చివరికి పాటే గెలిచింది!

పాంచాల దేశాన్ని మార్తాండుడు పాలించేవాడు. సంగీతం అంటే చెవి కోసుకునేవాడు. విష్ణుచిత్తుడు అనే గాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆస్థాన గాయకుడిగా స్థిరపడ్డాడు. అతనితో పోటీ పడి గెలిచిన వారు లేరు అని అందరూ అనుకునేవారు.

Published : 29 Jun 2022 01:06 IST

పాంచాల దేశాన్ని మార్తాండుడు పాలించేవాడు. సంగీతం అంటే చెవి కోసుకునేవాడు. విష్ణుచిత్తుడు అనే గాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆస్థాన గాయకుడిగా స్థిరపడ్డాడు. అతనితో పోటీ పడి గెలిచిన వారు లేరు అని అందరూ అనుకునేవారు.
నిజానికి విష్ణుచిత్తుడి కంఠం అంతగా బాగుండదు. పక్కన సంగీత వాయిద్య కళాకారుల వల్ల అతను గాయకుడిగా నెట్టుకొస్తున్నాడు. ‘ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం’ అన్న చందంగా విష్ణుచిత్తుడు పాతుకుపోయాడు.. అని అనేవాళ్లూ ఉన్నారు.

ఒకసారి పొరుగున ఉన్న మాళవ దేశం నుంచి విష్ణుచిత్తుడితో పాటల పోటీకి సిద్ధమని సుధాముడు అనే గాయకుడు సవాలు విసిరాడు. అందుకు తమ ఆస్థాన గాయకుడు కూడా సిద్ధమని మార్తాండుడు ఉత్తర్వులు జారీ చేశాడు.

సుధాముడు పొలిమేర నుంచి గుర్రపు బండిలో కోటకు వస్తున్నాడని తెలిసింది. విష్ణుచిత్తుడు తన వారిని దొంగల రూపంలో పంపి, వారి సంగీత సాధనాలను దొంగిలించమని చెప్పాడు. వారు కత్తులు చూపించి గుర్రపు బండిని ఆపి.. ‘మాకు సొమ్ములు వద్దు మర్యాదగా సంగీత సాధనాలు ఇవ్వండి, లేకపోతే అనవసరంగా ప్రాణాలు కోల్పోతారు’ అన్నారు.

చేసేది లేక వారు తమ సంగీత సాధనాలను ఆ దొంగలకు ఇచ్చారు. గుర్రపు బండి కోటకు చేరుకుంది. సుధాముడు తన వాళ్లతో సంగీత సాధనాలు దొంగిలించిన విషయం ఎవ్వరికీ చెప్పవద్దని అన్నాడు. రాజు వారికి స్వాగతం పలికి ప్రత్యేక మందిరంలో విడిది ఏర్పాటు చేశాడు. విష్ణుచిత్తుడు, సుధాముడు ఆ మందిరంలో కలిసి ముచ్చటించారు.

సుధాముడి ముఖంలో ఎలాంటి తొట్రుపాటు లేకపోవడం విష్ణుచిత్తుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరుసటి రోజు రాజు, మంత్రి, న్యాయనిర్ణేత సమక్షంలో పాటల పోటీ ప్రారంభమైంది. విష్ణుచిత్తుడు.. మద్దెల, వీణ, పిల్లనగ్రోవి వాయించే సంగీత కళాకారులతో వచ్చి కూర్చున్నాడు.

సుధాముడు వచ్చిన తరువాత పెద్ద కుండతో ఒకడు, ఏడు చిన్న ముంతలతో రెండోవాడు వచ్చి వాటిని నేలపై పెట్టి వాటిలో కొద్దికొద్దిగా నీళ్లు పోశాడు. చివరగా మూడోవాడు ఒట్టి చేతులతో వచ్చి కూర్చున్నాడు.  ‘మహారాజా! మా వద్ద ఉన్న సంగీత సాధనాలను చూసి విస్తుపోకండి. మేము గతుకుల మార్గంలో గుర్రపు బండీలో వస్తుండగా మా వాళ్ల అజాగ్రత్త వల్ల అవి కింద పడిపోయి విరిగి పోయాయి. పాడలేక సాధనాలు లేవు అంటున్నారని అనిపించుకోవడం ఇష్టం లేక ఈ ఏర్పాట్లు చేసుకున్నాం’ అన్నాడు సుధాముడు.

‘దానిదేముంది పాట రక్తి కడితే చాలు’ అన్నాడు రాజు. ‘ముందుగా గురువుగారు పాట పాడాలి’ అన్నాడు సుధాముడు. విష్ణుచిత్తుడు పాడాడు. తరువాత సుధాముడి వంతు వచ్చింది.. పాట అందుకున్నాడు. మద్దెల బదులు కుండ, వీణ బదులు నీటిని నింపిన ఏడు మట్టి ముంతలపై చిన్న కర్రతో కొట్టి వింత ధ్వనితో మరొకరు, ఈలతో వేణువులా మరొకరు పాటకు తగ్గ సంగీతాన్ని అందించారు. మొదటి పాటకే సభ హర్షద్వానాలతో మారుమోగిపోయింది. రాజు, మంత్రి, సంగీత న్యాయనిర్ణేత కూడా ఎంతో ఆనందించారు. తరువాత మరో రెండు పాటలు విష్ణుచిత్తుడు, సుధాముడు పాడారు.

చివరగా ఈ సంగీత సాధనాలు లేకుండా పాట పాడమన్నాడు రాజు. విష్ణుచిత్తుడి గొంతులో పచ్చి వెలగకాయ పడినట్లైంది. పాడకపోతే పరువు పోతుందని విష్ణుచిత్తుడు పాట అందుకున్నాడు. పాట అంతా జీరగా సాగింది. ‘పాట ఆపండి’ అని సభలోని ప్రజలు గోలపెట్టారు. విష్ణు చిత్తుడికి పాట ఆపక తప్పలేదు.

సుధాముడి వంతు వచ్చింది.. కోకిల కంఠంలా పాట ఎంతో మధురంగా ఉంది. సభలో చప్పట్లు ఆగకుండా మోగాయి. రాజు అదే పాటను మరొకసారి పాడమన్నాడు. సుధాముడు పాడాడు. మంత్రితోనూ, న్యాయనిర్ణేతతోనూ రాజు చర్చించి.. మేము జోక్యం కలిగించుకుంటే బాగుండదు. వీరిద్దరిలో ఎవరు విజేతలో మీరే చెప్పండి’ అని సభికులను కోరాడు రాజు.

‘సుధాముడే విజేత’ అని ముక్త కంఠంతో అన్నారు సభికులు. విష్ణుచిత్తుడు తన ఓటమిని అంగీకరించాడు. సుధాముడిని అతనితో వచ్చిన సంగీత కళాకారులను మహారాజు ఘనంగా సత్కరించాడు. తన కంఠం సహకరించడం లేదని ఇక నుంచి పాడనని విష్ణుచిత్తుడు సభలో ప్రకటన చేశాడు. ‘ఒక మంచి గాయకుణ్ని మా ఆస్థానానికి ఇచ్చేవరకు మీరు మా అతిథులుగా ఉండాలి’ అని సుధాముణ్ని కోరాడు రాజు. ‘అలాగే మహారాజా!’ అన్నాడు సుధాముడు.

- యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు