కప్ప తెలివి.. కాకి సాయం!

అడవిలోని ఓ చిన్న కొలనులో చేపలు, కప్పలు కలిసి ఆనందంగా నివసిస్తున్నాయి. అందులోని చేపల్ని తినడానికి దీర్ఘనాసికం అనే కొంగ తీవ్రంగా ప్రయత్నం చేసేది. కానీ ఒక్క చేపా దొరికేది కాదు. ఎందుకంటే

Published : 06 Jun 2022 00:13 IST

అడవిలోని ఓ చిన్న కొలనులో చేపలు, కప్పలు కలిసి ఆనందంగా నివసిస్తున్నాయి. అందులోని చేపల్ని తినడానికి దీర్ఘనాసికం అనే కొంగ తీవ్రంగా ప్రయత్నం చేసేది. కానీ ఒక్క చేపా దొరికేది కాదు. ఎందుకంటే కొంగ కుటిల ప్రయత్నాన్ని సుజ్ఞాని అనే కప్ప ఎప్పటికప్పుడు చేపలకు తెలియజేసేది.

ఓరోజు ఎప్పటిలాగే కనీసం ఈసారైనా ఒక్క చేపైనా దొరకకపోతుందా... అనే ఆశతో కొలనులో ఒంటికాలిపై నిలబడి కళ్లు మూసుకుంది దీర్ఘనాసికం. సుజ్ఞాని ఈ దృశ్యాన్ని చూడనే చూసింది. ‘చేపల్లారా.. జాగ్రత్త! మిమ్మల్ని మోసం చేసి తినాలనే కోరికతో ఆ కొంగ దొంగ జపం చేస్తోంది. మీరెవరూ అటువైపు వెళ్లకండి’ అంటూ హెచ్చరించింది.

కంగారుపడ్డ చేపలు భయంతో నీటి అడుగుకు చేరుకున్నాయి. కొంగకు నిరాశే ఎదురైంది. తనకు ఆహారం దక్కకుండా చేస్తున్న కప్పపై కోపం పెంచుకుంది దీర్ఘనాసికం. ఎలాగైనా కొలనులోని మొత్తం చేపల్ని చంపేసే కుట్ర పన్నింది. ఈ కొలనుకు కొద్ది దూరంలోనే ఉన్న మొసళ్ల మడుగుకు ఎగురుకుంటూ వెళ్లిపోయింది.

ఆ మడుగులో చాలా మొసళ్లు నివసిస్తున్నాయి. మడుగు దగ్గరకు వెళ్లి ‘మిత్రులారా.. జాగ్రత్తగా వినండి. ఆహారం దొరకక మీరందరూ ఇబ్బందులు పడుతున్నారని తెలిసి నాకు బాధ కలిగింది. ఇక్కడికి దగ్గర్లో ఓ కొలను ఉంది. అందులో బోలెడు చేపలు, కప్పలు ఉన్నాయి. అక్కడికి మీరు వెళ్లారంటే చాలారోజులకు సరిపడా మీకు విందు భోజనం దొరుకుతుంది. నన్ను అనుసరిస్తే మీకు ఆ కొలను చూపిస్తాను’ అని మొసళ్లతో కొంగ అంది.

ఈ మాటలు విన్న మొసళ్లన్నీ తలలు పైకెత్తి... ‘మేము సిద్ధం’ అని సంతోషంగా అన్నాయి. ‘అయితే నన్ను అనుసరించండి’ అంటూ దీర్ఘనాసికం ఎగురుకుంటూ దారి చూపిస్తూ ఉంటే మొసళ్లు నేలపై మెల్లిగా నడవడం మొదలుపెట్టాయి. ఈ ఘటన అంతా చూసిన ఓ కాకి జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టింది.

రివ్వున ఎగిరి కొలను దగ్గరకు చేరింది. రాబోయే ఉపద్రవం గురించి కొలనులోని చేపలు, కప్పలకు వివరించింది. సుజ్ఞాని వెంటనే ఓ ఉపాయం ఆలోచించి కాకికి ఏం చేయాలో చెప్పింది. అందుకు కాకి సరే అంది. సుజ్ఞాని.. చేపలు, తోటి కప్పలను ఉద్దేశించి... ‘మిత్రులారా.. మనకు ఎక్కువ సమయం లేదు. ఆపద ముంచుకొస్తోంది. మీరందరూ చనిపోయినట్లుగా నటించండి’ అంది. వెనువెంటనే అక్కడి చేపలు, కప్పలు అన్నీ గుడ్లు తేలేసి నీటి పైన తేలుతున్నట్టుగా నటించడం మొదలుపెట్టాయి.
ఇంతలోనే మొసళ్లన్నీ కొలను దగ్గరకు చేరుకున్నాయి. అక్కడి దృశ్యాన్ని చూసి కంగారు పడ్డాయి. అక్కడే ఉన్న కాకి, మొసళ్లను ఉద్దేశించి ఇలా అంది. ‘మొసళ్లారా... ఈ కొలనులో ఎవరో విషం కలిపారు. అందువల్ల ఇక్కడ నివసించే చేపలు, కప్పలు అన్నీ చనిపోయాయి. వీటిని తింటే మీరూ చనిపోవడం ఖాయం. మిమ్మల్ని చంపాలని కుట్ర పన్ని ఆ పాడు కొంగ మీకు ఇలాంటి సలహా ఇచ్చింది. మీ మంచి కోసమే చెబుతున్నా.. ఆ పైన మీ ఇష్టం..’ అక్కడి దృశ్యాన్ని చూసిన తర్వాత కాకి మాటలు నిజమే అనిపించాయి మొసళ్లకు.

కొంగపై పట్టరాని కోపం కలిగింది మొసళ్లకు. ‘ఏయ్‌ కొంగా... హాయిగా బతుకుతున్న మమ్మల్ని కుట్ర పన్ని చంపాలని చూస్తావా? మాకు నువ్వు ఎక్కడో, ఎప్పుడో దొరక్కపోవు. అప్పుడు నిన్ను కరకరా నమిలి తినేస్తాం...!’ అంటూ కాకికి కృతజ్ఞతలు చెప్పి మడుగు దగ్గరకు వెళ్లిపోయాయి.

ఏం జరిగిందో మొదట కొంగకు అర్థం కాలేదు. అయోమయానికి గురైన దీర్ఘనాసికం.. ‘బాబోయ్‌.. మరోసారి ఈ ప్రాంతం వైపు రాకూడదు’ అనుకుంటూ వెళ్లిపోయింది. మొసళ్లు, కొంగ వెళ్లిపోగానే... ‘మిత్రులారా లేవండి. మన ఉపాయం ఫలించింది’ అంటూ కాకి అరిచింది. వెంటనే చేపలూ, కప్పలూ మామూలు స్థితికి వచ్చాయి. గండం గడిచినందుకు సంతోషించాయి. సుజ్ఞాని తెలివి అమోఘమని చేపలు, కప్పలు ప్రశంసించాయి. ‘ఉపాయం నాదైనా, ఫలవంతం చేసింది మాత్రం కాకే. ఆ కపటి అయిన కొంగ కుట్రను మనకు చెప్పకపోతే ఈ పాటికి మనం ఆ మొసళ్లకు ఆహారం అయ్యేవాళ్లం’ అంది సుజ్ఞాని.

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని