ఉడుతా.. ఉడుతా.. ఊచ్‌!

అదొక జామచెట్టు. దాని మీదకు పిల్ల ఉడుత, తల్లి ఉడుత అప్పుడప్పుడు వచ్చిపోతుండేవి. పదేళ్ల చింటూ ఇంటి పెరటిలో ఉంది ఆ చెట్టు. బడి సెలవురోజుల్లో జామపండ్ల కోసం చింటూ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టుపై కాయలను పరిశీలనగా చూసేవాడు. ఆ సమయంలో చెట్టుపై తిరుగాడుతున్న తల్లి ఉడుతను, పిల్ల ఉడుతను చూసి మైమరచి పోతుండేవాడు.

Updated : 19 Apr 2022 04:16 IST

దొక జామచెట్టు. దాని మీదకు పిల్ల ఉడుత, తల్లి ఉడుత అప్పుడప్పుడు వచ్చిపోతుండేవి. పదేళ్ల చింటూ ఇంటి పెరటిలో ఉంది ఆ చెట్టు. బడి సెలవురోజుల్లో జామపండ్ల కోసం చింటూ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టుపై కాయలను పరిశీలనగా చూసేవాడు. ఆ సమయంలో చెట్టుపై తిరుగాడుతున్న తల్లి ఉడుతను, పిల్ల ఉడుతను చూసి మైమరచి పోతుండేవాడు.

‘ఉడుతా ఉడుతా ఊచ్‌... ఎక్కడికెళ్లావోచ్‌...’ అంటూ పాటలు పాడుతూ ఉడుతల్ని పలకరించేవాడు. పిల్ల ఉడుతకు కూడా చింటూను చూస్తే హుషారొచ్చేది. మంచి పండును కొరికి చింటూ ముందు పడేసేది. చింటూ ఆనందంగా దాన్ని తీసుకొనేవాడు. పిల్ల ఉడుతకు ఆ చెట్టు జామ పండ్లు అంటే భలే ఇష్టం! ఆ పళ్ల రుచి గురించి అప్పుడప్పుడు తల్లి దగ్గర వర్ణించి చెబుతుండేది. పిల్లఉడుత ముద్దు ముద్దు మాటలకు తల్లి ఉడుత ముద్దులతో ముంచెత్తేది.

ఆ సందర్భంలోనే ఇంత మంచి చెట్టు విడిచి ఎటూ పోవద్దని మాట తీసుకుంది పిల్ల ఉడుత. ఇప్పుడు ఆ చెట్టు.. ఆ రెండు ఉడుతలకు నివాసమైపోయింది. ఒకరోజు పిల్ల ఉడుతకు చెట్టు కిందకు చేరిన చింటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. పిల్ల ఉడుతకు చింటూపై సానుభూతి కలిగింది. ఓదార్చాలనుకుంది.

‘మిత్రమా చింటూ..! ఎందుకేడుస్తున్నావు? ఆకలేస్తుందా? తియ్యని పండు ఒకటి ఇవ్వనా?’ ఊరడిస్తూ అడిగింది పిల్ల ఉడుత. చింటూ తల పైకెత్తి చూశాడు. ‘మీ పనే బాగుంది. ఆట, తిండి తప్ప మరో ధ్యాస లేదు’ కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు. ‘మరి నీకొచ్చిన ఇబ్బందేమిటో?’ కాస్త గడుసుగానే అడిగింది తల్లి ఉడుత. మాకు పుస్తకాలు చదివే పనుంటుంది. ఈ మధ్య కాలంలో చదివేదేదీ గుర్తుండటం లేదు.

పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని అమ్మానాన్నలు చీవాట్లు పెడుతున్నారు. మరుపు తగ్గడానికి మందుంటే బాగుండు బాధ పడుతూ చెప్పాడు చింటూ. ‘మరుపు గురించి మాకే చెప్పు. మరుపునకు చిరునామా మా ఉడుతల వంశమే! మరుపు మాకు శాపమైతే, ప్రకృతికి వరం’ అంటూ తల్లి ఉడుత పెదవి విరిచింది. ‘మరుపునకు మందు నాకు తెలుసు’ అంది పిల్ల ఉడుత. తల్లి ఉడుత ఆశ్చర్యపోయింది. చింటూను బుజ్జగించడానికి పిల్ల ఉడుత అబద్ధమాడుతోందనుకుంది. ‘ఆ మందేమిటో చెప్పవా?’ ఆశగా అడిగాడు చింటూ. ఒకసారి మా అమ్మ నాకు జాగ్రత్తలు చెబుతూ నేరేడు పండ్ల కోసం రెండు మూడు చెట్లు దాటి వెళ్లింది. అదే అదుననుకొని నేను అమ్మమాటను పెడచెవిన పెట్టి ఒంటరిగా బయటకు పరుగు పెట్టాను. కొంత దూరం పోయాక నాకు పాము కనిపించింది. అప్పుడు నాకు అమ్మ మాట జ్ఞాపకం వచ్చి వెనుదిరిగాను. ఇంతలో దారి మరిచిపోయాను. అప్పుడు మా మతి మరుపు సంగతి గుర్తుకొచ్చింది. అమ్మను కలిసేదెలా? అంటూ ఏడుపొచ్చింది. అయినా ధైర్యం కోల్పోలేదు. ప్రతి చెట్టు ఎక్కి కాయలు కొరుకుతూనే ఉన్నాను. అవి నాకు రుచించలేదు. ఆ చెట్లేవీ మా నివాసం కాదని గుర్తించి, ముందుకు వెళ్లే దాన్ని. చివరకు నేను ఇష్టపడే పండ్ల రుచి నా నోటికి తగిలేసరికి ఇది నా నివాసమే అని గుర్తుకు వచ్చింది. కొద్దిసేపటికే మా అమ్మ ఇక్కడికొచ్చేసరికి ఊపిరి తీసుకున్నాను’ అని సుఖాంతమైన తన కథను చెప్పుకొచ్చింది పిల్ల ఉడుత.

‘ఇష్టం పెంచుకుంటే మతిమరుపు మాయమౌతుందంటావు’ తనకు అర్థమైన విషయాన్ని చెప్పాడు చింటూ. ‘ఇష్టం ఏకాగ్రతను పెంచుతుంది. ఏకాగ్రతతో చేసేపని ఎల్లప్పుడూ గుర్తు ఉంటుంది. ఇది నా స్వీయానుభవం. మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెంచుకోడానికి ఇంతకన్నా మంచి మందు మరొకటి లేదు’.. వివరించి చెప్పింది పిల్ల ఉడుత. ఈ మధ్య కాలంలో ఆటలపై పెరిగిన ఇష్టం గుర్తుకు రావడంతో చింటూ  తన తప్పు తెలుసుకున్నాడు. పిల్ల ఉడుత మతిమరుపును అధిగమించడానికి ఎంచుకున్న మార్గానికి తల్లి ఉడుత ఆశ్చర్యపోయింది. అదే చెట్టుపై నివాసం ఏర్పరుచుకోవడానికి పిల్ల ఉడుత ఎందుకు మాట తీసుకుందో అప్పుడు దానికి అర్థమైంది.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని