Published : 07 May 2022 00:27 IST

ఎవరు గొప్ప?

ఒక తోటలో చెట్టు మీద ఉన్న ‘చిన్ని’ అనే జామ కాయ, పక్కనే పొట్టి కొబ్బరి చెట్టు పైనున్న ‘చిట్టి’ అనే బొండాన్ని తాకింది. పచ్చగా పెద్ద గుమ్మడి కాయలా నిగనిగలాడుతున్న ఆ ‘చిట్టి’ కొబ్బరి బొండాం.. తనను తాకిన ‘చిన్ని’ జామ కాయ వైపు కోపంగా చూసింది. ‘నన్ను తాకడానికి నీకెంత ధైర్యం?’ అని కన్నెర్రజేసింది. ‘చూసుకోలేదు మిత్రమా.. గాలికి నేనున్న కొమ్మ ఊగడంతో నిన్ను తాకాల్సి వచ్చింది. ఇందులో నా తప్పు ఏమీ లేదు’ బుజ్జగింపు ధోరణిలో సమాధానమిచ్చింది చిన్ని.

‘ఏమిటీ.. నీకు నేను మిత్రుడినా.. నువ్వూ, నేనూ పచ్చగా ఉన్నంత మాత్రాన మిత్రులమైపోతామా.. పేరులో చిలుక ఉన్నంత మాత్రాన సీతాకోకచిలుక చిలుక అయిపోతుందా.. హద్దులు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఆకారంలో నేను నీకంటే చాలా పెద్దగా ఉంటాను. నా ముందు నువ్వెంత.. బండరాయి ముందు గులక రాయంత!’ మరింతగా కోప్పడింది చిట్టి. ఆ మాటలకు చిన్నికి కూడా పౌరుషం పుట్టుకొచ్చింది. ‘ఎవరి గొప్ప వారిదే.. అంతే కానీ నువ్వు నా కంటే గొప్పదానివని నేనెందుకు ఒప్పుకొంటాను?’ అని గట్టిగానే జవాబిచ్చింది. చిన్ని సమాధానంతో చిట్టికి ఆవేశం ఎక్కువైంది.

అప్పుడే ఒక ఉడుత ఆహారం కోసం జామ చెట్టు ఎక్కింది. ‘ఆ ఉడుత రోజూ కాయల కోసం ఇక్కడకు వస్తుంది కదా.. మనిద్దరిలో ఎవరు గొప్పవారో దాన్నే అడుగుదాం’ అంటూ ఉడుతను పిలిచింది చిట్టి. ‘చాలా ఆకలిగా ఉంది. ఒక పెద్ద జామ కాయ తిని వస్తాను’ సమాధానమిచ్చింది ఉడుత. ఉడుత మాటలకు గట్టిగా నవ్వుతూ.. ‘చూశావా.. ఉడుత ఆహారం కోసం మా దగ్గరకే వస్తోంది. ఆ జీవి ఆకలి తీర్చే నేనే నీకంటే గొప్పదాన్నని ఇప్పటికైనా ఒప్పుకో!’ అంది చిన్ని. ‘ఉడుతా.. ఈ చిన్ని తానే గొప్పదాన్నని బీరాలు పలుకుతోంది. దానికంటే నేనే గొప్ప అని చెప్పు!’ కొంచెం కరకుగా చెప్పింది చిట్టి. ‘ఉడుతా.. నేనే గొప్ప అని చెప్పకపోతే నీకు ఆహారం దొరక్కుండా చేస్తాను!’ కాస్త హెచ్చరించినట్టుగా అంది చిన్ని.

జామ కాయ, కొబ్బరి బొండాం మాటలు విన్న ఉడుత ఒక్కసారిగా నవ్వింది. ‘మా ఇద్దరిలో ఎవరు గొప్పో తీర్పు చెప్పమంటే.. వెక్కిరింపుగా నవ్వుతావా?’ అంటూ చిట్టి, చిన్నిలిద్దరూ కోపంగా ఉడుత వైపు చూశాయి. అప్పుడు ఉడుత.. ‘పరోపకారానికి తరువులే గురువులంటారు. అటువంటి తరువులకు బిడ్డల్లాంటి మీరు ఉపకారమే ఊపిరిగా చేసుకుంటారు. ఒకప్పుడు సముద్రానికి వారధి కడుతున్న వానర సైన్యం ఒక ఉడుతను చూసి ఆశ్చర్యపోయిందట..’ అంది. ‘ఎందుకు?’ అంటూ ఆసక్తిగా అడిగాయి చిట్టి, చిన్ని.

‘ఎందుకంటే.. వేలెడంత కూడా లేని ఉడుత చిన్న చిన్న ఇసుక రేణువులను మోసుకెళ్తూ.. వారధి నిర్మాణంలో తనవంతు సహాయం చేసిందట. నీకు సాయం చేయాలని ఎందుకు అనిపించిందని ఆ ఉడుతను అడిగింది వానర సైన్యం. అప్పుడు.. ఆ ఉడుత నిస్వార్థంగా సమాజానికి ఉపయోగపడే, అపకారికి కూడా ఉపకారం చేసే చెట్లే.. నాకు ఆదర్శమని చెప్పిందట..’ అని వివరించింది ఉడుత.

‘ఆ అల్పజీవికే ఆదర్శంగా నిలిచిన చెట్లకు జన్మించిన మీరు మాత్రం సమయాన్ని వృథా చేస్తూ.. ఎవరు గొప్పో చెప్పమంటే నవ్వుకోక ఇంకేం చేయమంటారు? మీలో ఒకరు దాహం తీరుస్తారు.. మరొకరు కడుపు నింపుతారు.. ఏదైనా ఫలితం ఆశించి చేస్తే దాన్ని పని అంటారు. నిస్వార్థంతో చేస్తేనే ఉపకారం అవుతుంది. అసలు ఉపకారం చేయాలన్న గుణమే గొప్పది. ఆ గుణం నిండుగా ఉన్న మీరిద్దరూ గొప్పవాళ్లే. అందుకే చెట్లను కొందరు భక్తితో పూజిస్తారు.. అందరూ గౌరవిస్తారు. అటువంటి చెట్లకు వారసులైన మీ ఇద్దరిలో ఎవరు గొప్పని అడిగితే ఎవరు మాత్రం జవాబు చెప్పగలరు? అర్థం లేని ప్రశ్నలు వేసుకుంటూ మీ మధ్య అనవసరమైన భేదాలూ.. అక్కరలేని వాదోపవాదాలెందుకు? అందుకే నవ్వాను. తప్పంటారా?’ చిట్టి, చిన్నిలను నిలదీసినట్లు అడిగింది ఉడుత. ఆ చిరుజీవి చెప్పిన మాటలు జామ కాయ, కొబ్బరి బొండాన్ని ఆలోచనలో పడేశాయి. తమ తప్పు ఏంటో తెలుసుకున్నాయి. ఆ రెండింటిలో వచ్చిన మార్పునకు సంకేతంగా ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. ఆ గాలికి చిన్ని.. చిట్టిని మళ్లీ తాకింది. కానీ.. ఈసారి దాన్ని ఏమీ అనలేదు సరికదా చిన్ని వైపు చూసి నవ్వింది. చిట్టి, చిన్నిల్లో వచ్చిన మార్పును చూసి ఉడుత ఆనందిస్తూ.. జామ కాయను తినడం ప్రారంభించింది.

- కె.వి.లక్ష్మణరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని