కథ మంచికి!

అనగనగా ఒక అవ్వ. ఆమెకు ఒక మనవడు. అతడి పేరు సోము. సోముకు కథలంటే ఇష్టం. ఎంత ఇష్టమంటే అంతా ఇంతా.. అని చెప్పలేం. రోజూ అవ్వతో కథలు చెప్పించుకునేవాడు. అవ్వ చెప్పే కథలు

Updated : 08 Jun 2022 07:06 IST

అనగనగా ఒక అవ్వ. ఆమెకు ఒక మనవడు. అతడి పేరు సోము. సోముకు కథలంటే ఇష్టం. ఎంత ఇష్టమంటే అంతా ఇంతా.. అని చెప్పలేం. రోజూ అవ్వతో కథలు చెప్పించుకునేవాడు. అవ్వ చెప్పే కథలు చాలక, ఊళ్లో వారినీ చెప్పమని వెంటపడేవాడు. కొందరు కథల పిచ్చోడని విసుక్కుంటూ చెప్పేవారు. ఇంకొందరు ఆ బాలుడి ముచ్చట చూసి.. తమకు తెలిసిన కథలు చెప్పేవారు.

మనవడిని వీధిబడిలో వేసినప్పుడు అవ్వ ఆ గురువుతో.. ‘వీడికి కథల పిచ్చి ఎక్కువ. ఆ పిచ్చి వల్ల చదువులో వెనకబడతాడని నా భయం. వీడిని నీట ముంచుతారో పాల ముంచుతారో మీదే భారం!’ అని మనవడిని అప్పజెప్పింది. గురువు గారు సోమును ప్రేమతో దగ్గరకు తీసుకుని ‘అవ్వా! పిల్లలు కథలు వినడం, చెప్పడం అది వాళ్ల చురుకుదనానికి నిదర్శనం. గొప్ప ఆలోచనాపరులు కాగలరనడానికి అది ఒక గుర్తు. నీ మనవడు తప్పకుండా గొప్పవాడవుతాడు.. భయపడకు’ అని భరోసా ఇచ్చాడు.
అవ్వ అటు వెళ్లగానే గురువుగారితో సోము.. ‘మీరు కథలు చెబితేనే రోజూ బడికి వస్తా’ అని షరతు పెట్టాడు. మనవడిని అప్పజెప్పినప్పుడు కథల పిచ్చి అని అవ్వ ఎందుకందో అప్పుడర్థమైంది. చిరునవ్వు నవ్వుతూ ‘అలాగే నాయనా’ అని.. గురువుగారు ఒక కథ చెప్పి పలక మీద అక్షరాలు రాసి సోమును దిద్దమన్నాడు.

కాసేపు దిద్దాక ‘మీరు చెప్పినట్టు అక్షరాలు దిద్దాను. మరో కథ చెప్పండి’ అని సోము గురువును అడిగాడు. ఆయన ‘కాకి-నీళ్ల కడవ’ కథ చెప్పడం ప్రారంభించాడు. తనకు ఆ కథ ముందే తెలుసన్నాడు సోము. ఎన్ని కథలు చెప్పినా అది తనకు తెలుసనేవాడు.
కాస్త విసుగు చెందిన గురువు గారు ఒకరోజు.. ‘సోమూ.. నువ్వు ఇంకా ఎక్కువ కథలు తెలుసుకోవాలంటే ఉపాయం చెబుతాను. అది పాటిస్తే వీళ్లను, వాళ్లను కథలడిగే బాధ నీకు తప్పుతుంది!’ అని శిష్యుడితో అన్నాడు. ఆ ఉపాయమేదో చెప్పండని కోరాడు సోము. అప్పుడు ఆ గురువు గారు... అక్షరాలు, గుణింతాలు నేర్చుకో. అవి నేర్చుకుంటే సొంతంగా కథల పుస్తకాలు బోలెడు చదవగలవు!’ అని ఉపాయం చెప్పాడు.

అంతే, సోములో పట్టుదల పెరిగింది. ఆరు మాసాల్లో చదవడం, రాయడం నేర్చుకున్నాడు. గురువు గారిచ్చిన చిన్న చిన్న కథల పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. కథలను అవగాహన చేసుకొనే సోముకు పాఠ్యాంశాల అవగాహన సులువైంది. ఒక్కో తరగతి దాటుతుంటే అతడిలో జ్ఞాపకశక్తి, అవగాహన శక్తి, ఆలోచనా శక్తి ఒక దానితో మరోటి పోటీ పడి రాణించాడు. ఏ విషయం మీదైనా చక్కగా మాట్లాడే చాతుర్యం కలిగింది. ఉపమానాలు, జాతీయాలతో భావ ప్రకటన అద్భుతంగా చేసే నైపుణ్యం అబ్బింది. ఇక పరీక్షల్లో అయితే చక్కని భాషలో సమాధానాలు రాయగలిగే వాడు. రకరకాల కథలు చదవడం వల్ల మంచీచెడూ తెలుసుకుని మిగతా పిల్లలకు ఆదర్శంగా నిలబడగలిగాడు.

కొంతకాలానికి సోము వీధి బడి చదువు పూర్తయింది. ఇంకా చదవాలని ఉందని అవ్వకు చెప్పాడు. ఊళ్లో చదువు చాలులే అని అవ్వ అనేసింది. ఏడ్చుకుంటూ గురువుగారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. ఆయన వచ్చి అవ్వకు నచ్చచెప్పాడు. అవ్వ అంగీకరించింది. మనవడు ఎగిరి గంతేశాడు. పట్నంలోని జమీందారు నెలకొల్పిన గురుకులంలో చేరాడు. అక్కడున్న గ్రంథాలయం చూసి అతడి కడుపు నిండిపోయింది. ఆకలుండదు, దాహముండదన్నట్లు.. వీలు చిక్కినప్పుడల్లా గ్రంథాలయంలో గడపడానికి ఇష్టపడేవాడు. అలాగని ఆటపాటలనూ అశ్రద్ధ చెయ్యలేదు. తరగతి పుస్తకాలతో పాటు ఇతర గ్రంథాలూ చదవడం వల్ల అతడి జ్ఞానం వికసించసాగింది.

గురుకులంలో సోము చదువు పూర్తి కావచ్చింది. సంవత్సరాంతంలో ప్రధానాచార్యుడు విద్యార్థుల మధ్య అనేక రకాల పోటీలు నిర్వహించాడు. విజేతలకు బహుమతులందజేయడానికి ముఖ్య అతిథిగా జమీందారు వచ్చాడు. సోము ఎక్కువ బహుమతులు పొందడం గమనించి ఆయన ఆరా తీశాడు. సోముతో స్వయంగా మాట్లాడాడు. కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. బాలుడి తెలివితేటలను పరీక్షించి ముగ్ధుడయ్యాడు. ఆ తెలివితేటలు వృథా కారాదనుకుని ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి అతడిని విదేశాలకు పంపడానికి ఏర్పాట్లు చేశాడు.

అవ్వ ఆ విషయం విని ఎంతో ఆనందించింది. మనవడిని ముద్దాడి ‘కథల పిచ్చిలో నువ్వేమైపోతావేమో అని భయపడ్డాను. గురువుగారు నువ్వు బాగుపడతావని అప్పుడే చెప్పాడు. ఆ కథలు నిన్ను ఇలా తీర్చిదిద్దినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. పెద్ద చదువు చదివి నువ్వు ప్రయోజకుడివి కావాలి’ అని ఆశీర్వదించింది. కాలగమనంలో సోము కలెక్టరయ్యాడు. వీధి బడి గురువుగారిని కలిసి, కృతజ్ఞతలు తెలిపాడు. అధికారిక హోదాలో అతడు ఏ పాఠశాలకు వెళ్లినా... ‘చదువుతో పాటు కథలు వినండి, చదవండి. మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా అవి హెచ్చరిస్తాయి’ అని పిల్లలకు సందేశమిచ్చేవాడు.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని