కొత్తగా రెక్కలొచ్చెనే...!

మహారాణికి పక్షులంటే చాలా ప్రేమ. రాజమందిరంలోని ఒక గదిలో రకరకాల పక్షులను పెంచేది. వాటికి అవసరమైన నీరు, ఆహారం అందించేది. ఆలనాపాలనా తనే స్వయంగా చూసుకునేది. ప్రతి పక్షికీ ఒక పేరు పెట్టి.. ఆ పేరుతోనే వాటిని పిలిచేది. వాటిని గుర్తుపట్టేది. గంటలకొద్దీ వాటితో ముచ్చటించేది. ఒకరోజు రాణి.. దైవ దర్శనం కోసం రాజుతో కలిసి కొండ మీద ఉన్న గుడికి వెళ్లింది.

Published : 25 May 2022 00:04 IST

మహారాణికి పక్షులంటే చాలా ప్రేమ. రాజమందిరంలోని ఒక గదిలో రకరకాల పక్షులను పెంచేది. వాటికి అవసరమైన నీరు, ఆహారం అందించేది. ఆలనాపాలనా తనే స్వయంగా చూసుకునేది.

ప్రతి పక్షికీ ఒక పేరు పెట్టి.. ఆ పేరుతోనే వాటిని పిలిచేది. వాటిని గుర్తుపట్టేది. గంటలకొద్దీ వాటితో ముచ్చటించేది. ఒకరోజు రాణి.. దైవ దర్శనం కోసం రాజుతో కలిసి కొండ మీద ఉన్న గుడికి వెళ్లింది. దర్శనం చేసుకున్నాక ప్రశాంతంగా కూర్చుని అక్కడ ఉన్న చెట్లను చూడసాగింది. ఆ చెట్లపై రకరకాల పక్షులు ఉన్నాయి.

తన దగ్గర ఉన్న కొన్ని గింజలను నేలపైన చల్లింది రాణి. కొన్ని పక్షులు ఎగురుకుంటూ వచ్చి తింటున్నాయి. వాటిని పరిశీలించి చూసినప్పుడు అవి చాలా చురుకుగా కనిపించాయి. చక్కటి జీవకళ వాటిలో ఉట్టి పడుతోంది.

తన పక్కనే ఉన్న రాజుతో.. మన రాజమందిరంలోని పక్షులు వీటంత ఉత్సాహంగా లేవని చెప్పింది. కారణం ఏమై ఉంటుందని అడిగింది. ‘ఈ పక్షులు ప్రకృతికి దగ్గగా ఉంటూ స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. మన మందిరంలోనివి మాత్రం బందీలుగా ఉన్నాయి. అందువల్లే ఈ తేడా’ అని చెప్పాడు.

ఎలాగైనా మందిరంలోని పక్షుల్లో జీవకళ తెప్పించాలని రాణి ఒకటికి రెండుసార్లు రాజును ప్రాధేయపడింది. పక్షులను అప్పుడప్పుడు సహజమైన వాతావరణంలో వదిలితే ఫలితం ఉండొచ్చని రాజు భావించాడు.

భటుల సాయంతో ప్రతి పౌర్ణమినాడు పక్షులను కొండల దగ్గరకు తీసుకువెళ్లి గాల్లోకి వదలడం ప్రారంభించారు. అవి కాసేపు స్వేచ్ఛగా విహరించి వెనక్కు వచ్చేవి. పక్షులన్నీ వెనక్కి వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి వాటి కాళ్లకు చిన్న తోలు చీటీ కట్టి, దానిపైన వాటిపేరు రాసి ఎగరవేయమని రాజు సలహా ఇచ్చాడు.

అన్ని పక్షులూ కాసేపు విహరించి తిరిగి వెనక్కి వచ్చేవి. లెక్క చూస్తే సరిపోయేవి. ఏ ఒక్క పక్షీ దారి తప్పలేదు, తప్పించుకోలేదు. ఈ గగనవిహారం ప్రారంభించినప్పటి నుంచీ అవి ఎంతో ఉత్సాహంగా ఉండటం చూసి రాణి చాలా సంతోషపడింది.

కొద్ది రోజుల తర్వాత రాజు అక్కడికి వచ్చి చూశాడు. పక్షి కాళ్లకు పేరు ఉన్న తోలు చీటీలు లేకపోవడం గుర్తించాడు. ‘ఎందుకు పేర్ల చీటీలు కట్టడం లేదు’ అని అడిగాడు.

అందుకు రాణి.. ‘మొదట్లో కట్టేవాళ్లం. పక్షులన్నీ పద్ధతిగా వెళ్లి, చక్కగా వెనక్కి వస్తున్నాయి. ఏ ఒక్కటీ ఇంతవరకూ తప్పిపోలేదు. అందుకని కట్టడం మానుకున్నాం’ అని బదులిచ్చింది.

‘ఇలా చేస్తే కొన్ని పక్షులు మన నుంచి తప్పించుకు వెళ్లిపోతే!’ అని అడిగాడు.

‘అవి మనుషులు కాదు... మహారాజా.. పక్షులు. మోసం చేయడం అవి ఇంకా నేర్చుకోలేదు. అంతేకాకుండా అవి ఎక్కడెక్కడో తిరిగి కొత్త మిత్రులను కూడా తీసుకువస్తున్నాయి. దాని వల్ల మన పెంపుడు పక్షుల సంఖ్య కూడా పెరిగింది’ అని నవ్వుతూ చెప్పింది.

ఒకసారి పరీక్షించి చూద్దామని రాజు రెండు పక్షులను తీసుకుని కొండవైపుగా గాల్లోకి వదిలాడు. అవి కొద్దిసేపు ఆకాశంలో ఆనందంగా ఎగిరి, తిరిగి భుజాలపై వచ్చి వాలడంతో... రాజు ఎంతో సంతోషించాడు. అప్పటి నుంచి వారానికోసారి వాటికి గగన విహారం ఏర్పాటు చేశాడు. దీంతో పక్షుల్లో జీవకళ కొట్టొచ్చినట్లు కనిపించేది.

- ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని