పాడుతా.. తీయగా!

వంశీ అయిదో తరగతి చదువుతున్నాడు. రోజూ బడి నుంచి ఇంటికి రాగానే.. పెరట్లో ఉన్న వేప చెట్టు కింద ఆడుకోవడమంటే వంశీకి చాలా ఇష్టం. ఒకరోజు వేపచెట్టు కింద ఆడుకొంటూ ఉండగా, చెట్టు మీద ఉన్న కోకిల.. ‘కుహూ.. కుహూ..’ అనడం వినిపించింది. వంశీకి కోకిల గానం నచ్చి.. తాను కూడా ‘కుహూ.. కుహూ..’ అన్నాడు. కోకిల మళ్లీ... ‘కుహూ.. కుహూ...’ అని కూసింది.

Updated : 13 Apr 2022 00:48 IST

వంశీ అయిదో తరగతి చదువుతున్నాడు. రోజూ బడి నుంచి ఇంటికి రాగానే.. పెరట్లో ఉన్న వేప చెట్టు కింద ఆడుకోవడమంటే వంశీకి చాలా ఇష్టం. ఒకరోజు వేపచెట్టు కింద ఆడుకొంటూ ఉండగా, చెట్టు మీద ఉన్న కోకిల.. ‘కుహూ.. కుహూ..’ అనడం వినిపించింది. వంశీకి కోకిల గానం నచ్చి.. తాను కూడా ‘కుహూ.. కుహూ..’ అన్నాడు. కోకిల మళ్లీ... ‘కుహూ.. కుహూ...’ అని కూసింది.

‘నీ గానం చాలా బావుంది!’.. కోకిలను మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు వంశీ. ‘నువ్వు కూడా బాగా పాడావు వంశీ!’ అని కోకిల బదులిచ్చింది. ‘నా పేరు నీకెలా తెలుసు?’ అని వంశీ ఆశ్చర్యపోతూ అడిగాడు. ‘మీ అమ్మ నిన్ను పిలిచేటపుడు విన్నాను’ అంది కోకిల.

‘బావుంది.. రోజూ నాకు పాడటం నేర్పుతావా? నాకు బాగా పాడాలని ఉంది!’ అని వంశీ అడిగాడు. ‘ఓ... తప్పకుండా! గానం మాకు వరం. నాకు వచ్చింది చెప్పడం కష్టమేం కాదు!’ అని కోకిల కిలకిలా నవ్వుతూ అంది. ‘నీ గానమే కాదు. గుణం కూడా గొప్పదే. నీ స్నేహం నాకు నచ్చింది!’ కోకిలను మెచ్చుకుంటూ చెప్పాడు వంశీ.

ఆ రోజు నుంచి కోకిల దగ్గర పాటలు నేర్చుకోవడం వంశీ దినచర్యలో భాగమైంది. ఒకరోజు ఆ వేపచెట్టు మీద కోకిల గానంతో పాటు.. ఒక కాకి కూడా ‘కావ్‌..కావ్‌..’ అనడం గమనించాడు వంశీ. ‘ఈ రోజే కాకి చెట్టు మీదకు వచ్చి వాలింది. అందంగా గూడు కూడా కట్టుకుంది!’ అని చెప్పింది కోకిల. వంశీ కాకిని, అది కట్టుకున్న గూడును పరిశీలనగా చూశాడు. తిరిగి కోకిలతో పాటుగా పాడటం ప్రారంభించాడు. వారం రోజులు గడిచాయి. ఆరోజు వంశీ అలవాటులో భాగంగానే కోకిలతో పాటుగా పాడుతుండగా, కాకి.. ‘కావ్‌.. కావ్‌..’ అంటూ అరవడం విని ఒక్కసారిగా దాని వంక చూశాడు.

‘‘నువ్వు ‘కావ్‌.. కావ్‌’ అంటూ అరవకుండా కోకిలలా ‘కుహూ.. కుహూ..’ అని కూస్తేనే ఈ చెట్టు మీద ఉండనిస్తాను. లేకపోతే తరిమేస్తాను!’’అని కాకితో గట్టిగా అన్నాడు. కోకిలకు వంశీ ప్రవర్తన వింతగా అనిపించింది. కాకి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ‘కావ్‌..కావ్‌’ అనే అరిచింది కానీ ‘కుహూ.. కుహూ..’ అని కూయలేక పోతోంది. ‘ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు!’ అని కాకి వంశీ వైపు దీనంగా చూస్తూ అంది. ‘అయితే గూడుతో సహా తక్షణమే ఈ చెట్టును వదిలి వెళ్లిపో! నువ్వు ఇక్కడ ఉంటే ఊరుకోను!’ అని వంశీ, కాకి వంక కోపంగా చూస్తూ అన్నాడు.

వంశీ విపరీత ప్రవర్తనతో కోకిలకు చాలా బాధ వేసింది. ‘‘వంశీ.. నీ మంచి గుణం నచ్చి నీతో ఇన్నాళ్లూ స్నేహం చేశాను. కానీ నీ అసలు రూపం ఈ రోజు తెలిసింది. నా సాటి పక్షిని నువ్వు గెంటేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఎంత సాధన చేసినా.. ‘కుహూ.. కుహూ..’ అని కాకి కూయలేదు! ‘కావ్‌.. కావ్‌..’ అని మాత్రమే అరవగలదు. ఈ విషయం నీకు తెలిసి కూడా కాకిని ఏడిపిస్తున్నావ్‌! ఈరోజు కాకిని పొమ్మన్నట్టే రేపు నన్నూ వెళ్లగొడతావు. నేను కూడా ఇప్పుడే వెళ్లి పోతాను!’’ అని కోకిల అంది.
అప్పుడు వంశీ, కాకితో.. ‘చూశావా! సాటి పక్షివన్న మమకారంతో కోకిల నిన్ను సమర్థించింది. కానీ నువ్వు రెండు రోజుల క్రితం కోకిల తన గుడ్లను నీ గూటిలో పెడతానని అడిగితే నువ్వు ఒప్పుకోలేదు. అయినా కోకిల అవేమీ మనసులో పెట్టుకోలేదు. నీకు అండగా నిలిచింది. సాయం చేసే గుణం గొప్పదని నిరూపించింది. నీకు గానం రానట్టే కోకిలకు కూడా గూడు కట్టుకోవడం రాదు. ఈ విషయం నీకు తెలిసి రావాలనే ఇలా అన్నాను. ఇప్పటికైనా కోకిల మంచితనం నీకు అర్థమైందా?’ అని వంశీ, కాకితో అన్నాడు. వంశీ తన మేలు కోసమే ఇలా ప్రవర్తించాడని కోకిలకు అర్థమైంది. వంశీకి కృతజ్ఞతలు చెప్పింది. కాకికీ తన తప్పు తెలిసి వచ్చింది.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని