చెట్టు.. మన చుట్టం!

‘అంత ఎత్తులో ఉన్న మేడ మీద చెట్టు ఎలా నాటారమ్మా?’ ఎదురుగా ఉన్న పాత భవనం గోడ పగుళ్లలోంచి బయటకు వచ్చిన చెట్టును చూపిస్తూ తల్లిని అడిగాడు కిరణ్‌. ‘చెట్టును కాదు మొక్కలను మాత్రమే నాటుతారు. అయినా, అది ఎవరూ నాటింది కాదు. దానంతట అదే మొలిచింది’ చెప్పింది తల్లి. ‘అయితే, విత్తనాలు వెయ్యకుండా కూడా మొక్కలు మొలుస్తాయా?’ అనుమానంగా అడిగాడు కిరణ్‌. ‘విత్తనం లేకుండా మొక్కలు మొలవవని నీకు తెలుసు కదా?’ ప్రశ్న రూపంలోనే జవాబిచ్చింది తల్లి....

Published : 07 Jun 2022 00:31 IST

‘అంత ఎత్తులో ఉన్న మేడ మీద చెట్టు ఎలా నాటారమ్మా?’ ఎదురుగా ఉన్న పాత భవనం గోడ పగుళ్లలోంచి బయటకు వచ్చిన చెట్టును చూపిస్తూ తల్లిని అడిగాడు కిరణ్‌. ‘చెట్టును కాదు మొక్కలను మాత్రమే నాటుతారు. అయినా, అది ఎవరూ నాటింది కాదు. దానంతట అదే మొలిచింది’ చెప్పింది తల్లి. ‘అయితే, విత్తనాలు వెయ్యకుండా కూడా మొక్కలు మొలుస్తాయా?’ అనుమానంగా అడిగాడు కిరణ్‌. ‘విత్తనం లేకుండా మొక్కలు మొలవవని నీకు తెలుసు కదా?’ ప్రశ్న రూపంలోనే జవాబిచ్చింది తల్లి. ‘అయితే, విత్తనాలు వాటంతట అవే ఎలా పడతాయి?’ మళ్లీ అడిగాడు కొడుకు. ‘బీజ వ్యాప్తి ద్వారా..’ టీచర్‌లా సమాధానమిచ్చింది తల్లి.

ఆ పదం ఎప్పుడూ వినకపోవడంతో ‘అంటే ఏంటి?’ ఆశ్చర్యంతో ప్రశ్నించాడు కిరణ్‌. ‘బీజం అంటే విత్తనం. వ్యాప్తి అంటే వ్యాపించడం. అంటే విత్తనాలు అనేక విధాలుగా వివిధ ప్రదేశాల్లో పడి మొక్కలు మొలుస్తాయి. తర్వాత అవే చెట్లుగా పెరుగుతాయి’ అంది తల్లి. ‘విత్తనాలు వాటంతట అవే ఎలా వ్యాప్తి చెందుతాయి?’ అని కిరణ్‌ అడగడంతో.. ‘గాలిలో ఎగిరి వచ్చి కొన్ని, నీటిలో కొట్టుకొచ్చి మరికొన్ని, పశువులూ పక్షుల ద్వారా ఇంకొన్ని విత్తనాలు వ్యాప్తి చెందుతాయి’ చెప్పిందామె. ‘వివరంగా చెప్పమ్మా!’ అడిగాడు కొడుకు. ‘జంతువులు, పక్షులు పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. గింజలతో పాటుగా తినడం వల్ల అవి జీర్ణం కావు. మలవిసర్జన సమయంలో ఆ గింజలు బయట పడి, ఆ ప్రదేశంలో అనువైన పరిస్థితులు ఉంటే మొలకెత్తుతాయి. అలా మొలిచిందే ఆ భవనంపైన చెట్టు కూడా’ వివరించింది తల్లి.

‘ఆ మేడ గోడలు దాదాపు పగిలిపోయాయి. చెట్టు వేళ్లు కూడా బయటికి వచ్చేశాయి. ఇలా అయితే ఆ భవనానికే ప్రమాదం అని తెలిసినా ఇంకా ఎందుకు అలాగే పెరగనిస్తున్నారు?’ అడిగాడు కిరణ్‌. ‘ఆ ఇంట్లో ఎవరూ నివసించడం లేదు. ఏదైనా వస్తువు గానీ ఇల్లు గానీ వినియోగంలో లేకపోతే అలాగే పాడైపోతాయి. అందుకే ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలానే, మనలోని నెగటివ్‌ ఆలోచనలనూ బయటకు పంపించేస్తుండాలి’ చెప్పింది తల్లి. మరి ‘గాలి ద్వారా ఎలా వ్యాపిస్తాయి విత్తనాలు?’ సందేహం వెలిబుచ్చాడు కొడుకు. ‘జిల్లేడులాంటి కాయల విత్తనాల్లో సన్నని నూగు ఉంటుంది. కాయ పగలగానే అందులోని విత్తనాలు గాలికి చెదిరి.. ఏదో ఒక ప్రదేశంలో పడతాయి. అక్కడి మట్టిలోని తేమను గ్రహించి మొలుస్తాయి’ అంది తల్లి. ‘నీటి ద్వారా ఎలా?’ మళ్లీ ప్రశ్నించాడు కిరణ్‌. కొబ్బరిలాంటి కొన్ని రకాలైన విత్తనాలు నీటిలో పడి, ఆ ప్రవాహంతోపాటు ఏదో ఒక చోట ఒడ్డుకు చేరి మొలకెత్తుతాయంది తల్లి. ‘అదీ సంగతి. ఇన్నాళ్లూ ఎవరూ నాటకపోయినా, చెట్లూ అడవులూ ఎలా పెరుగుతున్నాయా అనే సందేహం ఉండేది. ఇప్పుడది తీరిపోయింది’ అని కొడుకు అనడంతో.. ‘సందేహాలు వస్తే మనసులోనే దాచుకోకుండా వెంటనే టీచర్‌నో, పెద్దవాళ్లనో అడిగి నివృత్తి చేసుకోవాలి’ అని చెప్పింది తల్లి.

‘అయితే... నాకు కొన్ని సందేహాలున్నాయి. వాటిని అడిగితే చిరాకు పడవు కదా?’ అని కిరణ్‌ అడగ్గా.. ‘చిరాకు ఎందుకు.. అడుగు’ అనుమతిచ్చింది తల్లి. ‘మొక్కలు, చెట్లలో కొన్ని మాత్రమే మనకు ఉపయోగపడుతున్నాయి. అవి తప్ప మిగిలినవి అవసరం లేదు కదా?’ అడిగాడు కొడుకు. ‘మనకు తెలిసి నేరుగా ప్రజలకు ఉపయోగపడేవి కొన్ని మాత్రమే. అవి కాకుండా ఇతర చెట్లూ మొక్కల వేర్లూ, కొమ్మలూ, పూలూ, మొగ్గలూ, బెరడులను మందులు, రసాయనాల తయారీలో ముడిపదార్థాలుగా వాడుతుంటారు. పచ్చదనం ఎంత ఎక్కువగా ఉంటే.. ప్రకృతి సమతుల్యత అంత బాగుంటుంది. అతివృష్టి, అనావృష్టికి తావు ఉండదు’ ఓపిగ్గా వివరించింది తల్లి. ‘అంతటి ఉపయోగం ఉన్న చెట్లను ఇళ్లలోనే పెంచవచ్చు కదా?’ అడిగాడు కిరణ్‌. ‘అవి చాలా పెద్దగా పెరుగుతాయి. వాటికి తగిన వాతావరణం కూడా అవసరం. కొన్ని చెట్ల మీద విష ప్రాణులు, చిన్న చిన్న జంతువులు నివసిస్తాయి. అందువల్ల అన్నింటినీ పెరట్లో పెంచడం వీలుకాదు. కొండలు, ఎత్తైన ప్రదేశాల్లో హెలికాప్టర్ల ద్వారా విత్తనాలు వెదజల్లుతారు. వాటన్నింటినీ చేయడంతోపాటు అటవీ సంపదను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది’ అని వివరించింది తల్లి. ‘చెట్ల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా మొక్కలు నాటి సంరక్షిస్తానమ్మా’ అని అనడంతో.. కిరణ్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది తల్లి.  

- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని