శిష్యుల జట్టు!

పూర్వం తపతీ నది తీరంలో సత్యానందుడు అనే గురువు ఆశ్రమం ఉండేది. అతని గురుకులంలో చదువుకున్న చాలా మంది పండితులయ్యారు. అక్కడికి కొద్దిదూరంలో ఓ ఊరిలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అల్లరి చిల్లరగా తిరుగుతూ.. అందరినీ ఆటపట్టిస్తుండేవాడు. కొడుకును ఎలాగైనా గొప్పవాడిని చేయాలని..

Published : 10 Jun 2022 00:19 IST

పూర్వం తపతీ నది తీరంలో సత్యానందుడు అనే గురువు ఆశ్రమం ఉండేది. అతని గురుకులంలో చదువుకున్న చాలా మంది పండితులయ్యారు. అక్కడికి కొద్దిదూరంలో ఓ ఊరిలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అల్లరి చిల్లరగా తిరుగుతూ.. అందరినీ ఆటపట్టిస్తుండేవాడు. కొడుకును ఎలాగైనా గొప్పవాడిని చేయాలని.. తల్లి, రాజును సత్యానందుడి ఆశ్రమంలో చేర్పించింది. అప్పటివరకూ ఆకతాయిగా తిరగడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో, కొత్తలో గురుకులంలో ఇమడలేకపోయాడు రాజు. అక్కడి నిబంధనలతో విసిగిపోయేవాడు. అతడి నిర్లక్ష్యాన్ని, అనాసక్తిని ఒకటీ రెండుసార్లు గమనించిన గురువు.. ఒకసారి పిలిపించి సున్నితంగా మందలించాడు.

దాంతో అహం దెబ్బతిన్న రాజు.. ఆశ్రమంతోపాటు గురువుపైనా ద్వేషం పెంచుకోసాగాడు. తనలాగే అక్కడ ఉండలేకపోతున్న వారి గురించి ఆరా తీయసాగాడు. అలా ముగ్గురు నలుగురిని పోగు చేశాడు. సమయం దొరికినప్పుడల్లా మిత్రుల ఎదుట గురువును దూషిస్తూ తన కసి తీర్చుకునేవాడు. ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఓ దురాలోచన చేశాడు రాజు. దాని ప్రకారం.. మిత్రులతో కలిసి గురువు గారి గుర్రపు బగ్గీ చక్రానికున్న ఇరుసును తీసివేయాలనుకున్నారు. దాంతో గురువు ఎటైనా ప్రయాణమైతే.. బగ్గీ చక్రం ఊడిపోయి గాయపడతాడని రాజు దురాలోచన. మిగతావారికి ఇష్టం లేకపోయినా.. స్నేహితుల మెప్పు కోసం అందరూ సరేనన్నారు.

మరుసటి రోజు రాత్రి అందరూ నిద్రపోయిన సమయం చూసి.. గుర్రపు బండి ఇరుసు తొలగించేందుకు తన మిత్రులతో కలిసి ఆశ్రమం పెరట్లోకి వెళ్లాడు రాజు. అడుగులో అడుగు వేసుకుంటూ.. శబ్దాలు చేయకుండా బగ్గీ వైపు వెళ్లసాగారు. ఇంతలో ఆ చీకట్లో రాజు కాలు మీద ఓ విష సర్పం కాటు వేసింది. పెద్ద కేక పెట్టి.. నేల మీద పడిపోయాడు. ఆ అరుపులకు మేల్కొన్న సత్యానందుడు.. ఆశ్రమం చుట్టూ వెతికాడు. నోట్లోంచి నురగలు కక్కుతున్న రాజును పెరట్లో నుంచి మిత్రులు హడావిడిగా తీసుకురావడాన్ని గమనించాడాయన. అనుచరులతో కలిసి హుటాహుటిన తన గుర్రపు బగ్గీలో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. సకాలంలో చికిత్స అందడంతో రాజుకు ప్రాణాపాయం తప్పింది. కాస్త ఆలస్యమైతే చాలా కష్టమయ్యేదని గురువుతో వైద్యుడు చెప్పడం రాజుకు వినిపించింది. ఆ మాటలకు రాజు లోలోపలే పశ్చాత్తాపపడ్డాడు.

కాస్త కోలుకొని ఆశ్రమానికి రాగానే.. గురువు కాళ్లమీద పడ్డాడు రాజు. జరిగిందంతా చెప్పి, తనను క్షమించాలని కోరాడు. ఏ గుర్రపు బండినైతే పాడు చేసి, గురువును ప్రమాదానికి గురి చేయాలని అనుకున్నాడో.. అదే బండి తన ప్రాణాలను కాపాడటం అతడిలో పరివర్తన తీసుకొచ్చింది. జీవితంలో ఎవరినీ దూషించననీ, అపకారం తలపెట్టననీ ఆ క్షణమే ఓ నిర్ణయానికి వచ్చాడు.

మరుసటి రోజు సత్యానందుడు శిష్యులందరినీ ఆశ్రమం వెనక వైపునకు తీసుకెళ్లాడు. అక్కడే ఒక చెట్టుకు ఉన్న తేనె పట్టుని చూపించాడు. మంచి కోసం జట్టు కడితే, అదిగో జీవితం ఆ తేనెపట్టులా హాయిగా ఉంటుంది.. అదే చెడ్డ పనుల కోసం జట్టుగా చేరితే, చెదపుట్టలా తయారవుతుంది అంటూ చెద పురుగులు తినేసిన చెక్క బల్ల వైపు చూపాడు. ‘గురువుగా నేనెప్పుడు మిమ్మల్ని మందలించినా, అది మీ మంచి కోసమే తప్ప.. మీ మీద పగతో కాదు. నా కోపం వెనక మీరంతా ప్రయోజకులు కావాలన్న ప్రేమే ఉంటుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలాంటి దురాలోచనలూ కలగవు’ అంటూ వారందరికీ అర్థమయ్యేలా వివరించాడు సత్యానందుడు. ఆ మాటలతో రాజుతో పాటు మిగతా శిష్యులకు కనువిప్పు కలిగింది. గురువు మీద ప్రేమతో పాటు మరింత గౌరవం పెరిగింది.

- గరిమెళ్ల నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని