Updated : 24 Apr 2022 05:25 IST

మొహమాటం.. సాయం!

ఆ రోజు సుందరం మాస్టారు అంగడికి వెళుతుంటే వెనకే బయల్దేరాడు వాళ్లబ్బాయి చంటి. పిల్లాడు చదివేది ఎనిమిదో తరగతే అయినా... అన్ని విషయాల్లో చాలా చురుకుగా ఉండేవాడు. వాళ్లిద్దరూ అంగడిలోకి వెళ్లి కాయగూరలు కొన్నారు. దుకాణం యజమానికి డబ్బులివ్వబోతుండగా.. అతడి స్నేహితుడు రావడంతో మాట్లాడుతూ డబ్బు అందుకోలేదు. దీంతో కాసేపు తండ్రీకొడుకులు ఆగాల్సి వచ్చింది.

కొట్టు యజమాని కొత్త మోటారు సైకిలు కొన్నాడట. అప్పుడే పూజ చేయించి తెచ్చాడట. అతడి మిత్రుడికి తొందరగా పని ఉన్నందున బండి తాళాలు అడిగాడు. కానీ, బండి ఇవ్వడం ఇష్టం లేనట్టుంది. ‘నేనూ పని మీద వెళ్లాలి’ అని చెప్పాడు దుకాణ యజమాని. కానీ ఆ మిత్రుడు వదల్లేదు. తొందరగానే వచ్చేస్తానని చెప్పాడు. కొట్టు యజమాని ఎంత చెప్పినా వినిపించుకోకుండా.. ‘బండి తాళం ఇవ్వలేని.. నీదీ ఒక స్నేహమేనా?’ అన్నాడు కోపంగా. తప్పనిసరి పరిస్థితుల్లో తాళం ఇచ్చాడు కొట్టు యజమాని.
మిత్రుడు వెళ్లిపోగానే.. ‘తాళం ఇచ్చేవరకు ఎలా పీడించాడో చూశారా? ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సి వచ్చింది’ అన్నాడు కొట్టు యజమాని. ‘అంత మొహమాటం పనికి రాదు. ఇవ్వాలని లేకపోతే కచ్చితంగా చెప్పాల్సింది’ అని బదులిచ్చాడు సుందరం. అతడికి డబ్బు చెల్లించేసి వెళుతుండగా ‘మొహమాటం అంటే ఏమిటి’ అనడిగాడు చంటి. జవాబు చెప్పబోతుండగా ఎదురుగా టెంకాయల దుకాణం కనబడడంతో, కొబ్బరికాయలు కొనాలని గుర్తొచ్చి అటు నడిచాడు సుందరం.  

కొబ్బరికాయలు చూస్తుండగా ఒకామె వచ్చి.. ‘అయ్యా! మా అమ్మాయికి బాగాలేకపోతే ఆసుపత్రికి తీసుకొచ్చాను. బస్సులో ఎవరో మా డబ్బులు దొంగిలించారు. ఖర్చులకు డబ్బుల్లేవు. సాయం చెయ్యండయ్యా’ అంది. యాభై రూపాయలు తీసి ఆమెకు ఇవ్వబోయాడు సుందరం. ‘ఆ డబ్బు డాక్టరుకు కూడా చాలదు. పెద్ద మనసు చేసుకుని ఎక్కువ డబ్బులివ్వండి’ అందామె దీనంగా. ఆమె పక్కనే బలహీనంగా ఉన్న అమ్మాయి కనబడింది. నీరసంగా దగ్గుతోంది. వాళ్లిద్దరినీ చూడగానే సుందరానికి జాలి కలిగింది.

‘ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందరినీ అడిగితే అవసరానికి డబ్బు వస్తుంది కదా. నేనొక్కడినే ఎలా ఇవ్వగలను?’ అనడిగాడు సుందరం. ‘వాళ్లనడిగితే బిచ్చగాళ్లనుకుని రెండు రూపాయలు, అయిదు రూపాయలు ఇచ్చారు. అవెటూ సరిపోవు. మీరొక్కరే యాభై ఇవ్వడం చూసి అడిగాను. మేము రైతులం. బిచ్చగాళ్లం కాదు’ అంది ఆమె. ఆ మాటలకు జాలిపడిన సుందరం అయిదు వందల రూపాయలను ఆవిడ చేతిలో పెట్టాడు. అది చూసిన కొట్టువాడు.. ‘అంత మొహమాటమైతే ఎలాగండీ? ఎంతడిగితే అంతిస్తారా?’ అన్నాడు ఎగతాళిగా. ‘అడిగితే ఇవ్వలేదు. వాళ్లను నమ్మాను కాబట్టి ఇచ్చాను. మొహమాటంతో కాదు’ అనేసి అక్కడ నుంచి బయల్దేరాడు సుందరం.

‘ఇందాక కూరగాయల కొట్టు యజమానిది మొహమాటం అన్నారు. ఇప్పుడు మీది మొహమాటం కాదన్నారు. మరైతే ఏమంటారు?’ అనడిగాడు చంటి. ‘సాయం’ అన్నాడు సుందరం నవ్వుతూ. ‘మొహమాటానికి, సాయానికి తేడా ఉందా?’ మళ్లీ అడిగాడు చంటి. ఉందన్నాడు సుందరం. తనకు అర్థమయ్యేలా చెప్పమన్నాడు చంటి. ‘ఒకరికి ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం కంటే, ఇస్తున్నందువల్ల కలిగే బాధ ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటారు. ఇందాక కూరగాయల కొట్టువాడి మొహంలో ఆ బాధను చూసే ఉంటావు’ అన్నాడు సుందరం. అవునన్నాడు నవ్వుతూ చంటి. ‘ఒకరికి ఇవ్వడం వల్ల కలిగే బాధ కంటే, ఇవ్వడంలో ఉండే ఆనందం ఎక్కువైతే సాయం అంటారు. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి చేయూత అందించామన్న తృప్తి కలిగింది తప్ప విచారం, బాధ కలగలేదు నాకు’ అన్నాడు సుందరం. ‘అర్థమైంది నాన్నా.. నేను కూడా అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేస్తాను. మొహమాటానికి పోయి ఎవరికీ ఏదీ ఇవ్వను’ అన్నాడు చంటి. కొడుకుని తనతో అంగడికి తీసుకెళ్లినందుకు జ్ఞానం పెరిగే సంఘటనలు జరిగాయి’ అని సంతోషించాడు సుందరం.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని