Published : 15 May 2022 02:13 IST

పుల్లయ్య పనితనం

కోరుపెల్ల గ్రామపెద్ద రామచంద్రయ్య దగ్గర పుల్లయ్య అనే పనివాడు ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న పుల్లయ్యను ఆయన చేరదీశాడు. పుల్లయ్యకు చదువు లేదు. చెప్పిన పని చేసేవాడు. పెద్దగా జ్ఞాపకశక్తి లేనివాడు. అమాయకుడు కూడా. కానీ కొన్నిసార్లు పుల్లయ్య చేసిన పనులు తప్పైనా కూడా అవి యజమానికి లాభమే చేసిపెట్టేవి.

ఒకరోజు రామచంద్రయ్య తన అల్లుడిని, కుమార్తెను ఊరికి సాగనంపాడు. ఆ హడావిడిలో అల్లుడికి ఇస్తానన్న డబ్బు ఇవ్వడం మరిచిపోయాడు. ‘బస్సు ఇంకా వెళ్లి ఉండదు. పుల్లయ్య ఈ డబ్బు వెంటనే అల్లుడికి అందించి రా.. జాగ్రత్త’ అని చెప్పి సొమ్ము పుల్లయ్యకు ఇచ్చి పంపాడు. బస్సు ఆగేచోటు రామచంద్రయ్య గారి ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది.

పుల్లయ్య డబ్బు పట్టుకుని బస్సు దగ్గరకు బయలు దేరాడు. దారిలో పక్కింటి మాణిక్యం కనిపించి.. ‘ఏం పుల్లయ్య బాగున్నావా’ అని పలకరించాడు. అలా వారిద్దరు మాటల్లో పడడంతో బస్సు వచ్చి వెళ్లిపోయింది.

‘అనవసరంగా మాటల్లో పడి డబ్బులు ఇవ్వడం మరిచిపోయా. ఇప్పుడు యజమాని ఏమంటాడో, ఏమిటో’ అని భయం భయంగా ఇంటికి వెళ్లాడు పుల్లయ్య. విషయం తెలుసుకుని చీవాట్లు పెట్టాడు రామచంద్రయ్య. ‘సరేలే.. రేపు ఎవరి చేతనైనా ఇచ్చి పంపొచ్చు’ అనుకున్నాడు. కొంత సమయానికి అల్లుడి దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మావయ్యా... మీరు డబ్బులు ఇవ్వకపోవడం మంచిదైంది, బస్సులో దొంగతనం జరిగింది. అందరి డబ్బులూ దోచేశారు’ అని చెప్పాడు. అలా పుల్లయ్య చేసిన పని వల్ల మంచే జరిగింది.

మరోసారి రామచంద్రయ్య ఇంట్లో ఏదో శుభకార్యం పెట్టుకున్నారు. చుట్టుపక్కల వారిని పిలిచి అందరికీ భోజనాలు పెట్టాలని అనుకున్నాడు. వంటవాళ్లను తీసుకువచ్చాడు. వంటల దగ్గర పుల్లయ్యను కాపలా పెట్టాడు. ‘పిచ్చివేషాలు వెయ్యకుండా.. వారికి ఏం కావాలో అడుగు. వాళ్లు చెప్పినట్లుగా నడుచుకో’ అన్నాడు రామచంద్రయ్య. ‘అలాగే...’ అంటూ వంటవాళ్లకు సహాయకుడిగా నిలుచున్నాడు పుల్లయ్య. వంటలన్నీ అయ్యాక ఒక పక్క సర్దారు. 

ఇంతలో ఒక కుక్క అటుగా రావడంతో దాన్ని తరిమే ప్రయత్నంలో సాంబారు గిన్నెను తన్నాడు పుల్లయ్య. అదంతా నేలపాలైంది. అటుగా వచ్చిన రామచంద్రయ్య, మిగతావారు పుల్లయ్యను తెగ తిట్టారు. ‘తాతయ్యా! సాంబారు గిన్నెలో బల్లి ఉంది చూడండి’ అని చూపించాడు రామచంద్రయ్య మనవడు. ‘నిజమే సాంబారు గిన్నెలో అడుగున పెద్ద బల్లి ఉంది. ఈ రోజు పుల్లయ్య చేసిన పని అందరినీ రక్షించింది. నా పరువునూ కాపాడింది’ అనుకుంటూ పుల్లయ్యను దగ్గరకు తీసుకున్నాడు రామచంద్రయ్య. అలా పుల్లయ్య చేసిన కొన్ని పనులు పరోక్షంగా యజమానిని చాలాసార్లు కాపాడాయి.

‘పుల్లయ్యా.. ఈ రోజు పాలేరు రాలేదు. మన ఆవులను పొలానికి తీసుకుని వెళ్లి మేపుకొని రా. జాగ్రత్త సుమా.. నువ్వు అసలే మాటల్లో పడితే పని మరిచిపోతావు’ అన్నాడు. సరే.. అంటూ ఆవులను తీసుకుని బయలుదేరాడు పుల్లయ్య. ఇంతలో రామచంద్రయ్య సతీమణి వచ్చి ‘పుల్లయ్యా నీకు ఇష్టమని పాయసం చేశాను. సరేలే వచ్చాక తిందువు గానీ, త్వరగా వచ్చేయి’ అంది. పాయసం అనగానే నోరూరింది పుల్లయ్యకు. అయినా ఆవులను పొలం తోలుకుపోవాలి అనుకుంటూ బయలుదేరాడు. కానీ మధ్యాహ్నానికే తిరిగి ఆవులను తోలుకుని వచ్చేశాడు.

‘అదేమిటిరా.. ఆవులను గడ్డి తిననీయకుండా వెంటనే వచ్చేశావు’ అంటూ తిట్లు మొదలు పెట్టాడు రామచంద్రయ్య. కాసేపటికి ఆకాశం మబ్బులు కమ్మేసింది. ఉరుములతో పెద్ద వాన మొదలైంది. అప్పటికే అక్కడికి పరిగెత్తుకు వచ్చిన పక్కింటి సుబ్బయ్య..‘రామచంద్రయ్యా.. మీ పొలంలో పిడుగులు పడ్డాయట. ఇప్పుడే తెలిసింది. పాలేరు ఏమీ అటు వెళ్లలేదు కదా’ అన్నాడు. మరోసారి పుల్లయ్య చేసిన పని రామచంద్రయ్యకు కలసి వచ్చింది.
ఇకపై పుల్లయ్య ఏ పని చేసినా.. ఏమీ అనకూడదని గట్టిగా అనుకున్నాడు రామచంద్రయ్య. ‘పాపం.. వాడు అమాయకుడండి. వాడినేమీ అనకండి. మంచికో, చెడుకో వాడు చేసిన పనులు మనకు కలిసి వస్తున్నాయి’ అంటూ పాయసం పుల్లయ్యకు అందించింది రామచంద్రయ్య సతీమణి.

- కూచిమంచి నాగేంద్ర


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts