విదేశీ అతిథులు!

పూర్వం ఒక సరస్సులోని కొంగలన్నీ చేపల వేటలో మునిగిపోయాయి. ఇంతలో సరస్సు చుట్టూ జనాల కోలాహలం మొదలైంది. ఒకేసారి అంతమంది మనుషులను చూసి భయపడిన కొంగలన్నీ.. వాటి నాయకుడు శ్వేతవర్ణుడి దగ్గరకు వెళ్లాయి. ఆందోళనగా వస్తున్న వాటిని చూసి.. ‘ఎందుకలా కంగారుగా వస్తున్నారు..

Published : 16 Jun 2022 00:55 IST

పూర్వం ఒక సరస్సులోని కొంగలన్నీ చేపల వేటలో మునిగిపోయాయి. ఇంతలో సరస్సు చుట్టూ జనాల కోలాహలం మొదలైంది. ఒకేసారి అంతమంది మనుషులను చూసి భయపడిన కొంగలన్నీ.. వాటి నాయకుడు శ్వేతవర్ణుడి దగ్గరకు వెళ్లాయి. ఆందోళనగా వస్తున్న వాటిని చూసి.. ‘ఎందుకలా కంగారుగా వస్తున్నారు.. మీ ముఖాల్లో భయం కనిపిస్తోంది.. ఏదైనా ఆపద ముంచుకొచ్చిందా?’ అని ప్రశ్నించాడు శ్వేతవర్ణుడు. ‘అవును.. సరస్సు దగ్గరకు చాలా మంది మనుషులు వచ్చారు. మనకేమైనా అపకారం తలపెడతారేమోనని భయంగా ఉంది నాయకా’ అన్నాయి.

అందుకు శ్వేతవర్ణుడు నవ్వి, ‘భయపడకండి.. ఈ మనుషుల సందడి అంతా శీతల దేశాల నుంచి వేలాది మైళ్లు ప్రయాణించీ.. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని వస్తున్న కొంగలను చూడటం కోసమే..’ అని అన్నాడు. ఆ మాటలకు కొంగలన్నీ ఆశ్చర్యపోయాయి. అందులో దీర్ఘనాసికుడు అనే కొంగ, ‘నాయకా.. మనకే ఇక్కడ ఆహారం దొరకడం కష్టంగా ఉంది. కొత్తగా వస్తున్న కొంగల వల్ల మనకు మరిన్ని అవస్థలు ఏర్పడతాయి. భవిష్యత్తులో మనం పస్తులూ ఉండాల్సి రావొచ్చు. మేమంతా వాటి రాకను వ్యతిరేకిస్తున్నాం. విదేశీ కొంగలు ఇక్కడికి రాకుండా అడ్డుకుంటాం’ అంది.

‘నాయకా.. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నాం. ఒక్క మనిషి కూడా మనల్ని ప్రేమగా చూడలేదు. ఎక్కడి నుంచో వస్తున్న కొంగలను చూడటానికి మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. నాకు ఒకవైపు చాలా ఈర్ష్యగా ఉంది. మరోవైపు బాధగా కూడా ఉంది. మేము వాటి రాకను వ్యతిరేకిస్తున్నాం’ చెప్పింది ఆనందిని అనే కొంగ. మిగతా కొంగలూ దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. వాటన్నింటి అభిప్రాయం విన్న శ్వేతవర్ణుడు ‘మీరు అలా తప్పుగా మాట్లాడవద్దు. ప్రాంతాలు వేరైనా అవన్నీ మన జాతి పక్షులే. మనలో ఒక భాగమే. అక్కడి చలిని తట్టుకోలేక ఇక్కడికి వస్తున్నాయి. కొన్నాళ్లు ఉండి తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోతాయి. వేలాది మైళ్లు దాటి ఇంత దూరం వస్తున్న ఆ కొంగలన్నీ మన అతిథులు. దయచేసి మనం వాటి రాకను వ్యతిరేకించొద్దు’ అన్నాడు.

నాయకుడి మాటలు కొంగలకు రుచించలేదు. లోలోపల అసంతృప్తి ఉన్నా.. తమ నాయకుడి మాటని వ్యతిరేకించలేదవి. మరుసటి రోజు విదేశీ కొంగలన్నీ సరస్సులోకి చేరాయి. చూడటానికి పెద్దగానూ, రకరకాల రంగుల్లోనూ భలే అందంగా ఉన్నాయవి. జనాలు సరస్సు దగ్గరకు క్యూ కట్టడం ప్రారంభించారు.

జనం పెరిగేకొద్దీ దేశీ కొంగల్లో వ్యతిరేక భావం ఎక్కువ కాసాగింది. అవే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. మరుసటి రోజే, ఒక్కొక్కటిగా సరస్సు అవతలి ఒడ్డుకు ఎగిరివెళ్తున్నాయి స్థానిక కొంగలు. అప్పుడు వాటికి కొన్ని విదేశీ కొంగలు ఎదురుపడ్డాయి. వాటిని చూడగానే ‘ఛీ.. అక్కడే అనుకుంటే, ఇక్కడ కూడా ఇవి ఉన్నాయా.. వీటి నుంచి దూరంగా వెళ్లేందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే.. అవి మనల్ని విడిచేలా లేవు’ అంటూ మనసులోనే తిట్టుకున్నాయి.

అప్పుడో విదేశీ కొంగ.. ‘మిత్రులారా.. ఈ ఒడ్డు చాలా ప్రమాదకరం. అక్కడ చేపల కోసం జాలర్లు వేసిన పెద్ద పెద్ద వలలు ఉన్నాయి. పొరపాటున మనం వాటిల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. దయచేసి మీరు అటు వైపు వెళ్లకండి’ అని హెచ్చరించింది. కానీ, ఆ మాటలను దేశీ కొంగలు నమ్మలేదు. కావాలనే అవి అబద్ధాలు చెబుతున్నాయని అనుకున్నాయి. ఆ మాటలను విన్న శ్వేతవర్ణుడు.. సరస్సు అవతలి ఒడ్డును పరిశీలించి వచ్చాడు. నిజంగానే అక్కడ వలలు వేసి ఉండటాన్ని గమనించాడు.

అప్పుడు తమ జాతి కొంగలను ఉద్దేశించి శ్వేత వర్ణుడు.. ‘చూశారు కదా.. ఆ విదేశీ కొంగలు చేసిన సాయం! మనం వాటిపైన ఎంత ద్వేషం పెంచుకున్నా.. అవి మాత్రం మన శ్రేయస్సునే కోరుకున్నాయి. ఆ కొంగలు చెప్పకపోతే మనలో చాలా మంది ఆ వలలో చిక్కుకొని విలవిల్లాడేవాళ్లం. ఇప్పటికైనా మన అతిథులను గౌరవిద్దాం’ అన్నాడు. కొంగలన్నీ ఆలోచనలో పడ్డాయి. తమ తప్పును తెలుసుకున్నాయి. విదేశీ కొంగల పట్ల తమ అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. వాటికి స్నేహ హస్తం అందించడానికి.. రివ్వున ఎగురుతూ, విదేశీ కొంగలు ఉన్న వైపు ఎగిరాయి. అది చూసిన శ్వేతవర్ణుడు.. మనసులోనే ఆనందపడ్డాడు.

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు