గూడు వెనుక గుట్టు!

రాత్రి భోజనాలు అయ్యాయి. వెన్నెల పరుచుకుంది. సత్రం వాకిట్లో కూర్చుని బాటసారులు అంతా కబుర్లలో పడ్డారు. దేశదేశాల గురించి, రాజ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఏ పనిమీద ఎటు వెళ్తున్నదీ చెప్పుకుంటున్నారు. తోడుగా వచ్చేవారిని పరిచయం చేసుకున్నారు. మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమవుతున్నారంతా.

Updated : 20 Jun 2022 05:19 IST

రాత్రి భోజనాలు అయ్యాయి. వెన్నెల పరుచుకుంది. సత్రం వాకిట్లో కూర్చుని బాటసారులు అంతా కబుర్లలో పడ్డారు. దేశదేశాల గురించి, రాజ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఏ పనిమీద ఎటు వెళ్తున్నదీ చెప్పుకుంటున్నారు. తోడుగా వచ్చేవారిని పరిచయం చేసుకున్నారు. మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమవుతున్నారంతా.

వంటిల్లు అంతా చక్కబెట్టుకుని అప్పుడు వచ్చింది పేదరాశి పెద్దమ్మ. జుత్తు బాగా నెరసిపోయింది. ఆప్యాయంగా పలకరిస్తూ రెండు పూటలా రుచికరమైన భోజనం వండి వడ్డిస్తుంది ఆమె. అంతే కాకుండా భోజనం అనంతరం తలొకటి కాయో, పండో ఇస్తుంది. కమ్మని కథలను చెబుతుంది. అందుకే పేదరాశి పెద్దమ్మ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం.

‘పెద్దమ్మా నువ్వు కథలు చాలా బాగా చెప్తావని వీళ్లు అనుకుంటూ ఉంటే విన్నాం. మాక్కూడా వినాలని ఉంది చెప్పవా?’ అని అడిగారు పిల్లలు. ‘మీక్కూడా నేను పెద్దమ్మనేనా?’ అంది ముసిముసిగా నవ్వుతూ. ‘సరే నువ్వెలా పిలవమంటే అలానే పిలుస్తాం’ అంటూ పెద్దమ్మ చుట్టూ చేరారు పిల్లలంతా.

పెద్దమ్మ ఏమి చెబుతుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. నిశ్శబ్దంగా ఉండటంతో పెరట్లో చెట్టు మీద పక్షుల కిలకిలలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ‘పెద్దమ్మా.. ఆ గోల ఏంటి?’ అని అడిగాడు బుడుగు. ‘అది గోల కాదు. పక్షులు వాటి పిల్లలతో ఊసులాడుకుంటున్నాయి’ అంది పేదరాశి పెద్దమ్మ.

‘అవునా.. ఆ ఊసులేంటో చెప్పొచ్చు కదా!’ అంది చిన్నారి. ‘ఏముంటాయి? తల్లి పక్షి ఆహారానికి వెళ్లగానే పిల్ల పక్షులు మీలాగే అల్లరి చేస్తాయి.. ఆడుకుంటాయి. తల్లి వచ్చాక చాడీలు చెప్పుకుంటాయి’ అనగానే పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు.

‘పాపం మనలా వాటికి ఇల్లులేదు కదా! ఎలా బజ్జుంటాయి?’ అని పెద్దమ్మను అడిగాడు చంటాడు. ‘ఇల్లు లేకేం.. వాటికీ ఇళ్లుంటాయి. వాటినే మనం గూళ్లు అని పిలుస్తాం. ఒక్కో పక్షి, ఒక్కో రకమైన గూడును ఎంతో కష్టపడి నిర్మించుకుంటుంది’ అని పెద్దమ్మ చెప్పింది.

‘ఔనౌను.. కాకి గూడును నేను చూశాను’ అన్నాడు పెద్దాడు. ‘అవునర్రా పిల్లలూ! మీకు ఈ విషయం తెలుసా?’ అని అడిగింది పెద్దమ్మ. ‘నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది పెద్దమ్మా’ అని తడుముకోకుండా అన్నాడు గడుగ్గాయి. ‘పక్షులు గూళ్లు కట్టుకోవడంలో ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తాయి. కొన్ని పక్షులు కట్టెపుల్లలతో, మరికొన్ని గడ్డిపరకలతో గూళ్లను కట్టుకుంటాయి. ఇంకొన్ని చెట్టు తొర్రలో గూడును ఏర్పాటు చేసుకుంటాయి. పరిసరాల్లో దొరికే మెత్తని పీచు, దుప్పి వెంట్రుకలను పీకి ఆ గూటిలో ఉంచుతాయి’ అంది పెద్దమ్మ.

‘అమ్మో! అలా అయితే దుప్పికి నొప్పికదా!’ అని అమాయకంగా అడిగాడు గిడుగు. ‘నొప్పి అయినా అవి భరిస్తాయి. శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి దట్టమైన వెంట్రుకలు ఉపయోగపడతాయి. వేసవి వచ్చేసరికి వేడిని తట్టుకోలేవు. ఆ సమయంలో పక్షులు వాటి వెంట్రుకలను పీకి గూళ్లలో పెట్టుకుంటాయి. శరీరం తేలిక అయ్యి దుప్పి హాయిగా జీవిస్తుంది. పక్షులు, జంతువులు ఇలా దేన్నీ వృథా కానివ్వవు. పైగా ఒకదానికి మరొకటి సహకరించుకుంటూ జీవిస్తాయి’ అని ముగించింది పెద్దమ్మ.

‘అబ్బా.. గూడు వెనుక ఇంత గుట్టు ఉందా?’ అన్నాడు ఒక బాటసారి. ‘నిజమే పెద్దమ్మా తెలియని విషయాన్ని మాకు చెప్పావు’ అన్నారు పిల్లలు. కథ కంచికి.. ఇక మనం ఇంటికి అనుకుంటూ నిద్రలోకి జారుకున్నారు అక్కడి వారందరూ!

- కాశీ విశ్వనాథం పట్రాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని