’ అనుకున్నారు. వెంటనే తన అనుమానాన్ని ప్రధానోపాధ్యాయుడికి చెప్పారు.

‘వాడి గురించి పిల్లల్ని కూడా అడిగాకే, ఒక అంచనాకు వద్దాం’ అంటూ.. హాజరు పుస్తకం తెప్పించుకుని పరిశీలించారాయన. ‘మహిరుధ్‌ నెలకు పదిరోజులు బడికి రావడం లేదు. నేరుగా అడిగితే సరైన సమాధానం రాకపోవచ్చు’ అనుకున్నారు. ఆరోజు సాయంకాలం.. విజయ్‌ అనే ఏడో తరగతి విద్యార్థిని పిలిచి మహిరుధ్‌ గురించి అడిగారు ప్రధానోపాధ్యాయుడు.

‘మహిరుధ్‌ సరిగా బడికి రాడు సార్‌. ఇష్టమొచ్చినప్పుడు వస్తాడు. ఎప్పుడు వెళతాడో కూడా తెలియదు’ అని తాను గమనించింది చెప్పాడతను. ఆ తర్వాత మరో విద్యార్థిని పిలిచి మహిరుధ్‌ గురించి వాకబు చేశారు. అతడూ విజయ్‌ మాదిరే చెప్పాడు. తరవాత ప్రధానోపాధ్యాయుడు, రామాచారి మాస్టారిని పిలిచి... ‘మహిరుధ్‌ నిజంగా దొంగతనాలు చేస్తున్నాడో, లేదో తెలియదు. ఈ విషయాన్నే పోలీసులకు చెప్పి, సున్నితంగా వ్యవహరించి నిజం రాబట్టమని కోరదాం’ అంటూ గతంలో పాఠశాలకు వచ్చిన పోలీసుకు ఫోన్‌ చేశారాయన. ‘మా విద్యార్థుల్లో ఒకరిపై అనుమానం ఉంది. మీరు బడి దగ్గరకు వస్తే వివరాలు చెబుతాం’ అన్నారు.

‘అలాగా.. నేను ఇప్పుడే వస్తున్నాను’ అని, చెప్పిన కాసేపటికే బడి దగ్గరకు వచ్చాడా పోలీసాయన. ఆనందరావు మైదానంలో ఉన్న మహిరుధ్‌ను పోలీసుకు చూపుతూ.. ‘మాకు ఆ విద్యార్థిపై అనుమానం మాత్రమే.. చిన్నపిల్లవాడు కదా! సున్నితంగా విచారించండి’ అని చెప్పారు.

‘మీరు అంతలా చెప్పాలా. నిజంగా దొంగతనాలు చేస్తుంటే, అతడి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దండించడం జరగదు. కొద్ది రోజుల్లోనే ఆరా తీస్తాను సార్‌’ అని పోలీస్‌ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మహిరుధ్‌పై పోలీసులు నిఘా ఉంచారు.

ఒకరోజు సాయంత్రం స్టేషన్‌కు రమ్మని ప్రధానోపాధ్యాయుడికి కబురొస్తే వెళ్లారు. ‘వెంటనే వచ్చినందుకు ధన్యవాదాలు. మీకో దృశ్యం చూపించాలి’ అంటూ పోలీస్‌ జీప్‌లో ఆయన్ను ఊరి చివరి మురికివాడ దగ్గరకు తీసుకెళ్లారు. వారికి అక్కడ కాస్త దూరంలో మహిరుధ్‌ ఒక చక్రాల కుర్చీని నెట్టుకుంటూ వెళుతున్నాడు. అందులో కాళ్లు, చేతులు సరిగాలేని స్థితిలో ఉన్న మహిళ ఉంది.

‘వాడు మహిరుధ్‌ కదా?’ కళ్లద్దాలు సవరించుకుంటూ అడిగారు ఆనందరావు. ‘అవును సార్‌.. ఆ కుర్చీలో ఉన్నది అతడి తల్లి. ఆ పిల్లాడి తండ్రి చనిపోయాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షనే వారికి ఆధారం. తల్లికి అన్ని సేవలు తనే చేస్తున్నాడు. ఆమె కోసమే మహిరుధ్‌ పాఠశాలకు సరిగా రావడం లేదు. వచ్చినా.. తల్లికి ఏ అవసరం వస్తుందోనని, మధ్యలోనే వెళ్తున్నాడు’ అని పోలీసాయన వివరించి చెప్పాడు.

‘అయ్యో.. అలాగా!’ అని ఆనందరావు బాధపడ్డారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆయన ఆలోచనల నిండా మహిరుధే! ‘అనవసరంగా అనుమానించాం. ఇబ్బందులున్నా మహిరుధ్‌ బడికి రావటం నిజంగా గొప్ప విషయం. అతడి పరిస్థితి తెలుసుకోకుండా అనవసరంగా నిందలు వేశాం’ అని ఉపాధ్యాయులతో వాపోయారు ఆనందరావు. ఇకనుంచి మహిరుధ్‌కు ఏ అవసరం వచ్చినా అండగా నిలవాలనీ నిర్ణయించుకున్నారు వారంతా.  

- హర్షిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని