నక్క బుద్ధి!

మృగరాజు అడవిని కాపాడుకొనే పనిలో పడింది. అందుకోసం నక్క, తోడేలును రక్షకభటులుగా నియమించుకుంది. తెల్లారింది మొదలు సాయంత్రం వరకూ అడవంతా తిరిగి జంతువులు, మానవుల కదలికలను పూసగుచ్చినట్టుగా చెబుతుండేవి ఆ రెండు.అందుకు ప్రతిఫలంగా ప్రతిరోజూ ఆ రెండింటికి తిండి కోసం మాంసం ఇస్తుండేది మృగరాజు.

Published : 28 Jun 2022 00:47 IST

మృగరాజు అడవిని కాపాడుకొనే పనిలో పడింది. అందుకోసం నక్క, తోడేలును రక్షకభటులుగా నియమించుకుంది. తెల్లారింది మొదలు సాయంత్రం వరకూ అడవంతా తిరిగి జంతువులు, మానవుల కదలికలను పూసగుచ్చినట్టుగా చెబుతుండేవి ఆ రెండు.

అందుకు ప్రతిఫలంగా ప్రతిరోజూ ఆ రెండింటికి తిండి కోసం మాంసం ఇస్తుండేది మృగరాజు. అల్లరి జంతువుల ఆట కట్టడితో ఆ వనం దట్టమైన అడవిగా రూపుదిద్దుకుంటోంది. మొదట్లో నక్క, తోడేలు కలిసి తిరుగుతుండేవి. తోడేలు చిత్తశుద్ధితో పనిచేసేది. కానీ నక్కకు పని కష్టమనిపించింది.

‘ఆయాసపడే పనికి ఆమడ దూరం’ అన్నట్లుండే నక్క ఒక రోజు.. ‘తోడేలు మిత్రమా! ఇద్దరమూ ఒకే వైపు వెళ్లడం వల్ల పరిశీలించే ప్రాంతం తక్కువ, సమయం కూడా వృథా అవుతోందని నాకు అనిపిస్తోంది. చెరో దిక్కుకు వెళ్తే మన ఉద్యోగానికి న్యాయం చేసిన వాళ్లమవుతాం’ అని తెలివిగా చెప్పింది.

నక్క జిత్తులను పసిగట్టిన తోడేలు మాత్రం కలిసి పనిచేస్తే కష్టం తెలియదు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే అన్ని విధాలా శ్రేయస్కరం అంటూ అడ్డుకుంది. తోడేలు దగ్గర తన ఎత్తు పారకపోవడంతో మృగరాజు నుంచే తన ఎత్తును అమలుపరచాలనుకుంది నక్క.

ఒకరోజు.. ‘మృగరాజా! ఈ విశాలమైన అడవికి మీలాంటి వారు రాజుగా ఉండడం ఈ అడవి జంతువులు చేసుకున్న అదృష్టం. ఇద్దరం కలిసి ఒకేవైపు రక్షణ వ్యవహారాలు చూడడం వల్ల తక్కువ ప్రాంతాన్ని రక్షిస్తున్నామన్న భావన నాకు కలుగుతోంది. చెరో దిక్కున తిరుగుతూ ఎక్కువ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశానికి మీరు అనుమతి ఇవ్వండి’ అని అడిగింది నక్క.

‘నీ ఆలోచన భేష్‌. పని మీద అంకితభావం ఉన్నవాళ్లే ఇటువంటి ఆలోచనలు చేస్తారు’ అంటూ నక్కకు కితాబు ఇచ్చింది మృగరాజు. తోడేలు అవాక్కైంది. తోడేలు నోటికి తాళం పడడంతో నక్క వంగి వంగి దండాలు పెడుతూ మృగరాజు దగ్గర నుంచి సెలవు తీసుకుంది. ఇప్పుడు తోడేలు పనిలో ఉంటే, నక్క మాత్రం బద్ధకంతో విశ్రాంతి తీసుకుంటుండేది.

తూతూమంత్రంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండేది. ‘బద్ధకస్తుడికి ఆకలెక్కువ’ అన్న చందాన ఆకలిగొట్టు నక్క, తనకు ఇచ్చే మాంసం వాటాతో సంతృప్తి పడేది కాదు. తోడేలు కళ్లు గప్పి దాని వాటా నుంచి ఎంతో కొంత తనదాంట్లో కలుపుకొంటుండేది. అప్పుడప్పుడు అది గమనించిన తోడేలు, నక్కపై చిర్రుబుర్రులాడుతుండేది. చివరకు సింహాన్ని మెప్పించి తనకు ఎక్కువ వాటా వచ్చేటట్టు చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంది నక్క.

చిత్తశుద్ధి లేని తన పని మీద తోడేలు ఎప్పుడైనా మృగరాజుకు ఫిర్యాదు చేయొచ్చనే అనుమానం నక్కకు మొదలైంది. తనపై ఎటువంటి అనుమానం మృగరాజుకు రాకుండా ఉండేందుకు ఒకరోజు సాయంత్రం వేళ ‘మృగరాజా! మీరు అప్పగించిన పని పూర్తైంది. దయామయులైన మీ దర్శనభాగ్యం కలుగజేసి నా కడుపు నింపండి.. అంటూ కొండల నడుమకు పోయి బిగ్గరగా ప్రార్థించింది. ఆ ప్రార్థన గుహలో ఉన్న సింహానికి ఇంపుగా వినిపించింది. నక్క ప్రభు భక్తికి అబ్బురపడింది. నక్క కొత్త అలవాటుకు తోడేలు నవ్వుకుంది. ఎప్పటిలాగే కొంత సమయం గడిచాక నక్క, తోడేలు ఆహారం కోసం సింహం గుహకు వెళ్లాయి.

‘నువ్వు ప్రతీ పదాన్ని రెండు సార్లు పలికి చేసిన ప్రార్థన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది’ అంటూ నక్కను మెచ్చుకుంది. సింహం పొగడ్తలతో నక్క ఆశ్చర్యపోయింది. తను ఒక్కసారే చేసిన ప్రార్థన సింహానికి రెండు సార్లు ఎలా వినిపించందబ్బా అంటూ ఆలోచనలో పడింది. కొండల నడుమ తన మాటలకు ప్రతిధ్వని అదని గుర్తించింది. సందు దొరికింది కదా అని ఇంకా కథలల్లడం ప్రారంభించింది.

‘మృగరాజా! మొదటి ప్రార్థన నాది, రెండోది మా తమ్ముడిది. మేము కవల పిల్లలం. తమ్ముడికి నా కంటే ప్రభుభక్తి ఎక్కువ. అడవి రక్షణ విషయంలో ఆకలిని కూడా లెక్క చేయదు. తమ్ముడి నిస్వార్థ సేవకు ప్రతి ఫలంగా నా వాటాలో ఆహారం ఇస్తున్నాను’ అని చెప్పింది నక్క.

సింహం ముగ్ధురాలైంది. ‘ఇక నుంచి ఈ మాంసం మూడు వాటాలు వేసుకోండి’ అని ఆజ్ఞాపించింది. లేని నక్కకు మృగరాజు వాటా ఇవ్వమనడంతో తోడేలు విస్మయానికి గురైంది. సింహానికి కృతజ్ఞతలు తెలియజేసింది నక్క. తరువాత తోడేలు వైపు గర్వంగా చూసింది.

అప్పటి నుంచి రెండు వాటాలు తీసుకుంటున్న నక్క, తోడేలుపై పెత్తనం చెలాయించడం మొదలు పెట్టింది. పని తక్కువ, పొగరెక్కువ అన్న చందాన ఉన్న నక్క ఎత్తును చిత్తు చేయాలనుకుంది తోడేలు. ఎప్పటిలాగే సాయంత్రం పూట నక్క, తోడేలు ఆహారం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి.

‘మృగరాజా! ఈ అడవిని రక్షించుకోవడంలో మా ఇద్దరికన్నా నక్క తమ్ముడి పాత్రే కీలకం. తన గురించి జంతువులన్నీ గొప్పగా చెప్పుకుంటున్నాయి. మిగతా జంతువులన్నీ సన్మానం చేయాలని అనుకుంటున్నాయి. మీ అనుమతి కోసం నన్ను అడగమన్నాయి’ అని విన్నవించుకుంది తోడేలు.

‘నాకు కూడా అలాగే అనిపిస్తోంది’ అని అంది సింహం. ఇప్పుడు నక్క గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. నాటకాన్ని పసిగట్టిన తోడేలు తనను ఇరకాటంలో పెట్టడానికి సింహం ముందు సన్మానం ఏర్పాటు చేసిందని నక్క గమనించింది. తన బండారం బయట పడక ముందే పిలుచుకొస్తానని చెప్పి చల్లగా జారుకుంది. చివరకు సింహం ముందు తిరిగే ధైర్యం లేక అడవిని విడిచి పారిపోయింది నక్క.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని