కోకిల పాట.. కాకుల గోల!

ఓ అందమైన అడవి కోసంగి. అందులో కోకిలలు తప్ప అన్ని రకాల పక్షులూ, జంతువులూ ఉండేవి. ఒకరోజు ఎక్కడి నుంచో ఒక కోకిల వచ్చి అడవిలోని మామిడిచెట్టు మీద వాలింది. కుహూ...కుహూ అంటూ తియ్యగా కూయసాగింది. మధురమైన కోకిల స్వరానికి జీవులన్నీ పరవశించసాగాయి. అక్కడికి దగ్గరలోనే మృగరాజు గుహ ఉంది. కోకిల పాటకు సింహం మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది.

Updated : 23 Feb 2024 12:12 IST

అందమైన అడవి కోసంగి. అందులో కోకిలలు తప్ప అన్ని రకాల పక్షులూ, జంతువులూ ఉండేవి. ఒకరోజు ఎక్కడి నుంచో ఒక కోకిల వచ్చి అడవిలోని మామిడిచెట్టు మీద వాలింది. కుహూ...కుహూ అంటూ తియ్యగా కూయసాగింది. మధురమైన కోకిల స్వరానికి జీవులన్నీ పరవశించసాగాయి. అక్కడికి దగ్గరలోనే మృగరాజు గుహ ఉంది. కోకిల పాటకు సింహం మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది.

కొద్దిసేపటికి అది గుహ నుంచి బయటకు వచ్చి.. ఒక బుల్లిపిట్ట అటుగా వెళ్తుంటే పిలిచింది. ‘ఓ బుల్లిపిట్టా! నాకు తెలిసి ఇలాంటి కమ్మని పాటను వినడం ఇదే మొదటిసారి. ఎవరు పాడుతున్నారో చూసి, వివరాలు తెలుసుకుని రా..’ అని ఆదేశించింది. ‘అలాగే రాజా’ అంటూ పాట వినిపిస్తున్న వైపు ఎగురుతూ వెళ్లి.. కోకిల ముందు వాలింది బుల్లిపిట్ట. దాన్ని చూడగానే పాటను ఆపేసింది కోకిల.

‘మిత్రమా.. ఎవరు నువ్వు.. ఎక్కడనుంచి వచ్చావు.. ఇంత బాగా పాటపాడే ప్రతిభ ఎలా వచ్చింది?’ అని అడిగింది బుల్లిపిట్ట. ‘నాపేరు కోకిల. ఇక్కడకు దూరంగా ఉన్న అడవి నుంచి వచ్చాను. మా అమ్మే నాకు పాటలు పాడటం నేర్పింది’ అని సమాధానమిచ్చింది కోకిల. బుల్లిపిట్ట మృగరాజు వద్దకు వెళ్లి కోకిల వివరాలు చెప్పింది.

‘ఆ పక్షి కళకు అభినందనలు. దాన్ని ఘనంగా సన్మానించాలని అనుకుంటున్నాను. రేపు ఉదయం నా గుహకు రమ్మని చెప్పు’ అంది సింహం. బుల్లిపిట్ట ఎగురుతూ కోకిల దగ్గరకెళ్లింది. ‘మిత్రమా! అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీ కళను మెచ్చి మృగరాజు నిన్ను సత్కరిస్తారట. రేపు ఉదయం సింహం గుహకు రమ్మని నాతో కబురు పంపింది’ చెప్పింది బుల్లిపిట్ట.

రాజసన్మానం అనగానే కోకిల సంతోషంతో ‘వస్తాను’ అంది. చెట్టు గుబురులో ఉన్న ఒక కాకి ఈ మాటలన్నీ విన్నది. అక్కడి నుంచి దూరంగా వెళ్లి ‘కావ్‌...కావ్‌’ అని అరవసాగింది. ఆ అరుపులకు మిగతా కాకులూ గుమిగూడాయి. వాటికి విషయం చెప్పి ‘మన స్వరం కఠోరంగా ఉంటుంది. ఎవరికీ నచ్చదు. కోకిల పాట వింటూ ఉంటే నా కడుపులో మంట వస్తున్నట్లుంది’ వాపోయింది కాకి.

‘అవును.. మాకు కూడా బాధగా ఉంది. కొత్తగా వచ్చిన దానికి సన్మానమంటే మేము కూడా ఓర్వలేకపోతున్నాం. వెంటనే ఆ పక్షిని మన అడవి నుంచి పంపించే ఉపాయం ఆలోచించాలి’ అన్నాయి. కాకులన్నీ కలిసి ఒక ఉపాయం ఆలోచించాయి.
ఒక కాకి, కోకిల వద్దకు వెళ్లి ‘మిత్రమా.. బుల్లిపిట్ట సన్మానం పేరు చెప్పి నిన్ను సింహం గుహకు రమ్మనటం నేను విన్నాను. నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది. సింహానికి కమ్మని పాటలు పాడే కోకిలల మాంసం అంటే చాలా ఇష్టం. సన్మానం పేరుతో గుహకు పిలిపించి చంపి తింటుంది. అలా తినడం వల్లే ఈ అడవిలో ఒక్క కోకిల కూడా లేదు. ఈ విషయం ఇక్కడ పక్షులకూ, జంతువులకూ తెలుసు. మృగరాజుకు భయపడి అవి నీకు చెప్పవు. వెంటనే ఇక్కడి నుంచి పారిపో’ అని చెప్పి ఎగిరిపోయింది.

ఆకుల చాటున ఉన్న చిలుక ఈ మాటలు విని కోకిల దగ్గరకు వచ్చింది. ‘ఓ కోకిలా.. కాకి చెప్పిందంతా అబద్ధం. కాకుల స్వరం కఠోరంగా ఉంటుంది కాబట్టి నీ పాటను, సన్మానాన్ని ఓర్వలేక అసూయతో నిన్ను అడవి నుంచి పంపించేయాలని కట్టుకథ అల్లింది. మాట్లాడే కళతో నేనూ, నాట్యంతో నెమళ్లూ ఎప్పుడో రాజసన్మానం పొందాం. ఆ కాకి మాటలు పట్టించుకోకుండా నువ్వు సత్కారానికి వెళ్లు’ అని చెప్పింది.

కోకిల ఆలోచనలో పడింది. ‘నన్ను సింహానికి ఆహారమయ్యేలా చేస్తే.. చిలుకకు వచ్చే లాభం ఏముంది? దాని మాటలు నమ్మదగినవిగానే ఉన్నాయి’ అనుకుంది. ఉదయమే సింహం గుహకు వెళ్లింది. కోకిల గాత్రాన్ని అభినందించి, ఘనంగా సన్మానించింది మృగరాజు.

తర్వాత సింహంతో కాకుల విషయం చెప్పింది కోకిల. అది కోపంతో కాకులన్నింటినీ గుహకు పిలిపించింది. ‘కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందవచ్చు. అసూయతో సాధించేది ఏమీ లేదు. కళాకారులను, ప్రతిభావంతులను సన్మానించి, అభినందించడం కనీస బాధ్యత. మన ప్రశంసలే వారికి ప్రోత్సాహకాలు. ఇతరుల ఎదుగుదల చూసి అసూయతో ఓర్వలేకపోవడం అల్పుల లక్షణం. అలాంటి మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు. వెంటనే ఈ అడవిని వదిలి వెళ్లిపోండి’ అని ఆదేశించింది మృగరాజు.

‘ప్రభూ.. మా తప్పు ఏంటో తెలుసుకున్నాం. ఇకనుంచి ఎవ్వరినీ చూసి అసూయపడం. ఈ ఒక్కసారికి క్షమించండి’ అని ప్రాధేయపడ్డాయి కాకులు. మొదటి తప్పుగా వాటిని క్షమించేసింది సింహం.

- డి.కె.చదువులబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని