Updated : 11 May 2022 06:01 IST

అమ్మ చెప్పింది!

పూర్వం కళింగ రాజ్యంలో కాటారం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో ఒక పూరిగుడిసెలో కనకయ్య, సావిత్రమ్మ అనే దంపతులు నివసిస్తుండేవారు. వారికి ఒక కుమారుడు. అతని పేరు సత్తయ్య.

వారికి జీవనాధారం ఒక ఆవు మాత్రమే. దాని పాలు అమ్ముకుని బతికేవారు. కనకయ్యకు లాభాపేక్ష ఎక్కువ. పాలలో నీళ్లు కలిపి అమ్మాలని ప్రయత్నించేవాడు. అలా చెయ్యడం మహాపాపమని సావిత్రమ్మ వాదించేది. మనం చేసే పాపాలు సత్తయ్యకు శాపాలవుతాయని హితబోధ చేసేది. సత్తయ్యతోనూ.. అబద్ధమాడవద్దని, సత్యమే గెలుస్తుందని మంచి మాటలు చెప్పేది.

సావిత్రమ్మ మంచితనంతో వారి కుటుంబం ఉన్నతస్థితికి చేరింది. వాళ్లు మరో రెండు ఆవులు, రెండు మేకలు కొన్నారు. వాటి ఆలనాపాలనా సత్తయ్య చూసుకునేవాడు. ‘తామొకటి తలిస్తే దైవం మరొకటి తలుచును’ అన్నట్లు ఏదో అంతుచిక్కని వ్యాధితో సావిత్రమ్మ కన్నుమూసింది.

కనకయ్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇంటి పెత్తనమంతా తన రెండో భార్య భాగ్యమ్మకు అప్పగించాడు. ఆమె చెప్పినట్లుగానే వినేవాడు కనకయ్య.

ఒకరోజు కనకయ్య, సత్తయ్య భోజనం చేస్తుంటే.. ‘నా వంటలు రుచికరంగా ఉంటున్నాయా? లేక సావిత్రమ్మ వంట బాగుండేదా?’ అని సత్తయ్యను అడిగింది భాగ్యమ్మ.

‘మా అమ్మ వండిన వంటలే బాగుండేవి’ అని టక్కున సమాధానమిచ్చాడు సత్తయ్య. భాగ్యమ్మకు ఒళ్లు మండింది. ‘వాడి మాటలు పట్టించుకోకు భాగ్యా! నీ వంటలే బాగుంటున్నాయి’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు కనకయ్య. ‘సత్తయ్యా.. నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నిజాలు మాట్లాడొద్దు’ అని మనసులో గొణుక్కున్నాడు.

ఆనాటి నుంచి సత్తయ్య మీద భాగ్యమ్మ చాడీలు చెప్పేది. రోజూ అకారణంగా సత్తయ్యతో గొడవ పడేది. ‘ఇంట్లో సత్తయ్య ఉండాలో.. నేను ఉండాలో... తేల్చుకో..’ అంటూ కనకయ్యను ఓ రోజు ఇరకాటంలో పెట్టింది భాగ్యమ్మ. దీంతో కనకయ్య తలొగ్గక తప్పలేదు. నిజం చెప్పడం మూలాన కలిగే నష్టాలు సత్తయ్యకు తెలిసి రావాలని ఇంట్లో నుంచి తరిమేశాడు కనకయ్య.

సత్తయ్య బతుకుదెరువు వెతుక్కుంటూ.. ఎర్రటి ఎండలో కళింగ రాజ్యానికి బయలుదేరాడు. ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు’ దారిలో మల్లయ్య తలపై వేసుకున్న గొంగళిని కాస్తా ఓ పే..ద్ద గద్ద తన్నుకుపోయింది. బిక్కుబిక్కుమంటూ కళింగ రాజ్యం పొలిమేర చేరేసరికి చీకటి పడింది. దీంతో రాజుగారి గుర్రపుశాలలో విశ్రమించాడు.

అర్ధరాత్రి ఏదో అలికిడికి మెలకువ వచ్చి లేచి చూశాడు సత్తయ్య. ఒకతను మాయాదర్పణంలో చూస్తూ.. ‘భటులంతా నిద్రమత్తులో ఉన్నారు. కోటపై దాడికి ఇదే మంచి సమయం’ అంటూ తన పక్కనున్న మరో ఇద్దరితో చెబుతున్నాడు.
దర్పణంలో అంతా కనబడుతుందని గ్రహించిన సత్తయ్య.. ‘అయ్యా.. నా గొంగళి కనబడుతుందా? కాస్త చూసి చెప్పండి’ అంటూ అమాయకంగా అడిగాడు.

‘నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు?’ అంటూ కోపంగా ముగ్గురు కత్తులు దూసి, తనవైపు మూకుమ్మడిగా రావడం చూసి.. పరుగు అందుకున్నాడు సత్తయ్య. లిప్తపాటులో వారి కన్నుగప్పి కనుమరుగయ్యాడు. కానీ రక్షకభటుల నుంచి తప్పించుకోలేకపోయాడు. సత్తయ్య చెప్పేది నమ్మకుండా వాళ్లు బంధించారు. మరునాడు ఉదయం రాజసభలో ప్రవేశపెట్టారు.

సత్తయ్య తాను గుర్రపుశాలలో చూసిన, విన్న సమాచారం రాజుగారితో ధైర్యంగా విన్నవించుకున్నాడు. సభలో ఉన్న ఒక వ్యక్తిని గుర్తుపట్టి మాయాదర్పణం ఉన్నది అతని దగ్గరే అని వేలెత్తి చూపాడు. అతనెవరో కాదు.. గుర్రపుశాల అధికారి అనంతయ్య. వెంటనే భటులు అనంతయ్యను బంధించి మాయాదర్పణం స్వాధీనం చేసుకున్నారు.

నిజం చెబితే శిక్ష తగ్గిస్తానని రాజు హామీ ఇవ్వడంతో అనంతయ్య నిజాలు బయటపెట్టాడు. తాను మాయాదర్పణాన్ని ఒక ముని దగ్గర దొంగిలించానని చెప్పాడు. పొరుగు రాజు తనకు మంత్రి పదవి ఆశ చూపడంతో వారి సేనాపతితో కలిసి పన్నిన పథకాన్ని వివరించాడు. నేరం ఒప్పుకొని క్షమాభిక్ష పెట్టమని ప్రాధేయపడ్డాడు.

సత్తయ్య నిర్భయంగా నిజం చెప్పడం మూలాన పెద్ద ప్రమాదం తప్పిందని రాజు సంతోషించి.. తన ఆస్థానంలో కొలువు ఇచ్చాడు. తన తల్లి చెప్పిన మాటలు ఫలించాయని సంబరపడ్డాడు సత్తయ్య.

- చెన్నూరి సుదర్శన్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts