ఆ నాలుగు నెలలు!

నందవరంలో నివసించే హేమంతుడు మంచి చిత్రకారుడు. అక్కడికి పదిమైళ్ల దూరంలో ఉండే రంగాపురం నివాసి విజయుడు కూడా చిత్రకారుడే. వారిద్దరూ ఒకే పాఠశాలలో చిత్రకళను అభ్యసించారు. ఇద్దరూ మంచి మిత్రులు కూడా! ఒకరోజు హేమంతుడు దినపత్రికను చదువుతూ

Published : 08 May 2022 00:04 IST

నందవరంలో నివసించే హేమంతుడు మంచి చిత్రకారుడు. అక్కడికి పదిమైళ్ల దూరంలో ఉండే రంగాపురం నివాసి విజయుడు కూడా చిత్రకారుడే. వారిద్దరూ ఒకే పాఠశాలలో చిత్రకళను అభ్యసించారు. ఇద్దరూ మంచి మిత్రులు కూడా!
ఒకరోజు హేమంతుడు దినపత్రికను చదువుతూ.... ‘అమరావతిలో రాష్ట్రస్థాయి చిత్రకళా పోటీనా! ఈ విషయం విజయుడికి చెప్పాలి’ అనుకున్నాడు. వెంటనే విజయుడి దగ్గరికి వెళ్లి పోటీ విషయం చెప్పాడు.
‘ఇద్దరమూ పోటీకి వెళదాం... మొదటి బహుమతి మనిద్దరిలో ఒకరికి రావాలి’ అని విజయుడు ఉత్సాహంగా చెప్పాడు. ‘అలాగే.. తప్పకుండా’ అని అంతే ఉత్సాహంగా అన్నాడు హేమంతుడు.
నాటి నుంచి.. పోటీ కోసం ఇద్దరూ సాధన చేయసాగారు. పోటీ జరిగే రోజు.. ఇద్దరూ అమరావతి చేరుకున్నారు. అప్పటికే పోటీ జరిగే ప్రాంగణానికి చాలామంది చిత్రకారులు వచ్చి ఉన్నారు.
కాసేపటి తర్వాత పోటీ మొదలైంది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత న్యాయనిర్ణేతలు అందరి చిత్రాలనూ పరిశీలించారు. మొదటి విజేతగా హేమంతుడిని ప్రకటించారు. అలాగే, ప్రోత్సాహక బహుమతిని విజయుడికి అందించారు.
పొందిన బహుమతులకు సంతోషిస్తూ, ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ప్రథముడిగా నిల్చిన హేమంతుడిలో తనకు తెలియకుండానే కాస్త గర్వం పెరిగింది. తమతమ ఊర్లకు తిరిగి రాగానే, ఎవరి గ్రామంలో వారికి సన్మానం జరిగింది.
ఆ రోజు నుంచి.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సన్మానం చేసేందుకు ఇద్దరినీ పిలవసాగారు. అయితే విజయుడు మాత్రం చాలా సన్మానాలకు వెళ్లలేదు. మరింత శిక్షణ పొందడానికి గురువు దగ్గరకు వెళ్తున్నట్లు హేమంతుడికి చెప్పి వెళ్లిపోయాడు.
‘ప్రథమ బహుమతి రాలేదని విజయుడు బాధ పడుతున్నట్లుంది. అందుకే ఇలా వెళ్లిపోయాడు’ అని హేమంతుడు అనుకున్నాడు. సన్మానాలతో రెండు నెలల కాలం గడిచిపోయింది. మరో రెండు నెలలు... తన ప్రథమ బహుమతినే తలుచుకుంటూ, సంతోషపడుతూ హేమంతుడు ఖాళీగా గడిపేశాడు.
ఈ నాలుగునెలల కాలంలో విజయుడు మాత్రం తన సాధన మానలేదు. ఇంతలో ‘దేశవ్యాప్త చిత్రకళ పోటీ’ ప్రకటించారు. ఆ పోటీకి హేమంతుడు వెళ్లాడు. అప్పటికే అక్కడ విజయుడు ఉన్నాడు. మిత్రులిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులతో ప్రాంగణమంతా నిండిపోయింది.
ఆ పోటీలో విజయుడు ప్రథముడిగా నిలిచాడు. హేమంతుడి చిత్రం మొదటి పది ఉత్తమచిత్రాల్లో కూడా స్థానం సంపాదించలేకపోయింది. హేమంతుడు చాలా బాధపడ్డాడు. విజయుడు ఓదార్చాడు. నాలుగు నెలల విలువైన కాలాన్ని వృథా చేసినందుకే తాను ఓడిపోయాను అని హేమంతుడు గ్రహించాడు. ఆ పొరపాటు మళ్లీ ఇంకెప్పుడూ చేయలేదు.

- హర్షిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని