Published : 16 May 2022 00:33 IST

బావిలో వజ్రాలు!

పల్లవ దేశాన్ని రుద్రమవర్మ పరిపాలించేవాడు. రాజు ఉచితాల పేరుతో డబ్బును పంపిణీ చేయడంతో ప్రజలంతా సోమరులుగా మారిపోయారు. కష్టపడేందుకు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. రాజ్య పరిధిలోని రామాపురంలో మొత్తం వంద కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊరంతటికీ దిగుడు బావి ఒక్కటే దిక్కు. ఎండాకాలం సమీపిస్తున్న కొద్దీ అందులో నీళ్లు అడుగంటసాగాయి. 

 ఒకరోజు రామాపురం గ్రామాధికారి శివయ్య దిగుడు బావి దగ్గరకు వెళ్లాడు. అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్న కొందరు యువకులు కనిపించారు. ‘రాబోయేది వేసవికాలం. మన ఊరికి నీటి సమస్య రాకూడదంటే ఈ బావి పూడిక తీయాలి. అందుకు మీరు సహకరించాలి’ అని వారిని అడిగాడు శివయ్య. దానికి ‘మాకు రోజుకు ఎంత కూలీ ఇస్తారు’ అని అడిగారా యువకులు. ఆ ప్రశ్నకు శివయ్య నివ్వెరపోయాడు. ‘మన నీటి సమస్య తీరాలంటే మనమే కష్టపడాలి. స్థానికులై ఉండి కూడా మీరు కూలీ అడుగుతారని అనుకోలేదు. పైగా ప్రస్తుతం గ్రామ నిధులు కూడా అడుగంటాయి’ చెప్పాడు శివయ్య. 

 ‘ఏ పనీపాటా లేకుండానే రాజుగారు మాకు డబ్బులు పంచిపెడుతున్నారు. ఇప్పుడు మీరు పనిచేసినా ఏమీ ఇవ్వలేము అంటున్నారు. అలా అయితే ఎలా?’ అన్నాడో యువకుడు. ‘అవును’ అని మిగతా వారూ వత్తాసు పలికారు. వీరితో మాట్లాడటం వృథా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు శివయ్య. 

మరుసటి రోజు పొరుగూరులో సంతకు వెళ్లిన శివయ్యకు.. బాల్య స్నేహితుడు చంద్రయ్య కనిపించాడు. కుశల ప్రశ్నలయ్యాక.. తమ ఊరి బావి విషయాన్ని వివరించాడు శివయ్య. తరవాత మిత్రుడి చెవిలో ఏదో చెప్పాడు చంద్రయ్య. ఎప్పటిలాగే ఆ రోజు సాయంత్రం యువకులంతా బావి దగ్గర చేరి ముచ్చట్లు పెడుతున్నారు. ఇంతలో ఒక సాధువు, తన శిష్యుడితో కలిసి అక్కడకు వచ్చారు. శిష్యుడు బావిలోకి దిగి.. ఏదో వెతకసాగాడు. కొద్దిసేపటి తర్వాత ‘గురువు గారూ.. వజ్రం దొరికింది’ అని గట్టిగా అరిచాడు. యువకులంతా పరుగెత్తుకుంటూ వచ్చి.. ఆ వజ్రాన్ని పరిశీలించసాగారు. 

‘పూర్వం రాజులు ఎక్కడపడితే అక్కడే వజ్రాలు, బంగారు నాణేలూ దాచేవారు. అలా తెలిసిన ఒక సమాచారంతో ఈ బావిలో వెతకగా.. వజ్రం దొరికింది. వెంటనే ఈ నిధిని రాజుకు అప్పగిస్తే.. రాజ్య క్షేమానికి వినియోగిస్తారు’ అంటూ యువకులతో అన్నాడా సాధువు. ఆ మాటలతో యువకులంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ‘మనం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బావిని తవ్వి వజ్రాలను దక్కించుకుందాం’ అని నిర్ణయించుకున్నారు. 

అనుకున్నదే తడవుగా వాళ్లంతా ఇళ్లకు చేరుకొని పలుగు, పార, తట్ట, బుట్టలతో బావి దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు తవ్వుతుంటే.. మరో ఇద్దరు మట్టిని ఎత్తి..పైనున్న వారికి అందించారు. ఆరోజు వారికి ఏమీ దొరకలేదు. మరుసటి రోజు కూడా పూడిక తీశారు. కానీ, లాభం లేదు. అలా వరుసగా వారం రోజులపాటు బావి పూడిక మొత్తం తొలగించినా.. ఒక్క వజ్రం కూడా వారికి దొరకలేదు. 

‘నీటి ఊట అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక మనం బావిని తవ్వలేం’ అనుకొని నిరుత్సాహపడ్డారు. అప్పుడు గ్రామాధికారి శివయ్య అక్కడకు చేరుకొని.. ‘మీరంతా ఎందుకు బాధపడుతున్నారు? బంగారు నాణేలూ, వజ్రాలు దొరక్కపోయినా.. కష్టపడి బావిలో నీటి ఊటలు తీసుకొచ్చారు. మీ శ్రమ వృథా కాలేదు. వేసవిలో ఎద్దడి ఏర్పడకుండా చూశారు’ అన్నాడు. ‘అవును.. మీరు చెప్పినప్పుడు మేము వినలేదు. డబ్బు కోసమే ఆశపడ్డాం తప్ప మన ఊరి ప్రజల గురించి ఆలోచించలేకపోయాం. మాకు బాగా బుద్ధి వచ్చింది’ అని బాధపడ్డారా యువకులు. 

‘గ్రామానికి నిధులు రాగానే మీ శ్రమకు ఫలితంగా డబ్బులు అందించే బాధ్యత నాది’ అన్నాడు శివయ్య. ‘మన ఊరి సమస్య తీర్చడం కంటే విలువైన ధనం ఏమీ లేదు. ఆ నిధులను గ్రామాభివృద్ధికే వినియోగించండి’ అని అన్నారు యువకులంతా. వారిలో వచ్చిన మార్పునకు శివయ్య ఎంతో సంతోషించాడు. తన బాల్య స్నేహితుడు చంద్రయ్యే.. సాధువులా వచ్చి రంగురాయిని వజ్రంగా నమ్మించిన విషయాన్ని తలుచుకుంటూ.. మిత్రుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు శివయ్య.

- యు.విజయశేఖరరెడ్డి    


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని