Updated : 09 May 2022 04:57 IST

నా పేరు కంగారూ కాదోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా? నన్ను చూసి కంగారూ అనుకుంటున్నారు కదూ! కానీ కాదు. మీరు అలా కంగారు పడకండి. నిజంగానే నేను కంగారూను కానేకాదు. మరి ఇంతకీ నేనెవర్ని? నా పేరేంటో తెలుసుకోవాలని ఉంది కదూ! ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి.

చూడ్డానికి అచ్చం కంగారూలా కనిపిస్తున్న నాపేరు వాలరూ! నేను కంగారూ కన్నా చిన్నగా ఉంటాను. నా తోక కూడా పొట్టిగా ఉంటుంది. నాకు బొచ్చు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది.

నా కాళ్లంటే నాకు ఇష్టం!
నాకు నా కాళ్లంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. ముఖ్యంగా వెనక కాళ్లు రాళ్ల నేలలో దూకడానికి అనుకూలంగా ఉంటాయి. మా వాలరూలు దాదాపు 76 సెంటీమీటర్ల నుంచి 139 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. బరువేమో 13 కిలోల నుంచి 34 కిలోల వరకు ఉంటాయంతే. మాలో మగవి మాత్రం ఆడవాటికన్నా కాస్త పెద్దగా ఉంటాయి.

నేను ఎక్కడ ఉంటానంటే...
అయ్యో.. ఇంతకీ నేను ఎక్కడ ఉంటానో చెప్పనేలేదు కదూ! నేను కంగారూల్లానే ఆస్ట్రేలియాలో కనిపిస్తాను. అవి మైదాన ప్రాంతాల్లో ఉంటే.. నేను మాత్రం కొండలు, గుట్టలు, గుహల పరిసరాల్లో జీవిస్తుంటా. మాలో మళ్లీ బ్లాక్‌ వాలరూ, యాంటిలోపైన్‌ వాలరూ, కామన్‌ వాలరూ అని మూడు రకాలున్నాయి. మీకు మరో విషయం చెప్పనా వాలబీ అనే జీవులు కూడా ఉన్నాయి. అవి మా కన్నా మరింత చిన్నగా ఉంటాయి.

నేనేం తింటానంటే...
నేను కంగారూల్లానే ఎక్కువగా గడ్డిజాతి మొక్కలను తింటాను. నేను గంటకు దాదాపు 49 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలను. సారీ.. సారీ.. గెంతగలను. నాకు మరో ప్రత్యేకతా ఉంది. అదేంటంటే.. రెండు నుంచి మూడు నెలల వరకు నీళ్లు తాగకున్నా బతకగలను. నేను తినే గడ్డి నుంచే నాకు కావాల్సిన నీటిని తీసుకుంటాను. మాలో ఆడవాటికి పొట్టకు సంచీ ఉంటుంది. అందులోనే పిల్లలను సంరక్షిస్తాయి అవి. మా జీవిత కాలం 22 నుంచి 24 సంవత్సరాలు. ‘కంగారూ, వాలరూ రెండూ ఫైట్‌ చేసుకుంటే ఏది గెలుస్తుందబ్బా?’ అని మీకు ఈ పాటికే అనుమానం వచ్చి ఉంటుంది కదూ! కచ్చితంగా కంగారూనే గెలుస్తుంది. ఎందుకంటే అది నా కన్నా పెద్దది, దానికి నాకన్నా ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి. మీరు మాత్రం ఎవ్వరితోనూ ఫైటింగ్‌లు చేయకండి సరేనా. మొత్తానికి ఇవీ నా విశేషాలు ఫ్రెండ్స్‌. నేను ఉంటానిక.. అసలే నాకు చాలా ఆకలి వేస్తోంది.. బై.. బై..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts