మనసు మారింది!

శివకోన అడవికి రాజు సింహం. తను, పులి, నక్క, తోడేలు... ఇలా శక్తి, తెలివిగల జంతువులన్నీ తినేది మాంసాహారమేనని అది గర్వపడేది. శాకాహారం అసలు ఆహారమే కాదనీ భావించేది. శాకాహారజీవులను చులకనగా చూసేది. ఓసారి శాకాహార జంతువులన్నీ సింహానికి తెలియకుండా రహస్యంగా సమావేశమయ్యాయి. సింహం ప్రవర్తన, తమ కష్టాలను ఏనుగుకు చెప్పుకున్నాయి. చివరికి ఏనుగును, పావురాన్ని... సింహం దగ్గరికి రాయబారానికి పంపాయి.

Updated : 24 Mar 2022 06:34 IST

శివకోన అడవికి రాజు సింహం. తను, పులి, నక్క, తోడేలు... ఇలా శక్తి, తెలివిగల జంతువులన్నీ తినేది మాంసాహారమేనని అది గర్వపడేది. శాకాహారం అసలు ఆహారమే కాదనీ భావించేది. శాకాహారజీవులను చులకనగా చూసేది. ఓసారి శాకాహార జంతువులన్నీ సింహానికి తెలియకుండా రహస్యంగా సమావేశమయ్యాయి. సింహం ప్రవర్తన, తమ కష్టాలను ఏనుగుకు చెప్పుకున్నాయి. చివరికి ఏనుగును, పావురాన్ని... సింహం దగ్గరికి రాయబారానికి పంపాయి.

అవి రెండూ సింహం గుహ వద్దకు వెళ్లాయి. ఏనుగు.. ‘మృగరాజా!’ అని సింహాన్ని పిలిచింది. సింహం బయటకు వచ్చింది. ‘రాజా! నన్ను మన్నించి నా ఈ విన్నపాన్ని వినండి. మీరు శాకాహార జంతువులను అనవసరంగా చంపుతున్నారు. అలా చేస్తూ పోతే మాంసాహారులైన మీకు రాబోయే కాలంలో తినడానికి ఆహారం లేకుండా పోతుంది. ఇంకా శాకాహారుల ఆహారాన్ని కూడా మీరు నాశనం చేస్తున్నారు. అడవికి రాజుగా మీకిది తగదని ప్రార్థిస్తున్నాను’ అంది ఏనుగు ఎంతో వినయంగా. పక్కనున్న చెట్టు మీద కూర్చుని జరుగుతున్నదాన్ని చూడసాగింది పావురం.

‘ఆ పనికిమాలిన జంతువుల తరఫున నువ్వు రాయబారానికి వచ్చావా..? రాయబారిగా వచ్చావు కాబట్టి.. నిన్ను చంపకుండా విడిచి పెడుతున్నాను. ముందు ఇక్కడి నుంచి వెళ్లు’ అని గర్జించింది సింహం. చేసేది లేక వెనుదిరిగాయి ఏనుగు, పావురం. ‘సింహాన్ని ఎదిరించటం చాలా కష్టం. అసాధ్యం మాత్రం కాదు. కొంతకాలం వేచి చూద్దాం. ఈలోపు ఎవరూ సింహానికి చిక్కకుండా జాగ్రత్తగా ఉండండి’ అని శాకాహార జంతువులకు సలహా ఇచ్చింది ఏనుగు. కొంతకాలం గడిచింది. ఉన్నట్లుండి సింహానికి జబ్బు చేసింది. గుహ నుంచి కదలలేని స్థితికి వచ్చింది. చిక్కి శల్యం అయింది. ఇంకా కొన్ని రోజుల్లో సింహం చనిపోవడం ఖాయం!

శాకాహార జంతువులన్నీ మరోసారి సమావేశమయ్యాయి. సింహం చనిపోతున్నందుకు అవి సంతోషించాయి. సింహం తర్వాత అడవికి రాజుగా ఉండాలని ఏనుగును కోరాయి. అయితే, అందుకు ఏనుగు నిరాకరించింది. ‘సింహం మనకు శత్రువు కాదు. సింహంలో ఉన్న చెడ్డ గుణమే మన శత్రువు. చావుబతుకుల్లో ఉన్న సింహాన్ని బతికించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు సింహం తప్పక మారుతుంది’ అంది ఏనుగు. సింహానికి వైద్యం చేసి బతికించే బాధ్యతను జంతువులన్నీ కోతికి అప్పగించాయి. రకరకాల ఆకులు, వేర్లతో వైద్యం చేసింది కోతి. తేలికగా జీర్ణమయ్యేలా పండ్ల రసాలను సింహానికి ఆహారంగా ఇచ్చింది. కంటి మీద కునుకు లేకుండా పది రోజుల పాటు సింహానికి సేవలు చేసింది. చివరకు దాని వైద్యం ఫలించింది. సింహం మెల్లగా కోలుకుంది.

‘నువ్వు లేకుంటే నేను బతికే దాన్ని కాదు’ అని కోతికి కృతజ్ఞతలు తెలిపింది సింహం. ఏనుగుతో పాటు శాకాహార జంతువులన్నీ సింహం దగ్గరకు వచ్చాయి. సింహం బతికినందుకు సంతోషాన్ని ప్రకటించాయి. ‘మృగరాజా! నువ్వు మా అందరి కంటే బలమైన దానివి. గొప్ప దానివి. అయినా నీకు జబ్బు చేసినప్పుడు శాకాహార జంతువు కోతి వల్లే నువ్వు బతికావు. నీకు జబ్బు చేసినప్పుడు శాకాహారమే నీ ప్రాణం నిలబెట్టింది. ఇకనైనా అడవిలోని జంతువులన్నిటినీ, అన్నిరకాల ఆహారాలనూ సమానంగా చూడమని నా ప్రార్థన’ అంది ఏనుగు. ‘మృగరాజా! నువ్వు జబ్బుతో చనిపోతే నీ తర్వాత ఈ అడవికి ఏనుగు రాజు అయ్యేది. అయినా ఏనుగు నువ్వు బతకాలని కోరుకుంది. ఏనుగు పట్టుదల వల్లే కోతి నీకు వైద్యం చేసి నిన్ను బతికించింది’ అంది కుందేలు.

సింహంలో పూర్తిగా మార్పు వచ్చింది. ‘ఆకలి తీర్చుకోవటానికి తప్ప ఆధిపత్యం చూపటం కోసం ఏ జంతువూ మరో జంతువును చంపకూడదు. అంతేకాదు ఏనుగును మన రాజ్యానికి మంత్రిగా నియమిస్తున్నాను’ అని ప్రకటించింది సింహం. శాకాహార జంతువులన్నింటికీ క్షమాపణ చెప్పింది. ఇక అప్పటి నుంచి అడవిలోని జంతువులన్నింటినీ, అన్నిరకాల ఆహారాలనూ సింహం సమానంగా చూడసాగింది. అన్ని జంతువులతోనూ స్నేహంగా మెలగసాగింది.

- కళ్లేపల్లి తిరుమలరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని