బామ్మ చెప్పిన పాఠం

బామ్మ ఊరి నుంచి వచ్చి దాదాపు నాలుగు రోజులవుతోంది. ‘అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, బామ్మలు చక్కటి కథలు చెబుతారట. మా స్నేహితులు ఎప్పుడూ అదే అంటుంటారు. నువ్వు కూడా మాకో మంచి కథ చెప్పొచ్చు కదా బామ్మా..’ అని అడిగారు పుష్ప, వాణి. దాంతో మనవడు, మనవరాలి వైపు తీక్షణంగా చూసింది బామ్మ.

Published : 25 Jun 2022 03:49 IST

బామ్మ ఊరి నుంచి వచ్చి దాదాపు నాలుగు రోజులవుతోంది. ‘అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, బామ్మలు చక్కటి కథలు చెబుతారట. మా స్నేహితులు ఎప్పుడూ అదే అంటుంటారు. నువ్వు కూడా మాకో మంచి కథ చెప్పొచ్చు కదా బామ్మా..’ అని అడిగారు పుష్ప, వాణి. దాంతో మనవడు, మనవరాలి వైపు తీక్షణంగా చూసింది బామ్మ. క్షణం తరవాత ‘ఎండాకాలం సెలవులు ముగియడంతో బడులు మళ్లీ తెరిచారు కదా.. హోంవర్క్‌ చేసుకోవాలని అమ్మ ఇందాకే మీకు చెప్పింది.. అది నేను విన్నాను.. మీ పని పూర్తయ్యాక నా దగ్గరకు రండి.. కచ్చితంగా మంచి కథ చెబుతాను’ హామీ ఇచ్చింది బామ్మ. ‘ఓ.. చదువుకోవాల్సింది, రాసుకోవాల్సిందీ అయ్యాకే నీ దగ్గరకు వచ్చాం బామ్మా.. నువ్వు అయితే ముందు కథ ప్రారంభించు..’ ఆత్రుతగా అడిగారు మనవడు, మనవరాలు.

‘చెబుతానర్రా.. శ్రద్ధగా వినండి మరి’ అంటూ కథ మొదలుపెట్టింది బామ్మ. ‘చక్రిపురంలో ఏడో తరగతి చదివే శ్రీను మంచి బాలుడు. చాలా తెలివైనవాడు కూడా. అందువల్ల వాళ్ల నాన్నకు శ్రీను అంటే చెప్పలేనంత ఇష్టం. ఒకరోజు ఉదయం శ్రీనును వాళ్ల నాన్న సినిమాకు తీసుకెళ్లాడు. ఇంటర్వెల్‌లో కొడుకు అడిగినవన్నీ కొనిచ్చాడు. చూడటం అయ్యాక.. ఇద్దరూ హాలు బయటకు వచ్చారు. కొడుకును గేటు దగ్గర నిలబెట్టి, బండి తీసుకొస్తానని పార్కింగ్‌ వద్దకు వెళ్లాడు నాన్న. ఇంతలో అక్కడ కొంతమంది మూడుముక్కలాట, మూడు గ్లాసులాట ఆడుతున్నారు. అక్కడ ఉన్నవాళ్లు వరసగా ఏవేవో చెబుతూ, అక్కడి కుర్చీ మీద డబ్బులు పెడుతున్నారు. చాలామంది ఓడిపోతూ, బాధగా వెళ్లిపోతున్నారు. శ్రీను ఆ ఆటనే గమనిస్తుండటాన్ని బండి తీసుకొని వచ్చిన వాళ్ల నాన్న చూశాడు. ‘శ్రీనూ, నువ్వూ ఆడతావా?’ అని అడిగాడు. ‘ఆ ఆటేంటో అర్థం కావట్లేదు.. కానీ భలే సరదాగా ఉంది నాన్నా.. ఒకసారి ఆడతా’ భయంభయంగా బదులిచ్చాడు కొడుకు. 

‘సరే పద..’ అన్నాడు తండ్రి. ‘చూడు శ్రీనూ.. మనం ఏదైనా కొత్తగా ప్రయత్నించే ముందు.. బాగా గమనించాలి. సరైన కసరత్తు చేశాకే ముందడుగు వేయాలి. అందుకే.. ఆట ఆడే ముందు నువ్వు కూడా కాసేపు దగ్గరి నుంచి శ్రద్ధగా గమనించు. ఆటను బాగా అర్థం చేసుకో’ చెప్పాడు నాన్న. కొద్దిసేపటి తరవాత శ్రీనుకు ఆ ఆట ఆడించేవాళ్ల హస్తలాఘవం తెలిసింది. అందులో మోసం ఉందన్న విషయమూ అర్థమైంది. అదే విషయాన్ని నాన్నతో చెప్పాడు. ‘బాగా కనిపెట్టావు. ఈ ఆటలపై నువ్వు ఆసక్తి కనబరుస్తున్నావన్న విషయం గమనించకుండా నేను ఇంటికి తీసుకెళ్లి ఉంటే, నీ మనసు ఇక్కడే ఉండేది. ఎలాగైనా అవి ఆడి గెలవాలన్న తాపత్రయంతో తప్పుదారి పట్టే ప్రమాదమూ ఉండేది. నీకు విషయం అర్థం కావాలనే.. ఆ ఆటలు ఆడటం తప్పయినా గమనించమని చెప్పాను’ వివరించాడు నాన్న.

‘వాళ్లు జీవించడానికి ఈ తప్పుడు మార్గం ఎంచుకున్నారు. ఒకరిద్దరు తప్ప ఇందులో ఆడేవాళ్లు అందరూ డబ్బులు పోగొట్టుకుంటుంటారు. ఒకవేళ ఎవరైనా నీలాంటి తెలివైన వాడు, వాళ్లు చేసేది కనిపెట్టి గెలిస్తే.. నానా గొడవ చేస్తారు. చాలాసార్లు అది కొట్టుకునేదాకా వెళుతుంది. చక్కగా చదువుకునేవాళ్లకు, ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు ఇది అవసరమా? సమాజంలో గౌరవం పొందాలనుకునే వాళ్లు ఇలాంటి వాటికి ఆకర్షితులు కారు. బుద్ధిని వికసింపజేసే ఆటలు మనకు బోలెడు ఉన్నాయి. బంధువులతోనో, స్నేహితులతోనో అవి ఆడుకోవాలి. ఆటలు ఆహ్లాదాన్ని పంచాలి కానీ వ్యసనంగా మారకూడదు, డబ్బులు పెట్టి పందేల వరకూ అస్సలు వెళ్లకూడదు. అర్థమైందా?’ అని కొడుకును అడిగాడు తండ్రి. ‘బాగా అర్థమైంది నాన్నా’ తేలికపడిన మనసుతో అన్నాడు శ్రీను. తరవాత ఇద్దరూ కలిసి ఇంటిదారి పట్టారు.

‘పిల్లలూ ఎలా ఉందర్రా కథ.. మీకు నచ్చిందా?’ అని మనవడు, మవనరాలిని అడిగింది బామ్మ. ‘ఓ.. బాగుంది బామ్మా’ అని హుషారుగా సమాధానిమిచ్చారిద్దరూ. ‘మరి ఇందులో నీతి ఏమిటి?’ అని అడిగింది బామ్మ. ‘శరీరానికి, మనసుకు ఆరోగ్యాన్నిచ్చే ఆటలే మంచివి.. వ్యసనాలకు తావిచ్చే వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పందెపు ఆటలకు..’ అని ముక్తకంఠంతో అన్నారా పిల్లలు. ‘అవునర్రా.. ఇక మీరు వెళ్లి భోజనం చేసి పడుకోండి. ఉదయాన్నే లేచి బడికి వెళ్లాలి కదా..’ అంది బామ్మ. ‘అలాగే’ అంటూ పిల్లలు పరుగెత్తుకుంటూ లోపలకు వెళ్లిపోయారు. 

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని