చెబితే వినాలి..!

నిర్మల తటాకం అనే చెరువులో ఉభయమిత్ర అనే కప్ప నివసించేది. పేరుకు తగ్గట్టుగానే నీళ్లలో ఉన్నంతసేపు చెరువులోని జలచరాలైన చేపలు, తాబేళ్లు, తోటి కప్పలతోనూ ఎంతో స్నేహంగా మెలిగేది. అలాగే ఆ

Published : 09 Jun 2022 00:12 IST

నిర్మల తటాకం అనే చెరువులో ఉభయమిత్ర అనే కప్ప నివసించేది. పేరుకు తగ్గట్టుగానే నీళ్లలో ఉన్నంతసేపు చెరువులోని జలచరాలైన చేపలు, తాబేళ్లు, తోటి కప్పలతోనూ ఎంతో స్నేహంగా మెలిగేది. అలాగే ఆ చెరువును ఆనుకుని వరి చేలు ఉండేవి.
ఆ వరి ధాన్యపు కంకులు తినడానికి పిచ్చుకలు వచ్చేవి. ఉభయమిత్ర వాటితో పరిచయాన్ని పెంచుకుని మిత్రురాలైపోయింది. చెరువులో వయ్యారి అనే చేప, పంట చేలో సంచరించేటపుడు సుకుమారి అనే పిచ్చుక ఉభయమిత్రకు మంచి స్నేహితులయ్యాయి.

ఉభయమిత్ర సుకుమారితో మాట్లాడేటప్పుడల్లా సుకుమారికి తెలియని విషయాల గురించి చెప్పాలనే తపనతో.. చెరువులోని వింతలు, విశేషాల గురించి, అలాగే తన స్నేహితులైన చేపలు, తాబేళ్లు, తోటి కప్పల గురించి గొప్పలు చెప్పేది.

అలాగే వయ్యారితో మాట్లాడేటప్పుడల్లా తనకు తెలియని విషయాలే చెప్పాలనే ఆతృతతో, ఒడ్డున నిలబడి చూస్తుంటే ఆ పచ్చటి చేల అందం, అలాగే పిచ్చుకల కిచకిచలు, కోయిలల కుహుకుహూలు, చుట్టుపక్కల అందమైన పూల మొక్కల గురించి కథలు కథలుగా చెప్పేది.

అలా ఒకసారి సుకుమారితో చెరువు గురించి, చెరువులోని జలచరాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటూ పోతుంటే మధ్యలో సుకుమారి కల్పించుకుని ‘అవును... నువ్వు చెప్పింది నిజమే అయ్యిండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యనే ఒక ఇంటి కిటికీలో నిలబడి లోపలికి తొంగి చూస్తుంటే ఒక అద్దాల గాజు పెట్టెలోని నీటిలో రంగురంగుల చేప పిల్లలు భలే ఆడుకుంటూ కనిపించాయి. అంత చిన్న అద్దాల గాజు పెట్టెలోనే ఎంతో అందమైన రంగురంగుల చేప పిల్లలుంటే మీ పెద్ద చెరువులో ఇంకెన్ని ఉంటాయో కదా, ఒక్కసారి మీ చెరువులోకి నన్నూ తీసుకెళ్లి చూపించవూ?’ అని బతిమాలింది.

దానికి సమాధానంగా ఉభయమిత్ర... ‘వద్దు, మిత్రమా! నీకు ఈ నేలే సురక్షితమైన ప్రాంతం, నువ్వు అక్కడ ఉండలేవు’ అంది. అంతే సుకుమారి కోపంగా... ‘నువ్వు చెరువులోనూ, బయట ఉండగాలేనిది, నేనుండలేనా? నీకు నన్ను తీసుకెళ్లటం ఇష్టం లేదనుకుంటా’ అని నిష్టూరమాడింది. ‘సరే, చూద్దాంలే’ అని అప్పటికి సమాధానపరిచింది.

అదే రీతిలో చెరువులోకి వచ్చేసరికి వయ్యారి కూడా తనను బయటకు తీసుకెళ్లి చుట్టూ ఉన్న ప్రాంతాలను చూపించమని బతిమాలింది. దానికి సమాధానంగా ఉభయమిత్ర సుకుమారికి చెప్పినట్లుగానే.. ‘వద్దు, మిత్రమా.. నీకు ఈ చెరువే సురక్షితమైన ప్రాంతం, బయటకు వస్తే అక్కడ ఎంతమాత్రం ఉండలేవు’ అంది. వయ్యారికి కూడా ఆ మాటలు నచ్చలేదు. అందుకే అది ఉభయమిత్రతో ‘లేదు.. లేదు.. నీకు నన్ను తీసుకెళ్లడం ఇష్టం లేదు, అందుకే ఏదో కట్టుకథ చెబుతున్నావు. నువ్వే కనుక నిజమైన స్నేహితురాలివైతే బయటకు తీసుకెళ్లి ఆ అందాలన్నీ చూపించు లేదా ఇక్కడితో నీతో స్నేహానికి చెల్లుచీటీ’ అంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లడానికి ఒప్పుకుంది.

అలా ఉభయమిత్ర, మిత్రురాలైన వయ్యారిని తన ముందు రెండు కాళ్లలో పెట్టుకుని ఒక్కసారిగా చెరువులోంచి దుమికే సరికి అవి రెండూ ఒడ్డున వచ్చిపడ్డాయి. ఆ మరుక్షణం నుంచి వయ్యారికి ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరి అవసాగింది. ‘చుట్టూ ఉండే అందాలు చూడటం సంగతి తర్వాత, అసలు ప్రాణాలే పోయేలా ఉన్నాయి. నువ్వు చెబుతున్నా వినక మొండిగా ప్రవర్తించాను. తిరిగి చెరువులోకి దుమికే ఓపిక కూడా లేకుండా పోయింది. దయ ఉంచి వెంటనే నన్ను చెరువులోకి దించు’ అని వేడుకుంది.

వయ్యారిని చెరువులోకి వెళ్లేలా చేయడంతో ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచి వచ్చినట్లైంది. అలాగే సుకుమారికి కూడా తెలిసి రావాలని ఈసారి దాన్ని తన రెండుకాళ్ల మధ్య జాగ్రత్తగా పొదివి పట్టుకుని ఒక్కసారిగా చెరువులోకి దూకింది. సుకుమారి... ఆ నీటిలో గిలగిలా కొట్టుకుంటూ... ‘చెరువులోని అందాలు దేవుడికెరుక, ముందు నన్ను గట్టు మీద పడేయి’ అని దీనంగా వేడుకుంది. వెనువెంటనే సుకుమారిని అంతే జాగ్రత్తగా పొదివి పట్టుకుని ఒడ్డు మీదకు చేర్చింది. అక్కడితో వయ్యారి, సుకుమారికి మిత్రులు చెప్పే హితవచనాలు వినకపోతే జరిగే నష్టమేంటో అర్థమైంది.

- కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని