బతుకు పాఠం!

కందవనం అనే ఊరి చివరన ఒక చిట్టడవి ఉంది. అందులోని ఒక చెట్టు మీద కొన్ని కాకులు నివసిస్తున్నాయి. వాటిలో ఒక ముసలి కాకికి చూపు మందగించడంతోపాటు రెక్కల్లో బలం తగ్గిపోయింది. సొంతంగా ఆహారం సంపాదించుకోలేని పరిస్థితి. దాంతో ఒకరోజు ఇటీవలే గుడ్డును పొదిగిన ఓ కాకితో ‘నా ఒంట్లో ఓపిక లేదు.. అలాగని ఆకలి వేయడం ఆగదు కదా..

Updated : 21 Jun 2022 00:31 IST

కందవనం అనే ఊరి చివరన ఒక చిట్టడవి ఉంది. అందులోని ఒక చెట్టు మీద కొన్ని కాకులు నివసిస్తున్నాయి. వాటిలో ఒక ముసలి కాకికి చూపు మందగించడంతోపాటు రెక్కల్లో బలం తగ్గిపోయింది. సొంతంగా ఆహారం సంపాదించుకోలేని పరిస్థితి. దాంతో ఒకరోజు ఇటీవలే గుడ్డును పొదిగిన ఓ కాకితో ‘నా ఒంట్లో ఓపిక లేదు.. అలాగని ఆకలి వేయడం ఆగదు కదా.. నీ పిల్లకు నువ్వు పెట్టే ఆహారంలో కొంత నాకు ఇవ్వగలవా?’ అని దీనంగా అడిగింది. ‘నువ్వు అంతలా అడగాలా.. నేను ఆహారం కోసం బయటకు వెళ్లి వచ్చే వరకూ నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటే చాలు’ బదులిచ్చిందా కాకి. వెంటనే ‘నాకు చావు వచ్చేవరకూ కావ్‌.. కావ్‌మని అరుస్తూనే ఉంటాను. నా అరుపులతో ఏ జీవీ నీ బిడ్డ జోలికి రాదు. సరేనా!’ అంది ముసలి కాకి. ‘ఈ రోజు నుంచి నీ ఆకలి తీర్చే బాధ్యత నాది’ అంటూ ఆహారం కోసం బయటకు వెళ్లిపోయింది పెద్ద కాకి.

వెంటనే పిల్ల కాకి దగ్గరికి చేరింది ముసలి కాకి. ఆడటం, పాడటం చేస్తూ.. ఎలా ఎగరాలో కూడా నేర్పసాగింది. అలా ఆ రెండింటి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అలవాటులో భాగంగా పెద్ద కాకి తెచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ‘నీ బిడ్డ పెద్దదవుతోంది. రెక్కలతో ఎలా ఎగరాలో చెప్పాను. ఆహారాన్ని సంపాదించడం కూడా నేర్పించాను. ఇకనుంచి దాన్ని కూడా నీతోపాటు బయటకు తీసుకొని వెళ్లవచ్చు’ అని సలహా ఇచ్చింది ముసలి కాకి. ఆ మాటలు పెద్ద కాకికి రుచించలేదు. ‘అది ఇంకా చిన్న పిల్లే. రెక్కలూ లేతవే.. బద్ధకంతో నువ్వు దాన్ని చూసుకోలేక.. నాతోపాటు బయటకు తీసుకు వెళ్లమని ఉచిత సలహాలు ఇస్తున్నావు. బయటకు వెళ్తే, క్రూర జంతువుల కోరల్లో చిక్కుకుని అది చచ్చిపోతుంది. నా నుంచి నా బిడ్డను దూరం చేయాలనుకుంటున్నావా? ఇకనుంచి నీ దారి నీది, నా దారి నాది. నీ ఆహారం నువ్వే సంపాదించుకో!’ అంటూ కోపగించుకుంది పెద్ద కాకి.

‘నా ఉద్దేశం అది కాదు. తల్లికెప్పుడూ తన బిడ్డలు చిన్న పిల్లలుగానే కనిపిస్తారు. అది సహజం. కానీ పిల్లలు ఎదిగే దశలోనే బతకడం ఎలాగో నేర్పించాలి. బతుకు పాఠం తెలియజెప్పాలి. లేకపోతే భవిష్యత్తులో వాళ్లు సొంతంగా బతకలేరు’ అని వివరించింది ముసలి కాకి. కానీ, ఆ మాటలేవీ పెద్ద కాకి చెవికెక్కించుకోలేదు సరికదా, ఆగ్రహం వ్యక్తం చేసింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్న విషయాన్ని గ్రహించిన ముసలి కాకి అలిగింది. చెట్టుపైన మరో కొమ్మ మీదకు వెళ్లిపోయింది. ఆ రోజు అలా గడిచిపోయింది. తెల్లవారుజామునే నిద్రలేచిన పెద్ద కాకికి అనారోగ్యంగా అనిపించింది. ఒళ్లంతా నొప్పులుగా ఉండటంతో ఎగిరి వెళ్లే ఓపిక లేక గూటిలోనే ఉండిపోయింది. నీరసంతో మళ్లీ నిద్రపోయింది. కొంతసేపటి తరువాత మెలకువ రావడంతో లేచి చూసేసరికి.. తన పక్కన బిడ్డ కనిపించలేదు. కంగారు కంగారుగా చుట్టుపక్కల మొత్తం వెతికింది. కొమ్మ కొమ్మకూ వినిపించేలా గట్టిగా అరిచింది.

ఆ కేకలు విన్న ముసలి కాకి ‘ఏమైంది?’ అంటూ పెద్ద కాకి దగ్గరకు వచ్చి అడిగింది. ‘నీకు ఆహారం తెచ్చివ్వనని అన్నందుకు కోపంతో నా బిడ్డను నువ్వే ఏదో చేసుంటావు.. ఏం చేశావో, ఎక్కడ దాచావో చెప్పు?’ అంటూ ముసలి కాకిని నిలదీసింది తల్లి కాకి. ‘నిజంగా నాకేం తెలియదు. నన్ను నమ్ము. నీ బిడ్డ అంటే నాకు కూడా ఇష్టమే. ఎక్కడకు వెళ్లిందో నిజంగా నాకు తెలియదు’ దిగాలుగా చెప్పిందది. అప్పుడే ‘అమ్మా!’ అంటూ పిల్ల కాకి ఆహారంతో ఎగురుకుంటూ వచ్చింది. దాన్ని చూడగానే తల్లి కాకి కళ్లు ఆనందంతో మెరిశాయి. ‘ఎక్కడకు వెళ్లావమ్మా.. అమ్మకు చెప్పకుండా?’ అంటూ గోముగా అడిగింది. ‘అమ్మా.. నాకన్నీ ఈ ముసలి కాకి నేర్పించింది. నీకు ఆరోగ్యం బాగాలేదని గమనించాను. నీకు బదులుగా నేనే ఆహారం సంపాదించి తీసుకొచ్చాను. అంతే!’ చెప్పింది పిల్ల కాకి. బిడ్డ మాటలతో తన తప్పేంటో తెలుసుకున్న తల్లి, ముసలి కాకి వైపు చూస్తూ ‘అనవసరంగా నిన్ను నిందించాను. నన్ను మన్నించు!’ అని కోరింది. ‘పిల్లల మీద ప్రేమ ఉండాలి కానీ అది వారికి బలహీనతగా మారొద్దు. గారాబం అసలే పనికి రాదు. అడిగిందల్లా అందిస్తే.. పిల్లలకు బతకడం తెలియదు. నీ తప్పు నీకు తెలిసింది కదా.. నాకు అది చాలు’ నవ్వుతూ అంది ముసలి కాకి. తాను తెచ్చిన ఆహారాన్ని తల్లికి, ముసలి కాకికి పెట్టి తాను కూడా తిన్నది పిల్ల కాకి. 

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని