Published : 14 May 2022 00:09 IST

బద్ధకమే అసలు శత్రువు!

తొమ్మిదో తరగతి చదివే రాముకు బద్ధకం ఎక్కువ. రోజూ ఆలస్యంగా నిద్రలేస్తాడు. వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోడు. బడికెళ్లే ముందు గబగబా స్నానం చేసేస్తాడు. సాయంత్రం వచ్చాక బూట్లు, సాక్సులు విసిరేసి.. మంచం మీదకు చేరతాడు. కాళ్లు కడుక్కోమని చెప్పినా వినిపించుకోడు.

ఒకరోజు రాము వాళ్ల తాతయ్య ఊరు నుంచి వచ్చాడు. రెండో రోజుకే మనవడి బద్ధకం గురించి తెలుసుకున్నాడు. తర్వాత రోజు ఉదయమే రామును నిద్రలేపి పార్కుకు వెళదామన్నాడు తాతయ్య. విసుగ్గా కళ్లు తెరిచి ‘పొద్దున్నే లేవలేను’ అని చెప్పి దుప్పటి కప్పేసుకున్నాడు. ‘నాతో వస్తే అందమైన దృశ్యాలను చూపిస్తాను. నీకు నచ్చినవి కొనిస్తాను’ అని ఆశ పెట్టి దుప్పటి తీసేశాడు తాతయ్య. ఎలాగోలా కష్టపడి మనవడిని పార్కుకు తీసుకెళ్లాడు.

అప్పటికే పార్కులో చాలామంది ఉన్నారు. కొందరు గబగబా నడుస్తుంటే, ఇంకొందరు కసరత్తులు సాధన చేస్తున్నారు. పిల్లలంతా ఆటవస్తువులతో ఆడుకుంటున్నారు. వాళ్లను చూసి ఆశ్చర్యపోయి ‘ఇంతమంది ఉన్నారేంటి?’ అనడిగాడు రాము. ‘ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు. దాన్ని కాపాడుకోవడానికే ఇదంతా..’ చెప్పాడు తాతయ్య. ఆ పార్కు నుంచి కొంచెం దూరంలో ఓ పల్లెటూరు కనిపించింది.

ఆ వైపుగా మనవడిని తీసుకెళ్లాడు తాతయ్య. చల్లటి గాలి వీస్తుంటే హాయిగా అనిపించింది రాముకు.

తూర్పున ఉదయిస్తున్న సూర్యుణ్ని చూసి నోరెళ్లబెట్టాడు రాము. సూర్యుడికి ఎదురుగా పక్షుల గుంపు ఎగురుతుంటే అతడికి బాగా నచ్చింది. అంతలో పొలాలకు వెళుతున్న పశువులు, భుజాన నాగలితో నడుస్తున్న రైతులను మైమరిచి చూస్తున్న రాముతో.. ‘తొందరగా నిద్రలేస్తే ఇలాంటి ప్రకృతి అందాలు తనివితీరా చూడొచ్చు’ చెప్పాడు తాతయ్య. ‘నావల్ల కాదు తాతయ్య’ జవాబిచ్చాడు రాము. ‘ఎగిరే పక్షులు, నడుస్తున్న పశువులు.. పనికి వెళుతున్న రైతులను చూశావు కదా.. ఎంత ఉత్సాహంగా ఉందో తెలిసింది కదా.. త్వరగా లేస్తే ప్రశాంతమైన పరిసరాలు మనలోని ఉత్సాహాన్ని పెంచుతాయి’ వివరించాడు తాతయ్య.

అప్పుడే పక్కనే ఉన్న చెరువులో ఎగురుతూ విన్యాసాలు చేస్తున్న చేపలు, బెకబెకమంటున్న కప్పలు, ఈదుతున్న బాతులు, ఒడ్డున నిలబడి చేపల కోసం చూస్తున్న కొంగలను ఆసక్తిగా గమనించాడు రాము. ‘అవన్నీ చలాకీగా ఉన్నాయంటే కారణం.. వాటికి బద్ధకం లేకపోవడమే’ చెప్పాడు తాతయ్య. ‘ఇవన్నీ చూడాలని ఉంటుంది. కానీ పొద్దున్నే లేవలేను’ మళ్లీ అదే జవాబిచ్చాడు రాము. ‘నువ్వు లేవగలవు. కానీ, నీకు ఆ విషయం తెలియడం లేదు. వేసవి సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడు, జెండా వందనానికి తొందరగా బడికి వెళ్లినప్పుడు, బంధువుల పెళ్లి కోసం తిరుపతి రైలును అందుకోవడానికి వెళ్లినపుడు తొందరగా లేచావట’ గుర్తు చేశాడు తాతయ్య. ‘అమ్మ చెప్పిందా?’ తల మీద గోక్కుంటూ సిగ్గుపడ్డాడు రాము. ‘నీకిష్టమైనవైతే తొందరగా లేస్తావు. అలాగే.. ఇవీ ఇష్టమైనవే అనుకున్నావంటే లేవగలవు. అలా అయితే రోజూ ప్రకృతి అందాలు చూడొచ్చు. ఇక్కడే పది రోజులుంటాను నీకోసం. అలవాటయ్యే వరకు తోడుగా వస్తాను’ చెప్పాడు తాతయ్య.

‘నిజమా?’ సంతోషంగా అడిగాడు రాము. ‘అవును.. ఇంటికి వెళ్లాక స్నానం చేసి పుస్తకాలు తీసి చదువుకున్నావంటే బాగా గుర్తుంటుంది. ఉదయాన్నే లేవడం అలవాటైతే ఉత్సాహంతో రోజంతా గడపగలవు’ చెప్పాడు తాతయ్య. వాళ్లకు దగ్గర్లోనే కొబ్బరి చెట్టెక్కి బొండాలు దింపుతున్న వ్యక్తిని పిలిచాడు తాతయ్య. ఒక కాయ కొట్టించి, తాగమని రాముకు ఇచ్చాడు. తరవాత.. అక్కడే తాటి చెట్టుకు ఉన్న ముంజెలు కోయించి ఇంటికి పట్టుకెళ్లాడు. ‘ఈ రెండూ నాకు ఇష్టమైనవే’ అని సంబరపడ్డాడు రాము.

‘అసలు బద్ధకం ఎందుకు వస్తుంది?’ దారి మధ్యలో అడిగాడు రాము. ‘‘మన పనిని మనం చెయ్యలేకపోయినా, మరొకరు చేస్తారన్న ధీమా ఉన్నా, ‘తర్వాత చేద్దాంలే... తొందరేముంది’ అని వాయిదా వేసినా, పనేదీ చేయాలని లేకపోయినా బద్ధకం వస్తుంది. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసేవారు మాత్రం ఉత్సాహంగా ఉంటారు. అన్నింట్లో విజయాలు సాధిస్తారు. సమయానికి ఎవరో ఒకరు అందించేవాళ్లు ఉన్నారన్న ధైర్యం ఉన్నప్పుడే బద్ధకం పెరుగుతుంది. ఎదుగుదలకు అదే అసలు శత్రువు. మరి శత్రువును ఎక్కడ ఉంచాలో నువ్వే చెప్పు’’ అని అడిగాడు తాతయ్య. ‘ఇంట్లోకి, ఒంట్లోకి రానివ్వకుండా దూరంగా పెట్టాలి’ నవ్వుతూ అన్నాడు రాము. ‘శెభాష్‌ మనవడా.. బాగా చెప్పావు. ఈ మాటలే మనసులో బలంగా అనుకో. బద్ధకాన్ని జయించవచ్చు. మిగిలిన సమయాన్ని నీ ఆసక్తుల కోసం ఉపయోగించు’ అంటూ ప్రోత్సహించాడు తాతయ్య.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని