పచ్చదనమే పరమానందం!

పూర్వం చంద్రశేఖరుడనే జమీందారు ఉండేవాడు. ఆయన జమీలో చాలా గ్రామాలుండేవి. ఒకసారి సమీప గ్రామాన ఉన్న ఒక సంపన్నుడి కుమార్తె వివాహానికి ఆయన పల్లకీలో బయలుదేరాడు. రహదారి ఇరుకుగా, అంతా గుంతలు గుంతలుగా ఉండి ప్రయాణం చాలా కష్టంగా అనిపించింది. ఆమాటే పక్కన ఉన్న దివానుతో అన్నాడు.

Published : 22 Jun 2022 01:02 IST

పూర్వం చంద్రశేఖరుడనే జమీందారు ఉండేవాడు. ఆయన జమీలో చాలా గ్రామాలుండేవి. ఒకసారి సమీప గ్రామాన ఉన్న ఒక సంపన్నుడి కుమార్తె వివాహానికి ఆయన పల్లకీలో బయలుదేరాడు.

రహదారి ఇరుకుగా, అంతా గుంతలు గుంతలుగా ఉండి ప్రయాణం చాలా కష్టంగా అనిపించింది. ఆమాటే పక్కన ఉన్న దివానుతో అన్నాడు.

‘అయ్యా! ఈ రహదారులన్నీ మీ తాతగారి హయాంలో వేసినవి. తరవాత మళ్లీ వాటి మరమ్మతులు.. ఆర్థిక కారణాల వల్ల వీలు కాలేదు. కాలక్రమేణా అవి గుంతలు పడిపోయాయి. జనాభా పెరగడంతో, సంతకు సరకులు తీసుకెళ్లే వాహనాలు, వ్యవసాయ పనులకు వెళ్లే బండ్లు పెరగడంతో ఇరుకు అయిపోయి, గుంతలు పడిపోయాయి’ అన్నాడు దివాను.

‘మీరు ఏదో ఒకలా ధనం సర్దుబాటు చేసి రహదారులను వెడల్పు చేయించి, గుంతలు పూడ్పించండి’ అన్నాడు జమీందారు. అంతంత మాత్రంగా ఉన్న ఖజానా నుంచి దివాను అతి కష్టం మీద కొంత ధనాన్ని సర్దుబాటు చేసి గ్రామాల నుంచి జమీందారుండే పట్టణాన్ని కలిపే రహదారులకు మరమ్మతులు జరిపించి, వెడల్పు చేయించాడు.

దీని కోసం ఎన్నో ఏళ్ల వయసున్న చెట్లను కొట్టివేయాల్సి వచ్చింది. రహదారులు కొత్తగా వేశాక, తిరిగి ఇరువైపులా చెట్లు నాటడానికి తగిన ఆర్థిక పరిస్థితి లేక అలా వదిలేశారు. రహదారికిరువైపులా పచ్చదనంతో బాటసారులకు కనువిందు చేస్తూ నీడను ఇచ్చే మహా వృక్షాలెన్నో కూలిపోయి రహదారులు గత శోభను కోల్పోయాయి.

ఇది ఇలా ఉండగా ఇటీవల మిడతలదండు దాడికి పంటలు పాడయిపోయి, చాలా గ్రామాలు కరవు బారిన పడ్డాయి. ఆ గ్రామాల ప్రజలకు తగిన సహాయం అందించడానికి జమీందారు, దివానుతోపాటు గ్రామ పర్యటనకు బయలుదేరి.. మొదట రామాపురం చేరాడు. కళ తప్పిన రహదారులను చూచి బాధ పడ్డాడు.

దానికి దివాను.. ‘ప్రభూ! మీ తాతగారు రహదారులు నిర్మించినపుడే, ఆయన వాటికి ఇరుపక్కలా మొక్కలు నాటించాడు. కాలక్రమేణా అవి పెరిగి మహా వృక్షాలయ్యాయి. నీడ, పచ్చదనాన్ని ఇస్తూ ఇంతకాలం బాటసారులను సేదతీరేలా చేశాయి. రహదారులు వెడల్పు చేసే క్రమంలో వాటిని కొట్టివేశాం. మళ్లీ మొక్కలు నాటడానికి తగినంత ధనం లేక అలాగే వదిలేశాం. అదే ఈ దుస్థితికి కారణం’ అన్నాడు.

జమీందారు, రామాపురం గ్రామ ప్రజల్ని విచారించారు. కరవు నివారణకు తగిన సహాయం ప్రకటించి.. అక్కడి నుంచి సిరిపురం బయలుదేరాడు. ఆశ్చర్యం! సిరిపురం వెళ్లేదారి వెడల్పు అవడంతో పాటు పచ్చదనంతో కళకళలాడుతూ ఉంది. గ్రామాధికారిని పిలిచి విషయం ఆరా తీశాడు జమీందారు. ‘అయ్యా! మీరు రహదారులు వెడల్పు చేశారు. తిరిగి మొక్కలు నాటించడం మరిచారు. మేం ఎక్కడికి వెళ్లాలన్నా ఈ దారే ముఖ్యం. రహదారులకు ఇరువైపులా చెట్లు లేకపోతే బాటసారులకు నిలువ నీడ కూడా ఉండదు. సంతకు సరకు తీసుకెళ్లే బండ్లను లాగే పశువులకూ విశ్రాంతి ఉండదు. ఆ వృక్షాల వల్ల వచ్చే ఉత్పత్తులూ ఉండవు. వర్షపాతమూ తగ్గి పోతుంది. అందుకని గ్రామప్రజలను నేను చైతన్యపరిచాను. అందరూ ముందుకొచ్చి చందాలిచ్చారు. దానికి మీరు ఇచ్చే గ్రామాభివృద్ధి నిధుల్ని కలిపి మొక్కల్ని నాటించాను’ అన్నాడు.

‘భేష్‌! చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే చిరు దివ్వెనైనా వెలిగించేందుకు ప్రయత్నించాలి’ అన్న పెద్దలమాటను నువ్వు నిజం చేశావు. మా కళ్లూ తెరిపించావు. నేను నీకు ఎంత కష్టపడి అయినా ధనం సమకూరుస్తాను. మన జమీలో ఉన్న మిగతా రహదారుల వెంబడి కూడా మొక్కలు నాటించే బాధ్యత నీదే’ అన్నాడు జమీందారు. గ్రామాధికారి సరేనన్నాడు. తనకిచ్చిన బాధ్యతను శ్రద్ధతో త్వరగానే నెరవేర్చాడు. దీంతో జమీ పచ్చగా కళకళలాడింది. జమీందారు గ్రామాధికారిని ఘనంగా సత్కరించాడు.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని