Published : 10 May 2022 00:28 IST

ఇరవై రూపాయలు!

రామాపురానికి చెందిన కిశోర్‌ అయిదో తరగతి చదువుతున్నాడు. ఓసారి వాళ్లమ్మ అవసరాలకు ఖర్చు పెట్టుకోమని కిశోర్‌కు ఇరవై రూపాయల నోటిచ్చింది. దాన్ని జేబులో పెట్టుకుని నవ్వుతూ బడికి వెళ్లాడు.
ఆరోజు ఓ ఉపాధ్యాయుడు కొన్ని నీతి కథలు చెప్పారు. మనం దానధర్మాలు చేస్తే, దేవుడు అంతకు మించిన సంపద మనకు ఇస్తాడన్నారు. కిశోర్‌కు ఆ కథ బాగా నచ్చింది.
‘అమ్మ ఇచ్చిన ఇరవై రూపాయలు ఎవరికైనా దానం చేస్తే అంతకు మించి పొందొచ్చు కదా?’ అని ఆశపడ్డాడు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఒక బిచ్చగాడు కనిపించాడు. వెంటనే అమ్మ ఇచ్చిన ఇరవై నోటు అతడికిచ్చాడు.
మరుసటి రోజు నుంచి కిశోర్‌ బడికి వస్తున్నప్పుడు, బడి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు దారంతా వెతకడం ప్రారంభించాడు. అది చూసి స్నేహితులు కారణం అడిగారు. ‘మొన్న బిచ్చగాడికి ఇరవై రూపాయలు దానం చేశాను. మరి, మాస్టారు చెప్పిన కథ ప్రకారం నాకు ఇరవై కంటే ఎక్కువే దొరుకుతుంది కదా, అందుకే వెతుకుతున్నాను!’ అని సమాధానమిచ్చాడు.
కిశోర్‌ అమాయకత్వానికి స్నేహితులు నవ్వుకున్నారు. అది మొదలు రోజూ మిత్రులు... ‘కిశోరూ! నీ ధనం మూట నీకు దొరికిందా?’ అని తెగ ఆటపట్టించేవారు. మాస్టారు చెప్పిన కథ నిజం కాలేదని కిశోర్‌ చాలా బాధపడ్డాడు. ఇదే విషయం ఆ ఉపాధ్యాయుణ్ని అడుగుదామంటే కిశోర్‌కు ధైర్యం చాలలేదు.
కిశోర్‌ ఒకరోజు పాఠశాలకు బయలుదేరుతూ వాళ్లమ్మను డబ్బులడిగాడు. ఆమె ఆశ్చర్యపోతూ... ‘అదేంటి కిశోర్‌... నాలుగు రోజుల కిందట ఇరవై రూపాయలు ఇచ్చానుగా. అప్పుడే అయిపోయాయా?’ అని అడిగింది. కిశోర్‌ జరిగినదంతా పూస గుచ్చినట్లు అమ్మకు చెప్పాడు.
ఆమె చిన్నగా నవ్వుతూ ‘నీకు ఒక వేళ ఎవరి మీదైనా జాలి కలిగితే నేనిచ్చే డబ్బుల్లోంచి కొంత ఇవ్వొచ్చు. అంతేకానీ నేనిచ్చిన డబ్బంతా ఇలా దురాశతో బిచ్చగాడికివ్వడం మాత్రం నాకు నచ్చలేదు. బాగా చదువుకొని ప్రయోజకుడవయ్యాక నీ సంపాదనతో దానం చెయ్యి. అప్పుడు కూడా రెండింతలు వస్తుందనే ఆశతోనో, లేకపోతే తీసుకొనే వారు పొగుడుతారనే భావనతోనో దానం చేయకు. నిస్సహాయకులకు మాత్రమే దానం చెయ్యి. మరొక విషయం చెబుతాను విను. నీ సంపాదన అరకొరగా ఉన్నప్పుడు నీకు లేకుండా దానం చేయడం సరికాదు. అలాగే, పరుల ధనం దానం చేయడం కూడా తప్పే. సంపాదనంతా దానధర్మాలు చేసి ఏ పూటకు ఆ పూట చెయ్యి దులుపుకొంటే నీ చేతిలో రూపాయి కూడా ఎవరూ పెట్టరు! చెట్టును బట్టే ఆకులు తెంపాలి. లేత మొక్క దశలోనే ఆకులన్నీ తెంపితే అది సరిగా పెరుగుతుందా? ఆలోచించు!’ అని ఆమె మరో ఇరవై నోటు తీసి ఇచ్చింది.
ఆ నోటు అందుకుంటూ.. ‘అమ్మా.. మరి మాస్టారు ఆ కథ ఎందుకు చెప్పారైతే?’ అని అమాయకంగా అడిగాడు కిశోర్‌. ‘బాల్యంలో విన్న కథలు పెద్దైనా మరచిపోరు. మీ మనసులో ఇతరులను ఆదుకోవాలన్న ఆలోచన బలంగా నాటడానికి మీ మాస్టారు ఆ కథ చెప్పి ఉంటారు’ అని అమ్మ సందేహం తీర్చింది.

- బెలగాం భీమేశ్వరరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని