ప్రకృతి నేస్తాలు!

మిట్టూ, కిట్టూ పట్టణంలో చదువుతున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉగాది పండుగకు తాతగారింటికి బయలుదేరారు. వాళ్ల కారు.. పల్లె దారి పట్టగానే కొత్త చివుళ్లు తొడుక్కొని చెట్లు వారిని స్వాగతించాయి. పిల్లల సరదా చూసి కారు వేగం తగ్గించాడు నాన్న. చూస్తుండగానే ఊరు వచ్చేసింది.  తాతగారింటి ముందు కారు ఆగేసరికి.. పిల్లలిద్దరూ ఎదురుగా వస్తున్న అమ్మమ్మ వైపు పరుగెత్తారు. పిల్లలను దగ్గరకు తీసుకుంటూ.. కూతురు, అల్లుడిని పలకరించిందామె. అప్పటికే సాయంత్రం కావడంతో...

Updated : 02 Apr 2022 06:17 IST

మిట్టూ, కిట్టూ పట్టణంలో చదువుతున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉగాది పండుగకు తాతగారింటికి బయలుదేరారు. వాళ్ల కారు.. పల్లె దారి పట్టగానే కొత్త చివుళ్లు తొడుక్కొని చెట్లు వారిని స్వాగతించాయి. పిల్లల సరదా చూసి కారు వేగం తగ్గించాడు నాన్న. చూస్తుండగానే ఊరు వచ్చేసింది.

తాతగారింటి ముందు కారు ఆగేసరికి.. పిల్లలిద్దరూ ఎదురుగా వస్తున్న అమ్మమ్మ వైపు పరుగెత్తారు. పిల్లలను దగ్గరకు తీసుకుంటూ.. కూతురు, అల్లుడిని పలకరించిందామె. అప్పటికే సాయంత్రం కావడంతో అమ్మమ్మ ఇచ్చిన తాయిలాలు పట్టుకొని పిల్లలిద్దరూ మేడ మీదకు చేరారు. కొండల చాటున సూర్యాస్తమయ దృశ్యం కనువిందుగా ఉంది. రకరకాల శబ్దాలతో పక్షులు సందడి చేస్తూ.. గూళ్లకు చేరుతున్నాయి. మామిడి చెట్ల మీద పిందెలు గాలికి ఊగుతూ పిల్లలను ఊరిస్తున్నాయి.

పొద్దుపోతుండటంతో ఇంట్లోకి వచ్చేయండని అమ్మమ్మ కేక వేయగానే అక్కాతమ్ముళ్లు గబగబా మెట్లు దిగి వచ్చేశారు. వాకిట్లో తాతగారు వాలుకుర్చీలో కూర్చున్నారు. పిల్లలను చూసి ‘రేపు కొండపైకి వెళ్దాం. మీరు చాలా ఆనంద పడతారు’ అనగానే పిల్లలు భలే భలే అంటూ చప్పట్లు కొట్టారు. రాత్రి భోజనాలయ్యాక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నారిద్దరూ.

తెల్లవారగానే తాతగారు ఒక సంచిని భుజాన వేసుకొని.. పిల్లలతో కలిసి కొండ దిశగా బయలుదేరారు. పిల్లల ఆత్రుత చూసి ‘గాబరా పడకండి. నా వెనకే రండి. పక్కనున్న చెట్ల కొమ్మలనూ బండలనూ పట్టుకొని నడవండి’ అంటూ తాతగారు కొండ ఎక్కసాగారు. అంతలో ‘తాతగారూ.. మామిడి చెట్టు’ అని అరిచాడు కిట్టూ. ‘అక్కడికే వెళ్దాం. ఉగాది పచ్చడి కోసం అమ్మమ్మ తీసుకురమ్మని చెప్పినవన్నీ ఈ కొండ మీదే దొరుకుతాయి’ అని తాతగారు అటుగా నడిచారు. మామిడి చెట్టు వద్దకు వెళ్లి పిందెలను తెంపి సంచిలో వేసుకున్నారు.

అంతలో వేపచెట్టును చూపించింది మిట్టూ. మామిడి ఆకులు తెంపండని పిల్లలకు చెప్పి.. తాతగారు వేపపువ్వు కోసే పనిలో పడ్డారు. అంతలో కోకిల కుహుకుహులు వినిపించడంతో కొమ్మా కొమ్మా వెతికారు. కోకిలలు మావిచివుర్లు తింటూ కనిపించాయి. ‘తాతగారూ కోకిలలూ..!’ అని ఆనందంతో అరిచి చెప్పారు పిల్లలు. ‘ఆ.. చూశాను. వాటి పాటలు వింటూ.. మీ పని పూర్తి చేయండి’ నవ్వుతూ చెప్పాడాయన.

మామిడి రెమ్మలు తెంపుతూ.. ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లాం’ అని అరిచారు పిల్లలు. తాతగారు వెంటనే ‘ఆ మిఠాయి పొట్లాన్ని కదిలించకండి. తేనెటీగలు మన వెంటపడతాయి’ అని కేకలేశారు. ‘ఆ.. టీచర్‌ చెప్పారు’ అంటూ మామిడి చెట్టు నీడనే ఉండిపోయారు పిల్లలు. మబ్బులను చీల్చుకుంటూ సూర్యుడి కిరణాలు అప్పుడే భూమిని తాకుతుంటే.. చల్లని గాలులు వారిని సేదతీరుస్తున్నాయి. ఇంతలో తాతగారు వేప పువ్వు కోసి, వారి దగ్గరకు వచ్చారు. ఆయన చేతిలో పండిన చింతకాయలు కనిపించాయి. వెంటనే ‘అవేంటి?’ అని పిల్లలు అడిగారు. వీటి పైనున్న పెంకు తీస్తే తాజా చింతపండు కనిపిస్తుందని వలిచి చూపించారు తాతగారు. 

‘పిల్లలూ.. ఏమనిపిస్తుందిప్పుడు?’ అడిగారు తాతగారు. ‘చాలా హాయి అనిపిస్తుంది తాతగారూ!’ అన్నారు పిల్లలు. ‘ఈ హాయి మనకే కాదు. భూమి మీద ఉండే జీవులన్నింటికీ కలగాలి. అప్పుడే అసలైన ఉగాది. ప్రకృతి విరబూసే కాలమిది. అందుకే మనం తెలుగు నూతన సంవత్సరాన్ని ఉగాది పేరుతో పండుగలా జరుపుకొంటున్నాం. ఈ ప్రకృతి మన మనుషులకే సొంతం కాదు. అన్ని జీవులకూ దీనిపై హక్కుంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించకపోతే.. మన చుట్టుపక్కల ఉన్న జీవులన్నీ సుఖసంతోషాలతో ఉంటాయి. అప్పుడే నిజమైన ఉగాది అవుతోంది’ అని వివరించారు తాతగారు.

‘మీరన్నది నిజమే తాతగారూ. సహజ వనరులను రక్షిస్తేనే.. జీవి మనుగడ సాధ్యమని పాఠాల్లో కూడా ఉంది మాకు..’ అని చప్పట్లు కొట్టారు పిల్లలు. అంతలో ఎవరో పిలిచినట్లు కేకలు వినిపించాయి. కొండ మీద నుంచి పిల్లలు ఇంటి వైపు చూశారు. అమ్మమ్మ పిల్లల వైపే చూస్తూ.. ‘ఇక రండి’ అన్నట్లు సైగ చేసింది. పిల్లలూ, తాతగారు చకచకా కొండ దిగారు. అక్కడ చెట్టు మీదనే పండిన అరటి పండ్లను తెంపుకొని ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే కొత్త బెల్లం, కుండ సిద్ధంగా ఉన్నాయి. పిల్లల చేతుల్లో ఉన్న వాటిన్నింటినీ చూసి అమ్మమ్మ ‘మరేం, అన్నీ తెచ్చేశారు. మీరు స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకొని వచ్చేలోగా నేను ఉగాది పచ్చడి తయారు చేసేస్తా’ అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది.  

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని