గాలి వీచింది.. సింహం విడిచింది!

ఒకరోజు మృగరాజు సింహం.. అడవిలోని జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది. సింహం మాట్లాడుతున్న సమయంలో రంగురంగుల సీతాకోకచిలుకలు గాల్లో ఎగురుతున్నాయి. జంతువులు, సింహం మాటలు వినకుండా తదేకంగా వాటినే చూడసాగాయి.  ఒకరోజు మృగరాజు సింహం.. అడవిలోని జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది. సింహం మాట్లాడుతున్న సమయంలో రంగురంగుల సీతాకోకచిలుకలు గాల్లో ఎగురుతున్నాయి. జంతువులు, సింహం మాటలు వినకుండా తదేకంగా వాటినే చూడసాగాయి.  

Updated : 08 Apr 2022 01:47 IST

కరోజు మృగరాజు సింహం.. అడవిలోని జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది. సింహం మాట్లాడుతున్న సమయంలో రంగురంగుల సీతాకోకచిలుకలు గాల్లో ఎగురుతున్నాయి. జంతువులు, సింహం మాటలు వినకుండా తదేకంగా వాటినే చూడసాగాయి.  

జంతువులు తాను చెప్పే మాటలు వినకుండా సీతాకోకచిలుకలు గాల్లో ఎగురుతున్న అందమైన దృశ్యాన్ని చూడటం సింహానికి కోపం తెప్పించింది. సమావేశానికి అంతరాయం కలిగించిన వాటిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

సమావేశాన్ని మధ్యలోనే ముగించి సీతాకోకచిలుకలను బంధించమని జంతువులను ఆదేశించింది. సీతాకోకచిలుకలు ఒక్కసారిగా భయంతో వణికిపోయాయి. జంతువులకు దొరక్కుండా అవి మరింత పైకి ఎగరసాగాయి. సింహం కోపం రెట్టింపు అయింది. ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరి తన పంజాతో ఒక సీతాకోకచిలుకను పట్టుకోగలిగింది. అది చిన్న కీటకం కావటంతో దాన్ని తన పంజా మధ్యన బంధించటం కష్టంగా మారింది. సీతాకోకచిలుక కూడా తప్పించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. మిగతావన్నీ భయంతో తలో దిక్కుకు ఎగిరిపోయాయి. సమావేశానికి అంతరాయం కలిగించిన దాన్ని.. దోషిగా నిర్ధారించింది సింహం.

పాపం ఆ సీతాకోకచిలుక, సింహాన్ని ఉద్దేశించి.. ‘మహారాజా! ఈ ప్రదేశంలో మీ సమావేశం జరుగుతుందని తెలియక పొరపాటుగా వచ్చాం. నేను మీ చేతికి చిక్కాను. మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను. ఇంకెప్పుడూ ఈ ఛాయలకు కూడా రాను. రాజు దయగల ప్రభువంటారు. ఈ ఒక్కసారి క్షమించి వదిలి పెట్టండి’ అని వేడుకుంది. కానీ మృగరాజు మనసు కరగలేదు.

అడవి జంతువులు కూడా సీతాకోకచిలుకను క్షమించమన్నాయి. సింహం పంతం వీడలేదు. ‘సీతాకోకచిలుకను శిక్షించాల్సిందే’ అని తీర్మానించింది. పాపం దానికి ఏడుపు తన్నుకొచ్చింది. అందరూ తమను అందానికి ప్రతిరూపంగా వర్ణిస్తారు. తాము గాల్లో ఎగురుతుంటే ప్రతి ఒక్కరూ సుందరదృశ్యం చూసినట్లుగా భావిస్తారు. పిల్లలు సైతం ఎంతో ఇష్టపడతారు.. మా అందాన్ని పదిమందికీ చూపించాలని తాపత్రయ పడుతుంటారు. అలాంటి తనను ఈరోజు సింహం బంధించింది. జీవితంలో మొదటిసారి.. సీతాకోకచిలుకకు, తన మీద తనకే విరక్తి కలిగింది. మనసులో రక్షించమని దేవుడిని ప్రార్థించింది.

పాపం.. దాని బాధను దేవుడు విన్నాడేమో! క్షణాల్లోనే పెద్ద ఈదురుగాలి వచ్చింది. ఆ ధాటికి ప్రశాంతంగా ఉన్న అడవి ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. చెట్ల కొమ్మలు ఊగసాగాయి. ఎండిపోయిన ఆకులు రాలి నేల మీద పడుతున్నాయి. దుమ్ము గాల్లోకి లేచింది. జంతువులు.. దుమ్ము పడకుండా కళ్లు మూసుకున్నాయి. మరికొన్ని జీవులు చెట్ల చాటుకు చేరుకున్నాయి. సింహం కూడా కళ్లు మూసుకోబోయింది. అయితే అప్పటికే గాల్లోకి లేచిన దుమ్ము దాని కళ్లలో పడింది. దాంతో సింహం కళ్లు ఎర్రగా మారి మండసాగాయి. అది కళ్లు శుభ్రం చేసుకోవడానికి ముందరి కాళ్లకు పని చెప్పింది. కాళ్లతో కళ్లు తుడుచుకునే ప్రయత్నంలో ఉండగా.. సింహం పంజా నుంచి తప్పించుకుంది సీతాకోకచిలుక. ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరింది. దాని సంతోషానికి అవధుల్లేవు. అప్పటిదాకా సింహం పంజాలో బందీగా ఉన్న తన రెక్కలను విదిల్చింది. రెట్టించిన ఉత్సాహంతో గాల్లో ఎగరసాగింది. చిన్న కీటకం.. తన పంజా నుంచి తప్పించుకోవటం అవమానంగా భావించింది సింహం.

తప్పించుకున్న సీతాకోకచిలుకను మళ్లీ బంధించమని జంతువులను ఆదేశించింది. అవి అయిష్టంగానే ముందుకు కదిలాయి. వాటి ప్రయత్నానికి ఫలితం దక్కలేదు. తన కోసం ఈదురుగాలిని సృష్టించి పునర్జన్మ ప్రసాదించిన భగవంతుడికి ఆ సీతాకోకచిలుక మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొంది.  

- తమ్మవరపు వెంకటసాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని