కోకిలమ్మ గానం.. కోతి సాయం!

వింధ్యగిరి పర్వతానికి ఆనుకొని ఒక అడవి ఉంది. దానికి సింహం రాజు. ఆ అడవిలో అన్ని జంతువులు, పక్షులు కలిసి మెలసి ఆనందంగా జీవించేవి. ప్రతి ఉగాది రోజున మృగరాజు అడవిలో ఉన్న జంతువులు, పక్షులను సమావేశపరిచేది. కోకిలమ్మలతో గాన కచేరీ ఏర్పాటు చేసేది. చక్కగా గానం చేసిన వాటికి కానుకలు అందించి సత్కరించేది.

Updated : 03 Apr 2022 02:35 IST

వింధ్యగిరి పర్వతానికి ఆనుకొని ఒక అడవి ఉంది. దానికి సింహం రాజు. ఆ అడవిలో అన్ని జంతువులు, పక్షులు కలిసి మెలసి ఆనందంగా జీవించేవి. ప్రతి ఉగాది రోజున మృగరాజు అడవిలో ఉన్న జంతువులు, పక్షులను సమావేశపరిచేది. కోకిలమ్మలతో గాన కచేరీ ఏర్పాటు చేసేది. చక్కగా గానం చేసిన వాటికి కానుకలు అందించి సత్కరించేది.

ఓరోజు మృగరాజు, కోతికి కబురు పెట్టింది. ‘ఈ ఉగాది సందర్భంగా మన అడవిలోని జంతువులు, పక్షులు, కోకిలమ్మలను రమ్మని ఆహ్వానించు. గాన కచేరీలో కోకిలలన్నీ పాల్గొనాలి. ఈ విషయమై వెంటనే అడవి అంతా చాటింపు వేయాలి’ అని కోతితో చెప్పింది సింహం.

కోతి సరే అంది. అడవిలో నలుమూలల తిరుగుతూ ఉగాది సమావేశం గురించి చెప్పింది. కోకిలమ్మలన్నీ తప్పకుండా గానకచేరీలో పాల్గొనాలని, గెలిచిన వాటికి చక్కని బహుమతులుంటాయని చాటింపు వేసింది. అలా చాటింపు వేస్తుండగా ఒక చెట్టు కొమ్మ పైనుంచి ఓ ఏడుపు కోతికి వినబడింది. అది వెంటనే చెట్టు మీదకు చూసింది. కొమ్మపై కూర్చొని ఒక కోకిల ఏడుస్తోంది.

‘ఏమైంది నీకు?... ఎందుకు ఏడుస్తున్నావు?’ అని కోతి అడిగింది. ‘ఏమీ లేదు. నేను నిన్న ఒక ముళ్ల పొదపై వాలినప్పుడు నా కాలికి ముల్లు గుచ్చుకుంది. చాలా నొప్పిగా ఉంది. ముల్లు కాలిలో ఉండటం వల్ల నేను బాధ భరించలేకపోతున్నా. ఉగాది సందర్భంగా జరిగే కచేరీకి నేను రాలేను. రాజుగారు ఇచ్చే కానుకలు నేను తీసుకోలేను. అందుకే బాధ పడుతున్నా’ అంది కోకిల.

‘అయ్యో! ఎంత పనైంది. నువ్వేం దిగులు పడకు. నీకు నొప్పి కలిగిస్తున్న ఆ ముల్లును తీయించే బాధ్యత నాది. కుందేలును పిలుచుకొని వస్తాను. నీ కాలి ముళ్లు చాలా సులువుగా తీసేస్తుంది’ అంటూ కోకిలకు ఉపశమనం కలిగే మాటలు చెప్పి ఊరడించింది.

కోతి మాటలతో కోకిలకు పట్టరాని సంతోషం కలిగింది. కోతి కుందేలును అక్కడికి పిలుచుకొని వచ్చింది. కుందేలు కోకిల కాలి ముల్లును చాకచక్యంగా తీసింది.  

కుందేలు, కోతికి.. కోకిల కృతజ్ఞతలు చెప్పుకుంది. ఉగాది నాడు కోకిలమ్మల గాన కచేరీలో పాల్గొంది. చక్కని స్వరంతో రాగాలు పలికి జంతువులు, పక్షులను తన గాత్రంతో ఆహ్లాద పరిచింది. అక్కడికి వచ్చిన జంతువులు, పక్షులన్నీ కోకిల గానానికి పరవశించి చప్పట్లు కొట్టాయి. మృగరాజు కూడా మైమరిచిపోయింది. కోకిలమ్మకు ప్రత్యేక కానుకలిచ్చి గౌరవించింది.

తాను ఈ రోజు ఇక్కడికి వచ్చి తన రాగాలను వినిపించడానికి కోతి, కుందేలు సహాయం చేశాయని కోకిల చెప్పింది. తన కాలిలో గుచ్చుకున్న ముల్లు కుందేలు తీయడం వల్లనే తాను ఇక్కడికి రాగలిగానని కృతజ్ఞతలు చెప్పుకుంది. కోతి, కుందేలు సహాయ గుణానికి మెచ్చి వాటిని అభినందించడమే కాక, చక్కని కానుకలూ ఇచ్చి మృగరాజు గౌరవించింది. కోతి, కుందేలు చాలా ఆనందపడ్డాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల తమకు కూడా గౌరవం దక్కిందని అవి సింహానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి.  

- మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని