రాకుమారి సంయుక్త

అనగనగా ఒక చిన్ని రాకుమారి ఉండేది. ఆమె పేరు సంయుక్త. ఆమెకు తన చుట్టూ జరిగే విషయాల మీద ఆసక్తి ఎక్కువ. కానీ తల్లిదండ్రులు మాత్రం అనవసరమైన విషయాల గురించి ఆమెకు చెప్పేవారు కాదు. దాంతో రాకుమారి బాధపడేది.

Published : 22 May 2022 01:38 IST

నగనగా ఒక చిన్ని రాకుమారి ఉండేది. ఆమె పేరు సంయుక్త. ఆమెకు తన చుట్టూ జరిగే విషయాల మీద ఆసక్తి ఎక్కువ. కానీ తల్లిదండ్రులు మాత్రం అనవసరమైన విషయాల గురించి ఆమెకు చెప్పేవారు కాదు. దాంతో రాకుమారి బాధపడేది. తనను తెలుసుకోనివ్వట్లేదని, తనకు సంబంధించిన విషయాలు కాకపోయినా చాటుగా విని తెలుసుకునేది. అలా తెలుసుకున్న విషయాలను తన స్నేహితులతో పంచుకునేది.

ఒకసారి రాజ్యానికి వచ్చిన విదేశీ వ్యాపారి రాజుగారికి ఒక విచిత్రమైన పెట్టెను బహూకరించాడు. రాజు దాన్ని ఎంతో జాగ్రత్తగా ఆయన విశ్రాంతమందిరంలో ఉంచాడు. రోజూలాగే తండ్రితో కాసేపు ఆడుకోవడానికి వచ్చిన రాకుమారి ఆ పెట్టెను చూసి తెరవబోయింది. రాజుగారు ‘అది నీకు అవసరం లేనిది’ అని చెప్పి ఆ పెట్టె జోలికి పోనీయలేదు. రాకుమారికి అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది.

అమ్మను అడిగితే అది విదేశీ వర్తకుడు ఇచ్చిన బహుమతి అని మాత్రమే తెలుసని చెప్పింది. రాకుమారి ‘దానిలో ఏముంది?’ అని అడగ్గా.. ‘నాకు తెలియదు’ అని సమాధానం ఇచ్చింది తల్లి. రాకుమారికి ఎలాగైనా ఆ పెట్టెను తెరిచి చూడాలనే పట్టుదల పెరిగింది.

రెండురోజుల తరువాత రాజుగారు వేటకెళ్లిన సమయంలో విశ్రాంత మందిరంలోకి వెళ్లింది. పెట్టె అక్కడే ఉంది కానీ చుట్టూ కాపలాగా భటులు ఉన్నారు. ఏం చేయాలా అని ఆలోచించింది. తన ఉంగరం కనిపించడం లేదని, వెతకాలని అక్కడున్నవారిని ఆదేశించింది. అందరూ ఉంగరం వెతికే పనిలో ఉండగా నెమ్మదిగా ఆ పెట్టెను తెరిచింది. దానిలో ఏముందో చూడాలని ప్రయత్నించింది. కానీ అంతా చీకటిగా ఉండి ఏమీ కనపడలేదు. అందుకని చేయి లోపలకు పెట్టి వెతకబోయింది.

ఇంతలో పట్టు తప్పి పెట్టెలో పడిపోయింది. అది చాలా లోతుగా ఉంది. పైకి చిన్నగా కనపడినా అంత లోతు ఉంటుందని ఆమె ఊహించలేదు. ఏమీ కనపడట్లేదు. బయటకు వెళ్లడానికి పట్టు ఏమీ దొరకట్లేదు. ఇక లాభం లేదనుకుని బయటున్న వారిని పిలవాలని ప్రయత్నించింది. కానీ రాకుమారి అరుపులు ఎవరికీ వినపడడం లేదు. అరిచి అరిచి అలసిపోయి నిద్రలోకి జారుకుంది.

రాకుమారి కనపడకపోయేసరికి రాణితో సహా భటులంతా కంగారుపడి వెతకడం మొదలుపెట్టారు. అంతఃపురం అంతా గాలించినా లాభం లేకపోయింది.

సాయంకాలానికి రాజు వేట నుంచి తిరిగివచ్చాడు. రాకుమారి సంగతి తెలిసి కోపోద్రిక్తుడయ్యాడు. ఒక్కగానొక్క కుమార్తెకు ఏమైందో అని చింతిస్తూ.. విశ్రాంత మందిరంలో కూర్చుని ఆలోచించసాగాడు. అప్పుడే ఆయన దృష్టి పెట్టె మీద పడింది. కుమార్తె దాన్ని తెరిచి ఉండొచ్చు అని ఆలోచన వచ్చిన మరుక్షణం పెట్టె వద్దకు వెళ్లాడు.

వర్తకుడి సూచన ప్రకారం అతడిచ్చిన నూనెను చేతికి రాసుకుని పెట్టెను తెరిచాడు రాజు. రాకుమారికి తండ్రి పెట్టెను తెరిచినట్టు తెలిసింది కానీ ఆమె అరుపులు ఏమీ వినపడట్లేదు. ఆమె కనపడటం లేదు కూడా!  

విదేశీ వర్తకుడు చెప్పిన దాన్ని మననం చేసుకున్నాడు రాజు. ‘రాజా! ఇది చాలా ప్రత్యేకమైన పెట్టె. మీరు రాజ్యానికి సంబంధించిన రహస్యమైన సంపద గానీ, కీలకమైన సమాచార పత్రాలుగానీ భద్రపరుచుకోవచ్చు. అలాగే చూడటానికి చిన్నగా ఉన్నా ఇందులో చాలా స్థలం ఉండేలా తయారు చేశాను. దీనిలో దాచినవి ఏవీ ఇతరులకు కనపడవు. అవి కనపడాలంటే మీరు ఈ జలాన్ని కొంచెం పెట్టెలోపల పోయాలి. ఇతరులు పెట్టెను దొంగిలించి ఈ నూనె చేతికి రాసుకోకుండా తెరిస్తే వారు పెట్టెలో బందీలుగా ఉండిపోవాల్సిందే. మా రాజు గారికి మీరు చేసిన సహాయానికి, కానుకగా మీ కోసం ఈ విశేషమైన పెట్టెను తయారు చేయించారు’ అని చెప్పాడు. అతడు చెప్పినట్టుగా ఆ జలాన్ని చల్లాడు.

ఏడుస్తున్న కూతురుని చూసి తల్లడిల్లిపోయాడు. గబగబా పెట్టెలో ఉన్న మెట్లు దిగి వెళ్లి రాకుమారిని పైకి తీసుకుని వచ్చాడు.  ‘నాన్నా! నన్ను క్షమించండి. మీరు వద్దన్న పని చేయడం వల్ల కలిగే కష్టం ఇంత దారుణంగా ఉంటుందని తెలియక, ఇన్నాళ్లూ అల్లరి పనులు చేస్తూ ఉన్నాను. ఇక పై మీరు  వద్దు అన్న వాటి జోలికి పోను’ అని తండ్రిని హత్తుకుంది రాకుమారి సంయుక్త.

- హారిక


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని