Updated : 13 Mar 2022 03:37 IST

కోతి తెలివి!

పొద్దున్నే నీళ్లు తాగడానికి చెరువు గట్టుకు బయలుదేరింది నక్క. ఇంతలో పిల్లి ఎదురు వచ్చింది. ‘రా పిల్లీ.. రా... సమయానికి వచ్చావు. నేను చెరువులో నీళ్లు తాగి, పనిలోపనిగా పీతలు పట్టడానికి వెళుతున్నా’ అంది నక్క. ‘సరే.. పదా’ అంటూ దాన్ని అనుసరించింది పిల్లి.

ఇంతలో.. ‘రాయి తీయలేని వాడు కూట్లో రాయితీస్తాడా ఏట్లో?’ అంది పిల్ల రామచిలుక. ‘చిట్టి చిలుకా.. పొద్దున్నే తిక్క సామెతలు ఎవరి మీద సంధిస్తున్నావు’ అంది నక్క. ‘అన్నీ తనకే తెలుసు అనుకునే కోతి మీద. దీన్ని పరిష్కరించలేక అది తెల్లమొఖం వేసింది’ అంది పిల్ల రామచిలుక అక్కడే ఉన్న కోతిని ఉడికిస్తూ.

ఇంతలో సింహ గర్జన వినిపించింది. వెంటనే నక్క, పిల్లి పొదలమాటున.. కోతి, పిల్ల రామచిలుక చెట్టుపైన నక్కాయి. కానీ పాపం ఇంతలోనే దారితప్పిన మేక ఒకటి నేరుగా సింహం ముందుకే వచ్చింది.

మేకను చూసిన సింహం ‘ఎవరు నువ్వు? నిన్ను ఇంతకు ముందెన్నడూ చూడలేదే!’ అంది. పరిస్థితి గమనించిన కోతి.. ‘ప్రభూ.. ఈ మేక దేవదూత. ఇది స్వర్గం నుంచి ఎగురుతూ వచ్చింది’ అంది. ‘ఏంటీ.. ఈ మేక స్వర్గం నుంచి ఎగురుతూ వచ్చిందా? నా చెవిలో ఏమన్నా పువ్వులు కనిపిస్తున్నాయా?’ అంది సింహం కోపంగా.

‘మృగరాజా! కోపగించుకోకండి. నేను, ఈ మేకను మేఘాల్లో ఎగరడం చాలా సార్లు చూశాను. నేను దీన్ని దేవదూత అని నిరూపిస్తా. కాకపోతే మీరు నేను చెప్పేదానికి అనుమతి ఇవ్వాలి’ అంది కోతి.

‘అలాగే.. కానీ మేకను గాల్లో ఎగరమను’ అంది సింహం. ‘మేకా.. నువ్వు స్వర్గానికి ఎగిరి వెళ్లడానికి ఎంతదూరం పరిగెత్తి ఊపు తెచ్చుకుంటావో.. అంతదూరం పరుగుతీయి. తర్వాత మృగరాజు ముందు.. ఆకాశంలో ఎగిరి చూపించు’ అంది కోతి.

తను పారిపోవడానికి కోతి సాయం చేస్తోందని మేకకు అర్థమైంది. దానికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేస్తూ శక్తినంతా కూడదీసుకుని ఒక్క ఉదుటున పరుగుతీస్తూ సింహానికి చిక్కనంత దూరం వెళ్లిపోయి కనుమరుగైంది మేక.
ఎంతసేపటికీ మేక తిరిగి రాకపోవడంతో కోతి తనను మోసగించిందని అర్థమైంది సింహానికి. కోతిని మందలిద్దామని చెట్టుపైకి చూసింది. కోతి ఎప్పుడో అక్కడి నుంచి వెళ్లిపోయింది. సింహం అవమానభారం, ఆకలి బాధతో గర్జిస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలింది.

సింహం అలా వెళ్లగానే ఇలా మళ్లీ ఒక్కచోట చేరిన నక్క, పిల్లి, పిల్ల రామచిలుక కోతి తెలివిని మెచ్చుకున్నాయి. కోతికి చాలా ఆనందం వేసింది. ‘అది సరే కానీ.. ఇందాక ఈ పిల్ల రామచిలుక నా మీద తిక్కల సామెత వేసింది. అదేంటో చెప్పనా’ అని నక్క, పిల్లితో అంది కోతి. అవి ఆసక్తిగా తలలూపాయి. ‘కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తాడా’ అంది కోతి. అక్కడ ఉన్న జీవులన్నీ ఒక్కసారిగా నవ్వుకున్నాయి.

- బెల్లంకొండ నాగేశ్వరరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని