Updated : 27 Mar 2022 00:54 IST

ఎగిరి వచ్చిన రామచిలుక!

నందయ్య ఓ రైతు. ఆయనకు అయిదెకరాల పొలముంది. ఒకరోజు పొరపాటున ఇంటిముందు ఉన్న బురదలో కాలుజారి పడ్డాడు. గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వైద్యుడు రమణయ్యను పిలుచుకువచ్చారు. ‘చేతి ఎముక కొద్దిగా చిట్లింది. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలి. నెలరోజులకు పూర్తిగా సర్దుకుంటుంది. అప్పటిదాకా ఈ చేత్తో బరువైన పనులు చేయొద్దు’ అని చెప్పి చేతికి కట్టుకట్టాడు రమణయ్య.

మరుసటిరోజు... కుటుంబసభ్యులంతా పొలానికి వెళ్లారు. ఆనందయ్య వరండాలో కూర్చుని... ‘ఈ చెయ్యి ఎప్పుడు బాగు అవుతుందో?’ అని దిగులుపడసాగాడు. ఇంతలో పక్కింటిలో ఉండే సుందరం వచ్చి.... ‘ఆనందయ్యా!... సేరు జొన్నలు కావాలి. మళ్లీ ఒక వారంలో ఇస్తాను’ అని అడిగాడు. ‘అదిగో, ఆ మూలనున్న బస్తాలో ఉన్నాయి తీసుకో. జొన్నలు కొలిచే సోల కూడా దాంట్లోనే ఉంది. నేను కొలవడం కుదరదులే’ అని ఒక బస్తాను చూపాడు. సుందరం ఆ బస్తాలోని జొన్నలు కొలుచుకుని, తన సంచిలో పోసుకున్నాడు. కొలిచేటప్పుడు.... బస్తాలో ఒకటి రెండు జొన్నకంకులు చేతులకు తగిలాయి. అడ్డొస్తున్నాయని వాటిని తీసి బయట పెట్టాడు.

సుందరం వెళ్లిన ఒక గంట తర్వాత... ఓ చిలుక మెల్లగా వచ్చి బస్తా పక్కనున్న కంకులను పొడుచుకు తినసాగింది. ఆనందయ్య తొలుత ఆ చిలుకను తన భుజాన ఉన్న తువ్వాలుతో తరిమేద్దామనుకున్నాడు. అయితే, దాని నోటి దగ్గరి ఆహారం తీయడమెందుకని, చిలుక చేసే పనిని ఆసక్తిగా చూడసాగాడు. అలా చూసేకొద్దీ అతని మనసు ఎంతో ప్రశాంతంగా మారింది. తన చేతికట్టు సంగతి మర్చిపోయాడు. ఒక కంకిలోని గింజలన్నీ తినేసి చిలుక తుర్రుమని వెళ్లిపోయింది.

మరుసటిరోజు అందరూ పొలానికి వెళ్లాక... ఆనందయ్య బల్లపై కొన్ని జొన్నకంకులు పెట్టి చిలుక కోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒకటి కాదు, రెండు చిలుకలు వచ్చాయి. వాటిని చూడగానే ఆనందయ్య మనసు సంతోషంతో నిండిపోయింది.

‘ఇంకొక చిలుకను తోడు తెచ్చుకున్నట్లుంది’ అనుకున్నాడు. రోజురోజుకూ ఆనందయ్య ఇంటికి వచ్చే చిలుకల సంఖ్య పెరగసాగింది. ఆనందయ్య కూడా వాటికి అవసరమైన జొన్నలు, నీళ్లు అందుబాటులో ఉంచసాగాడు. కుటుంబసభ్యులకు కూడా ఈ విషయం తెలిసింది. పదిరోజులు గడిచాక..... వైద్యుడు రమణయ్య వచ్చి, ఆనందయ్య చేయిని పరిశీలించి... ‘అరే.. విచిత్రంగా ఉందే.. చాలా తక్కువ కాలంలోనే నీ చెయ్యి బాగైంది’ అంటూ కట్టువిప్పాడు. ‘దీనికి కారణం చిలుకలే! వాటి చేష్టలు చూస్తుంటే ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. అందుకే త్వరగా నయమై ఉంటుంది’ నవ్వుతూ చెప్పాడు ఆనందయ్య. చిలుకలు రోజూ వస్తున్నాయి. కుటుంబసభ్యులు కూడా వాటిని ప్రేమగా చూసుకోసాగారు.

ఒకరోజు భోజనాలు చేసేటప్పుడు... ‘చిలుకలు రోజూ రావడం కాకుండా, మనతోనే కలిసి ఉంటే బాగుంటుంది’ ఆనందయ్య తన మనసులోని మాటను చెప్పాడు. ‘అవును నాన్నా...మాకూ అలాగే అనిపిస్తోంది’ అంది కూతురు.

‘ఇరుగుపొరుగువారు ఇప్పటికి ఏమీ అనలేదు. వీటి సంఖ్య పెరిగేకొద్దీ, వాళ్లకు ఇబ్బంది అవుతుంది’ ఆనందయ్య భార్య రాబోయే ఇబ్బందిని చెప్పింది. ‘అయితే ఇక నుంచి మనం పొలంలో నివాసం పెడదాం. అరఎకరం జొన్న వేసి, ఆ పంటను చిలుకలకే వదిలేద్దాం. ఎలాంటి ఇబ్బందీ రాదు’ సంబరపడుతూ చెప్పాడు ఆనందయ్య. వాళ్లకు ఆ ఆలోచన నచ్చింది. కొద్దిరోజుల్లోనే వాళ్లు తమ నివాసాన్ని పొలంలోకి మార్చుకున్నారు. చిలుకలు అది గమనించాయి. అవి కూడా పొలానికి వెళ్లాయి. అనుకున్నట్లుగానే, ఆనందయ్య కుటుంబం అరఎకరంలో జొన్న పెంచింది. చిలుకల నివాసానికి తగిన ఏర్పాట్లు చేసింది. కొద్దిరోజులకు చిలుకలతోపాటు, రకరకాల పక్షులు కూడా వచ్చి అక్కడే ఉండిపోసాగాయి. ఆనందయ్య చిలుకల గురించి తెలుసుకున్న ఒక ఉపాధ్యాయుడు, తన విద్యార్థులను అక్కడికి క్షేత్రపర్యటనకు తీసుకొచ్చాడు. పిల్లలు చాలాసేపు ఆనందంగా గడిపారు. తిరిగి వెళ్లేటప్పుడు... ‘మన బడి ఇక్కడే ఉంటే బాగుండేది!’ అని చాలామంది పిల్లలకు అనిపించింది. 

- హర్షిత


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts