Updated : 09 May 2022 04:53 IST

పెద్ద తప్పిదం!

ఒకరోజు అడవిలో మృగరాజు అధ్యక్షతన సభ జరుగుతోంది. సమావేశం మధ్యలో జంతువులు గుసగుసలాడటం సింహం కంట పడింది. కారణం ఏంటని ప్రశ్నించింది? జంతువులు చెప్పటానికి తటపటాయించాయి. గట్టిగా గర్జించగానే అవి మాట్లాడేందుకు ముందుకొచ్చాయి.

‘నేను సంపాదించే ఆహారం నా పిల్లలకు చాలటం లేదు. తెచ్చిన దాంట్లో ఎక్కువ భాగం తల్లిదండ్రులకే కేటాయించాల్సి వస్తోంది’ అని ఏనుగు వాపోయింది. ‘నేను కష్టపడి సంపాదించిన మాంసం ముసలి తల్లిదండ్రులకే పెట్టాల్సి వస్తోంది. దాంతో పిల్లలు పస్తులు ఉంటున్నాయి’ అని పెద్దపులి ఆవేదనతో చెప్పింది.

‘మా పెద్దలు తింటానికి తప్ప ఏ పనికీ ముందుకు రారు’ అని ఎలుగుబంటి ఫిర్యాదు చేసింది. ఇలా ప్రతి జంతువు సింహం ముందుకు వచ్చి... ‘మేము కష్టపడి సంపాదించిన ఆహారంలో అధికభాగం వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారికే కేటాయించాల్సి వస్తోంది.

దానివల్ల మా సంతానం ఆకలితో అల్లాడాల్సి వస్తోంది’ అని వివరించాయి. ఇంటి పనుల్లో కూడా ముసలి జంతువులు ఏమాత్రం సహాయపడటం లేదని, భారమంతా తమ మీదే పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి.

ఇంకా.. ముసలి జంతువులు రాత్రిపూట దగ్గు, ఆరోగ్య సమస్యల కారణంగా తమకు నిద్ర కూడా పట్టడం లేదని ఫిర్యాదు చేశాయి. మధ్యాహ్నం పూట ముసలి జంతువులు ఇంటి పనుల్లో సహాయపడకుండా చెట్ల కింద చేరి కబుర్లు ఆడుకుంటాయని జంతువులు ఆరోపించాయి. పిల్ల జంతువులు ముందుకొచ్చి ఏదో చెప్పబోగా పెద్ద జంతువులు కళ్లెర్ర చేయటంతో భయంతో అవి మిన్నకున్నాయి.

అనంతరం సింహం మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ముసలి జంతువులు కావొచ్చు.. కానీ మనల్ని కన్నవారు. మన ఆలనాపాలనా, మన యోగక్షేమాలు చూసినవారు. మన సుఖం కోసం సర్వస్వం ధారపోసిన వాటి మీద ఈ వయసులో అమర్యాదగా ప్రవర్తించడం మంచిది కాదు’ అని హితవు చెప్పబోయింది.

జంతువులన్నీ ముక్తకంఠంతో మృగరాజు మాటలను అడ్డుకున్నాయి. ముసలి జంతువులను అడవి నుంచి బహిష్కరించకుంటే తామంతా అడవిని వీడాల్సి వస్తుందని చెప్పాయి. మళ్లీ పిల్ల జంతువులు నోరు తెరవబోగా, కోపంగా చూశాయి పెద్ద జంతువులు. దాంతో అవి మౌనం దాల్చాయి.

నిజానికి తనకు ఇష్టం లేకున్నా.. ముసలి జంతువులను అడవి నుంచి బహిష్కరిస్తున్నట్లు సింహం ప్రకటించింది. ముసలి జంతువులు భారమైన హృదయాలతో అడవిని వీడేందుకు సిద్ధమయ్యాయి. పిల్ల జంతువులు ముసలి జంతువుల దగ్గరకు వెళ్లి ‘తాతా.. బామ్మా... అమ్మమ్మా... మీరు ఇక్కడ నుంచి వెళ్లొద్దు .. మీరు మాకు కావాలి.. మీరు లేకుంటే మేము బతకలేం.. వదిలి వెళ్లొద్దు’ అని ఎంతో బతిమిలాడాయి.

ముసలి జంతువులు వాటిని దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టి, జాగ్రత్తలు చెప్పి అడవిని వదిలి పెట్టాయి. అడవి జంతువులు తమ ముసలి తల్లిదండ్రులు తమను వీడి వెళ్లడంతో ఆనందంతో పండుగ చేసుకున్నాయి.

మర్నాడు జంతువులు తమ పిల్లలకు ఆహారం తెచ్చి పెట్టి తినమన్నాయి. ‘ఆహారం ఎలా తినాలో మాకు తెలియదు... బామ్మ, అమ్మమ్మ ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ ఆహారం పెట్టేవాళ్లు. మేము కూడా అలా తింటూ వారి ఒళ్లోనే నిద్ర పోయేవారం.

వాళ్లు తినకుండా మొదట మాకు ఆహారం పెట్టేవారు. ఒక్కోసారి పస్తులు ఉండేవాళ్లు. మీరేమో అనరాని మాటలు అన్నారు’ అని పిల్ల జంతువులన్నాయి.

ఈ మాటలతో అడవి జంతువులు ఆశ్చర్యపోయాయి. ‘అదేంటి మేము వచ్చేసరికి తాత, బామ్మ, అమ్మమ్మలు హాయిగా నిద్రపోతుండేవారుగా!’ అన్నాయి.

దానికి పిల్ల జంతువులు.. ‘మీరు వాళ్లనే చూశారు కానీ, వారి గుండెల మీద తల వాల్చి నిద్రపోతున్న మమ్మల్ని గమనించలేక పోయారు. మమ్మల్ని నిద్ర పుచ్చడానికి వాళ్లు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపారో మీకేం తెలుసు?’ అన్నాయి. పిల్ల జంతువుల మాటలతో పెద్ద జంతువుల కళ్లు తెరుచుకున్నాయి.

‘ఈ విషయం మాకు ఎందుకు చెప్పలేదు?’ అని అవి ప్రశ్నించాయి. ‘మీరు ఇంటికి రాగానే వాళ్లను సూటిపోటి మాటలతో సాధిస్తారు. వారు మా కోసం అవన్నీ భరించారు. దగ్గుతూ మీకు నిద్రాభంగం కలిగించింది వాళ్లు కాదు మేము. అంతెందుకు మాకు కడుపునొప్పి, తలనొప్పి, జ్వరం వస్తే అల్లాడి పోయేవాళ్లు. ఉదయాన్నే అడవికి వెళ్లి పసరు ముందు తెచ్చి మాతో తాగించేవాళ్లు. నిజం చెప్పాలంటే మీరు లేకుండా మేము ఉండగలం. కానీ వాళ్లు లేకుండా అస్సలు ఉండలేం. వాళ్లను తీసుకురండి’ అని ఏడుస్తూ చెప్పాయి.

అడవి జంతువులు ఆలోచనలో పడ్డాయి. ‘ఇంతకాలం దగ్గరున్న పెద్దల విలువ తెలుసుకోలేక తొందరపడ్డాం. అనరాని మాటలతో హింసించాం. వారి దగ్గరకు స్వయంగా వెళ్లి క్షమించమని వేడుకుందాం’ అని జంతువులు నిర్ణయించుకున్నాయి. జంతువులన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాయి. సింహం జంతువుల్లో వచ్చిన మార్పునకు సంతోషించి, తన గుహ వెనుక ఖాళీ ప్రదేశంలో ఉన్న ముసలి జంతువులను చూపించింది. అడవి జంతువులు ముసలి జంతువుల కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాయి. ఆ తర్వాత వాటిని తీసుకుని ఇంటిదారి పట్టాయి.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని