కపిరాణి వైద్యం!

అనగనగా ఒక అడవి. అందులో కపిరాణి అనే కోతి ఉండేది. అడవిలో ఏ ప్రాణికి దెబ్బ తగిలినా, జబ్బు చేసినా కపిరాణే వైద్యం చేసేది. కోతి వైద్యం అంటే అరణ్యంలోని అన్ని జీవులకు మంచి గురి. తమకు ఏ గాయమైనా.. వెంటనే దాని దగ్గరకు వెళ్లేవి. కానీ, కపిరాణి మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉండేది కాదు.

Published : 17 Jun 2022 00:59 IST

అనగనగా ఒక అడవి. అందులో కపిరాణి అనే కోతి ఉండేది. అడవిలో ఏ ప్రాణికి దెబ్బ తగిలినా, జబ్బు చేసినా కపిరాణే వైద్యం చేసేది. కోతి వైద్యం అంటే అరణ్యంలోని అన్ని జీవులకు మంచి గురి. తమకు ఏ గాయమైనా.. వెంటనే దాని దగ్గరకు వెళ్లేవి. కానీ, కపిరాణి మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉండేది కాదు. ఎక్కడెక్కడో తిరుగుతుండేది. గాయాలతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే జంతువులు.. కోతి వచ్చేవరకూ ఎదురుచూస్తుండేవి. అంతవరకూ ఓపిక లేకపోతే.. అవే వెతుక్కొని మరీ కోతిని తీసుకొచ్చేవి.

ఒకరోజు మృగరాజు కబురు పెట్టడంతో.. పరుగున సింహం గుహ దగ్గరకు వచ్చింది కపిరాణి. ‘కపిరాణీ.. నువ్వు చక్కని వైద్యంతో అడవిలోని జీవుల గాయాలనూ, రోగాలనూ నయం చేస్తూ వాటి ప్రాణాలు కాపాడుతున్నావు. అంతవరకూ బాగానే ఉన్నా.. వైద్యం కోసం వచ్చే జంతువులకు నువ్వు అందుబాటులో ఉండటం లేదు. దాంతో అవి ఇబ్బంది పడుతున్నాయి. వాటి అవస్థలను దృష్టిలో ఉంచుకొని.. నువ్వు నీ ఆవాసాన్ని వదలకుండా, నిరంతరం అందుబాటులో ఉండాలి’ అని ఆదేశించింది. ‘అలాగే ప్రభూ.. ఇకనుంచి అన్ని జీవులకూ అందుబాటులో ఉంటా’నని నమస్కరించి వెళ్లిపోయింది కపిరాణి.

మృగరాజుకు మాటయితే ఇచ్చింది కానీ, తన సహజ స్వభావం కారణంగా ఒకేచోట కుదురుగా ఉండలేకపోయింది కోతి. మళ్లీ ఎప్పటిలానే చెట్ల మీద తిరుగుతూ ఎక్కడెక్కడికో వెళ్లిపోయేది. వైద్యం కోసం వచ్చే జంతువులు ఎప్పటిలాగే ఎదురుచూడాల్సి వచ్చేది. అవి కూడా కపిరాణితో ‘నీ ఆహార అవసరాలను మేము తీరుస్తాం కానీ, నువ్వు ఎప్పుడూ ఇక్కడే మాకు అందుబాటులో ఉండు’ అని విన్నవించాయి. అయినా దాని ప్రవర్తనలో మార్పు రాలేదు. కొన్నిసార్లు వైద్యం కోసం వచ్చే జీవులు ఉదయం నుంచి సాయంకాలం వరకూ కోతి ఇంటి వద్దే వేచి ఉండేవి.

కోతి ప్రవర్తన మారలేదన్న విషయం మృగరాజుకి తెలియడంతో.. ‘నామాట కూడా వినని కపిరాణిని కఠినంగా శిక్షిస్తాను’ అని జంతువులతో అంది. అప్పుడు మంచీచెడూ తెలిసిన ఎలుగుబంటి ‘రాజా.. ఒక దగ్గర నిలకడగా ఉండలేకపోవడం కోతుల సహజ లక్షణం. దాన్ని నియంత్రించడం సరికాదు.. కపిరాణి చక్కని వైద్యంతో అడవిలోని ప్రాణులకు సేవ చేస్తోంది. అటువంటి దాన్ని శిక్షిస్తాననడం సరికాదని నా అభిప్రాయం’ అని చెప్పింది. మిగతా జంతువులు కూడా కపిరాణిని శిక్షించవద్దని కోరాయి. సరేనంటూ అప్పటికి వదిలేసింది సింహం.

ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కపిరాణి ఆహార సేకరణ నిమిత్తం అలా అలా తన నివాసం నుంచి చాలా దూరం వెళ్లిపోయింది. తల్లి లేకపోవడంతో పిల్ల కోతి చెట్లపైన గెంతుతూ, పట్టు తప్పి కిందపడిపోయింది. దెబ్బలు గట్టిగా తగలడంతో నొప్పితో విలవిల్లాడింది. దాని అరుపులు విని.. సమీపంలో ఉన్న పక్షులూ, జంతువులూ అక్కడికి చేరాయి. పిల్ల కోతి గాయాల బాధ తాళలేక ‘అమ్మా అమ్మా’ అంటూ బోరున ఏడవసాగింది. కపిరాణి కోసం జంతువులన్నీ అడవిని జల్లెడ పట్టాయి. ఎంత వెతికినా దాని జాడ మాత్రం కనిపించలేదు. అడవికి చివరనున్న పాడుబడిన బావి గట్టున కూర్చొని ఉండటాన్ని కాకి గమనించింది.

‘నీ బిడ్డ ఆడుకుంటూ చెట్టు పైనుంచి జారి కింద పడిపోయింది. గాయాలతో గుక్కపట్టి ఏడుస్తోంది. చాలా రక్తం కూడా పోయింది. మాకేం చేయాలో తెలియక.. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. వెంటనే వచ్చి కాపాడుకో’ అంటూ కపిరాణికి చెప్పింది కాకి. ‘అయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా బుజ్జి ఎంత బాధ పడుతుందో..’ అనుకుంటూ పరుగున ఇంటికి చేరుకుందది. అప్పటికే పిల్ల కోతి గాయాల బాధ తాళలేక స్పృహ తప్పిపోయింది. కపిరాణి వెంటనే పసరు మందు తయారు చేసి, దాని శరీరంపైనున్న గాయాలకు రాసింది.

కాసేపటి తరవాత పిల్లకోతి కళ్లు తెరిచింది. ఎదురుగా తల్లి కనిపించగానే.. గట్టిగా హత్తుకొని ఏడ్చింది. ‘ఈరోజు నేను అందుబాటులో లేకపోవడం వల్ల నా బిడ్డ గాయాలతో చాలా సమయం బాధపడాల్సి వచ్చింది. ఇంతకాలం మిగతా జంతువులు వైద్యం కోసం వచ్చినప్పుడు, నేను అందుబాటులో లేకపోవడం వల్ల అవి పడిన అవస్థలేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. మృగరాజు హెచ్చరించినా, మీరంతా ఎంత కోరినా నేను మాత్రం అందుబాటులో ఉండలేకపోయాను. అందరూ నన్ను క్షమించండి. ఇకపై నేను ఎక్కడికీ వెళ్లను. నా దగ్గరకి వైద్యం కోసం వచ్చే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను’ అని జంతువులకు మాట ఇచ్చింది. ఆ రోజు నుంచి తాను చెప్పిన విధంగానే.. ఇంటి వద్దే ఉంటూ, జీవులకు చిటికెలో చికిత్స అందించసాగింది. కపిరాణి ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి అడవిలోని ప్రాణులన్నీ ఎంతో సంతోషించాయి.

- మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు