మహారాజు పంటి కింద రాయి!

పూర్వం ధర్మగిరి రాజ్యానికి ప్రసేనుడు రాజు. ఒకసారి మిత్రదేశాల రాజులను ఆయన విందుకు ఆహ్వానించాడు. ఆటలూ, కబుర్లతో కాలక్షేపం తర్వాత అందరితో కలిసి విందు ఆరగిస్తుండగా మహారాజు పంటికి రాయి తగిలింది. ‘అబ్బా..’ అని దవడను పట్టుకోవడంతో అందరూ అటే చూశారు.

Updated : 05 Mar 2022 07:50 IST

పూర్వం ధర్మగిరి రాజ్యానికి ప్రసేనుడు రాజు. ఒకసారి మిత్రదేశాల రాజులను ఆయన విందుకు ఆహ్వానించాడు. ఆటలూ, కబుర్లతో కాలక్షేపం తర్వాత అందరితో కలిసి విందు ఆరగిస్తుండగా మహారాజు పంటికి రాయి తగిలింది. ‘అబ్బా..’ అని దవడను పట్టుకోవడంతో అందరూ అటే చూశారు. మిత్రదేశాల పాలకులు వస్తున్న నవ్వును ఆపుకొంటూ ‘ప్రభూ.. ఈ ధాన్యం ఎవరు పండించారో అతడిని శిక్షించాల్సిందే!’ అన్నారు.

వెంటనే, మహారాజు మంత్రికి కబురుపెట్టి.. రాగానే విషయం చెప్పాడు. ‘అన్నంలో రాయి అంటే బియ్యంలో ఉండి ఉంటుంది. అది వదిలేసి ధాన్యం పండించిన రైతుకు శిక్ష వేయడం సమంజసం కాదేమో’ అని మనసులో అనుకున్నాడు మంత్రి. రాజు ఆదేశం కావడంతో మారుమాట్లాడకుండా సైనికులను తీసుకొని ఊళ్లోకి వెళ్లాడు.

షావుకారు దుకాణానికి వెళ్లి.. ‘రాజు గారి ఆదేశం ఇది. ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. నీకు ధాన్యం అమ్మిన రైతును వెతికి పట్టుకొని రేపు కొలువుకు తీసుకురా’ అని స్పష్టం చేశాడు మంత్రి. షావుకారు రైతుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ధాన్యం అమ్మిందెవరో చెబితే రాజు శిక్ష విధిస్తాడని తెలుసుకున్న రైతులు.. నోరు మెదిపే సాహసం చేయలేదు.

రామయ్య అనే రైతు కొడుకు శివయ్య గురుకులంలో చదువుకుంటూ సెలవులకు ఇంటికొచ్చాడు. తండ్రి ద్వారా విషయం తెలుసుకున్నాడు. ‘రైతులంతా భయపడుతున్నారు శివయ్యా.. ఏమవుతుందో ఏమో!’ అన్నాడు తండ్రి.

‘నాన్న గారూ.. మీరేం కంగారు పడకండి.. నా తెలివితేటలతో పరిస్థితినంతా చక్కదిద్దుతా. ఇప్పుడే కోటకు వెళ్తున్నా’ అని చెప్పి షావుకారును తీసుకొని వెళ్లాడు శివయ్య. రాజు సభలో కొలువుదీరి ఉండగా ‘మహారాజా.. ఆ ధాన్యం అమ్మింది మా నాన్న రామయ్య’ ధైర్యంగా చెప్పాడు శివయ్య. ‘అవును మహారాజా’ అన్నాడు షావుకారు.

‘మీరు చేసిన పొరపాటుకు శిక్ష ఏంటో తెలుసా?’ అడిగాడు రాజు. ‘ఉరిశిక్ష మహారాజా’ బదులిచ్చాడు శివయ్య. ‘కాదు.. ఒక కన్ను తొలగించడం’ అన్నాడు రాజు. ‘మహారాజా.. అందరూ బాగానే ఉంటారు. ఎండనకా వాననకా ఆరుగాలం కష్టపడి పంట పండించి, అందరి ఆకలి తీర్చే రైతుకే నష్టం జరుగుతోంది. మేము ధాన్యం మాత్రమే పండిస్తాం. వ్యాపారులే వాటిని బియ్యంగా మారుస్తారు. కావాలని రాళ్లు ఎవరూ కలపరు కదా!’ అన్నాడు శివయ్య.

‘మాటలు బాగా చెబుతున్నావు’ అంటూ ఆగ్రహించాడు రాజు. ‘అతడు గురుకులంలో చదువుతున్నాడు రాజా’ అన్నాడు మంత్రి. అక్కడే కూర్చున్న న్యాయాధికారి కూడా బాలుడి మాటలను ఆసక్తిగా వింటున్నాడు. ‘రాజా.. ఇప్పుడు అన్నంలో రాయి వచ్చింది కాబట్టి రైతును పిలిపించారు. అదే, వంట ఎంతో రుచికరంగా ఉంటే మీరేం చేస్తారు?’ ప్రశ్నించాడు శివయ్య. ‘వంటవాళ్లకు బంగారు నాణేలను బహుమతిగా ఇస్తాం’ అని టక్కున సమాధానమిచ్చిన రాజును.. ఆ బాలుడి ప్రశ్న ఆలోచనలో పడేసింది.

‘రాజా.. మీరు ఎలాగూ శిక్ష వేస్తాను అంటున్నారు కాబట్టి నేను మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వగలరా?’ అని అడిగాడు శివయ్య. సరేనన్నాడు రాజు. ఒకసారి మీ వంటవాళ్లను పిలిపించమని కోరడంతో.. లోపలి నుంచి వంట చేసే వ్యక్తి వచ్చాడు. ‘అయ్యా.. నీకు ఎంతమంది సహాయ పడుతుంటారు?’ అడిగాడు శివయ్య. ‘నలుగురు’ జవాబిచ్చాడు వంటవాడు. ఆ నలుగురు సహాయకులను కూడా పిలిపించమనడంతో అనుమతిచ్చాడు రాజు. సహాయకులు రాగానే ‘నిన్న రాజు గారు తిన్న అన్నంలో రాయి వచ్చింది. ఆ బియ్యాన్ని ఎవరు బాగుచేశారు?’ ప్రశ్నించాడు శివయ్య. ఆ నలుగురూ మేము చేయలేదని సమాధానమిచ్చారు.

‘చూశారా మహారాజా.. ఆ బియ్యాన్ని వండేముందు ఒక్కసారి కూడా ఎవరూ చూడలేదు. అంటే వంటవాడితో పాటు ఈ నలుగురూ కారకులు అవుతారు’ వివరించాడు శివయ్య. అయినా, ఒక్క రోజులో తగ్గిపోయే పంటి నొప్పికి.. కంటిని తీసేంత పెద్ద శిక్ష అవసరమా? ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి చిన్న విషయానికే కన్ను తీసేస్తే మీకే చెడ్డపేరు వస్తుంది’ అని రాజుకు అర్థమయ్యేలా చెప్పాడు శివయ్య. న్యాయాధికారి, మంత్రి కూడా ఆ వ్యాఖ్యలతో ఏకీభవించడంతో రాజు మెత్తబడ్డాడు.
‘శివయ్యా.. శిక్ష వేయడాన్ని వెనక్కి తీసుకుంటున్నాము. చిన్నవాడివైనా ఎంతో ధైర్యంగా మాట్లాడావు. గురుకులంలో నీ విద్య పూర్తయ్యాక మా ఆస్థానంలో కొలువు ఇస్తాను’ అనడంతో సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది.

- యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని