పేరుతో పనేంటి?

అదొక చిట్టడవి. ఆ అడవిలో ఒక పిల్లకోతి తన తోటి స్నేహితులతో కలసి ఆటలు ఆడుతోంది. అందులో భాగంగానే ఒక చెట్టుపై నుంచి మరో చెట్టు పైకి దూకుతూ చాలా దూరం వెళ్లింది. తన స్నేహితులెవ్వరూ కనిపించలేదు. అడవికి దగ్గర్లోని ఒక ఊరు వచ్చానని గ్రహించింది. చుట్టూ చూసింది.

Published : 24 May 2022 00:11 IST

అదొక చిట్టడవి. ఆ అడవిలో ఒక పిల్లకోతి తన తోటి స్నేహితులతో కలసి ఆటలు ఆడుతోంది. అందులో భాగంగానే ఒక చెట్టుపై నుంచి మరో చెట్టు పైకి దూకుతూ చాలా దూరం వెళ్లింది. తన స్నేహితులెవ్వరూ కనిపించలేదు. అడవికి దగ్గర్లోని ఒక ఊరు వచ్చానని గ్రహించింది. చుట్టూ చూసింది. తాను ఉన్న కొబ్బరి చెట్టు పరిసరాల్లో ఒక ఇంటిని గమనించింది. ఆ ఇంటి ముందు పచ్చని కొబ్బరాకులతో ఒక అందమైన పందిరి ఉండడం చూసింది. ఆ పందిట్లో ఒక పసిపిల్లాడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుంది అమ్మ. పక్కనే ఉన్న ఆ పిల్లాడి తండ్రి పళ్లెంలో ఉన్న బియ్యంలో ‘రాము’ అని రాశాడు.
వెంటనే పందిట్లో ఉన్న బంధువులందరూ ఆ పిల్లాడిని ‘రాము.. రాము..’ అని పిలిచారు. బాబు స్పందిస్తూ బోసినవ్వులు చిందించాడు. రాము అన్న ఆరేళ్ల రాజు కూడా తమ్ముడిని ఎత్తుకుంటూ.. ‘నాన్నా! తమ్ముడి పేరు ఎంత బావుందో! వాడి పేరు రాము, నా పేరు రాజు. భలేగా ఉన్నాయి కదా!’ అంటూ బాబును ముద్దాడాడు. ‘తమ్ముడి పేరు నచ్చిందా?’ అంటూ నాన్న రాజును తన దగ్గరకు తీసుకున్నాడు.
పందిట్లో ఉన్న బంధువులు పసిబిడ్డ రామూపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అక్కడంతా సందడి, సందడిగా ఉండటం పిల్లకోతికి బాగా నచ్చింది. చెట్టుపైనే ఉంటూ అంతా గమనించసాగింది. తననెవ్వరూ చూడకుండా, తాను అందరినీ గమనించేలా కొబ్బరి చెట్టుమీద జాగ్రత్తగా కూర్చుంది. కొంత సేపటికి ఇంటికి వచ్చిన బంధువులంతా వారి, వారి ఊళ్లకు బయలుదేరి వెళ్లిపోవడంతో పందిరి అంతా ఖాళీ అయిపోయింది. అంతా గమనించిన పిల్లకోతికి ఈ వేడుక ఎంతగానో నచ్చింది. అప్పుడే తన మనసులో ఇలా అనుకుంది.
‘‘అవునూ! ఆ పసిబిడ్డకు చక్కగా, ముచ్చటగా ‘రాము’ అని పేరు పెట్టారు కదా! మరి మా అమ్మ నాకెందుకు పేరు పెట్టలేదు. అమ్మకు తెలియదా?.. లేక పేరు పెట్టడం రాదా? అమ్మ ఎప్పుడూ ఇంతే! ఉదయం నిద్ర లేస్తే చాలు. నాకెన్నో జాగ్రత్తలు చెప్పేస్తుంది. అల్లరి పనులు చేయవద్దంటుంది. స్నేహితులను ఏడిపించకూడదంటుంది. నా కన్నా పెద్దవాళ్లను గౌరవించమంటుంది. చిన్నవాళ్లతో నవ్వుతూ ఉండమంటుంది. నాకు ఇన్ని నియమాలు పాటించాలని చెప్పిన అమ్మ, తన నియామాన్ని ఎందుకు పాటించలేదు? నాకు పేరు పెడితే ఎంత బావుంటుందో కదా? తెలిసో, తెలియకో నేను ఎప్పుడైనా తప్పు చేస్తే అమ్మ నన్ను మందలిస్తుంది. అలా చేయకూడదని బుద్ధిగా నడుచుకోమంటుంది. ఇప్పుడు అమ్మ నాకు పేరు పెట్టలేదు కనుక తప్పు చేసినట్టే. అమ్మ నా కంటే పెద్దదైనా తప్పు తప్పే కదా. అమ్మ దగ్గరకు వెళ్లి కోపం ప్రదర్శిస్తాను. అమ్మ పెట్టిన ఆహారం తినను. అమ్మ బుజ్జగించినా ఊరుకోను. అమ్మతో నీ జట్టు లేనని సైగ చేస్తాను. అప్పుడు అమ్మ నన్ను బాగా బుజ్జగిస్తుంది. నా కోరిక తెలుసుకుంటుంది. పేరు పెడుతుంది. అప్పుడు నా కోరిక నెరవేరుతుంది’’ ఇలా తాను చేయాల్సిన పనులన్నింటినీ మనసులో మననం చేసుకుంది పిల్లకోతి.
అప్పుడే ఆ ఇంటికి వచ్చిన బంధువులంతా రామూ.. చేతిలో కానుకలు పెట్టి, వారి వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు పందిట్లో రాజు, అతని అమ్మానాన్నలు, తమ్ముడు రాము తప్ప ఎవ్వరూ లేరు. రాము అమ్మ ఒడిలో నిద్ర పోతున్నాడు. రాజు పందిట్లో తన నాన్న దగ్గర కూర్చున్నాడు. అంతలోనే రాజు చెట్టుపైనున్న పిల్ల కోతిని గమనించి, ‘నాన్నా! కోతి’ అన్నాడు.
‘అయ్యో! నన్ను చూసేశారు’ అనుకుంటూ ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలని పిల్ల కోతి అనుకుంది. ఇంతలో రాజు తన తండ్రితో... ‘నాన్నా! నాకు రాజు అని, తమ్ముడికి రాము అని పేర్లు పెట్టారు కదా! మరి ఈ చెట్టు పైనున్న పిల్లకోతికి కూడా తన తల్లి కోతి ఏదో ఒక పేరు పెట్టే ఉంటుందా?’ అని పిల్లకోతి వైపు విచిత్రంగా చూస్తూ అడిగాడు.
‘భలేగా అడిగావు. నా మనసులో ఉన్న సందేహమే నీకూ కలిగింది’ అనుకుంటూ, ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏమని చెబుతారోనని ఆసక్తిగా గమనించసాగింది పిల్లకోతి. అప్పుడు రాజు వాళ్ల నాన్న చిన్నగా నవ్వుతూ ఇలా చెప్పసాగాడు. ‘రాజూ.. మనం ఒకరినొకరు పిలుచుకోవడానికి, మాట్లాడుకోవడానికి వీలుగా పేర్లు పెట్టుకుంటాం. కానీ కోతి, పిల్లి, కుక్క వంటి జంతువులన్నీ మూగ జీవులు కదా! ఒకవేళ పేర్లు పెట్టుకున్నా పిలుచుకోలేవు కదా! కాబట్టి పేరుతో వాటికి పనుండదు. అదే ఆ మూగ జీవులను పెంచుకునేటప్పుడు మనం ముద్దుగా పప్పీ, టామీ అని పేర్లు పెట్టుకుని పిలుస్తాం. ఇప్పుడు తెలిసిందా? అవి ఎందుకు పేర్లు పెట్టుకోవో?..’ రాజు తల నిమురుతూ చెప్పాడు నాన్న.
చెట్టుపై ఉండి అంతా విన్న పిల్లకోతికి అమ్మ తనకు పేరెందుకు పెట్టలేదో అర్థమైంది. ‘అమ్మా! నిన్ను అనవసరంగా తిట్టుకున్నాను. పిల్లల క్షేమం కోరుకునే అమ్మ ఎప్పుడూ మంచిదే... గొప్పదే. ఇంకెప్పుడూ నిన్ను తిట్టను!’ అనుకుంటూ.. ఇప్పుడే అమ్మను చూడాలి అనుకుని బయలుదేరబోయింది. రాజు, అతని నాన్నను చూసి... ఈ రోజు మీ ద్వారా నాకొక మంచి విషయం తెలిసిందనుకుంటూ మనసులోనే వారికి కృతజ్ఞతలు చెప్పి, సంతృప్తిగా అక్కడ్నుంచి కదిలింది పిల్ల కోతి.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని