Updated : 01 Jul 2022 07:05 IST

ప్రవర్తనలో పరివర్తన

తూర్పు కనుమలకు ఆనుకొని ఉన్న అడవికి పింగళుడు అనే నక్క మంత్రిగా ఉండేది. పాలనా విషయాల్లో చక్కని సలహాలిస్తూ.. మృగరాజు మన్ననలు పొందుతుండేది. అడవిలోని ఇతర జంతువుల గౌరవంతోపాటు ప్రశంసలూ అందుకునేది. పింగళుడికి ధమనుడు సంతానం. తన తండ్రి అడవికి మంత్రి అనే ధీమాతో.. అడవిలోని జంతువులపైన జులుం ప్రదర్శించేది.

తన మాటకు ఎవరైనా ఎదురు చెబితే.. ‘మంత్రి అయిన మా నాన్నకు చెప్పి, మీ పని పడతాను’ అని బెదిరించేది. మంత్రి పింగళుడి పైనున్న గౌరవంతో.. అడవిలోని జంతువులు ధమనుడి దౌర్జన్యాన్ని మౌనంగా భరిస్తుండేవి. దాంతో ధమనుడు మరింత గర్వంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేది.

ఒకరోజు ఓ ఎలుగుబంటి ధమనుడి ప్రవర్తనను మంత్రి పింగళుడి దృష్టికి తీసుకెళ్లింది. బిడ్డ నడవడిక గురించి బాధపడిన మంత్రి.. కుమారుణ్ని పిలిచి ‘అడవిలోని జంతువులతో నీ ప్రవర్తన బాగోలేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. నేను మంత్రిగా ఉన్నానన్న గర్వంతో అలా ప్రవర్తిస్తున్నావు. నీ పద్ధతి మార్చుకొని.. అడవి జంతువులతో కలివిడిగా ఉండు’ అంటూ మందలించింది.

ధమనుడు తండ్రితో ‘అలాగే నాన్న గారు’ అని.. వెళ్లిపోయింది. కానీ తన ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదు. ఎప్పటికప్పుడు కుమారుడి కదలికలను గమనిస్తూ.. తనకు చెప్పమని ఒక కోతిని ఆదేశించింది నక్క.

జంతువులతో ధమనుడి ప్రవర్తనను కొన్ని రోజులు పరిశీలించిన కోతి.. ‘మీ కుమారుడిలో ఎటువంటి మార్పూ రాలేదు’ అని మంత్రికి తెలియజేసింది. అతడిలో పరివర్తన ఎలా తీసుకురావాలో తెలియక ఆలోచనలో మునిగింది మంత్రి నక్క. ఒక ఏనుగుకు కబురు పెట్టి.. చిన్న సహాయం కావాలని కోరింది, అది సరేనంది. ఏనుగు దగ్గరకు వెళ్లి, దాని చెవిలో ఏదో చెప్పింది మంత్రి.

‘అలాగే మంత్రివర్యా..’ అంటూ బయలుదేరింది ఏనుగు. ధమనుడి దగ్గరికి వెళ్లి ‘మంత్రి కుమారా! రా.. ఇటు వచ్చి నా వీపుపైన కూర్చో.. నేను నిన్ను అడవి మొత్తం తిప్పుతాను’ అంది.

ధమనుడు సంతోషంగా ‘సరే’ అనగానే, ఏనుగు తన వీపుపైన ఆ పిల్ల నక్కను ఎక్కించుకొని అడవిని చూపించడం మొదలుపెట్టింది. ధమనుడు దర్జాగా కూర్చొని.. దారినపోయే జంతువులను వెక్కిరించసాగింది.

ఏనుగు అలా తిప్పుతూ తిప్పుతూ ఒక పెద్ద గొయ్యి దగ్గరకు చేరుకుంది. వీపుపైన ఉన్న ధమనుడిని, తొండంతో పట్టుకొని ఆ గొయ్యిలోకి విసిరేసింది. ఆ అనుకోని సంఘటన నుంచి ధమనుడు తేరుకునే సరికి, గోతిలో ఒక మూలన పడి ఉంది.

‘రక్షించండి.. రక్షించండి’ అంటూ అరుస్తోంది. ఏనుగు పట్టించుకోనట్లు అక్కడే నిలబడిపోయింది. ధమనుడి కేకలకు అడవిలోని జంతువులన్నీ ఆ గుంత చుట్టూ చేరాయి. ధమనుడు వాటిని చూసి ‘నన్ను కాపాడండి’ అని దీనంగా బతిమిలాడింది.

కానీ, ఏ జంతువూ ఆ మాటలు పట్టించుకోలేదు సరి కదా.. ‘నీకు తగిన శాస్తి జరిగింది’ అంటూ ఎగతాళి చేశాయి. ఇంతలో పరుగెత్తుకుంటూ వెళ్లిన కోతి.. విషయాన్ని మంత్రి పింగళుడికి చెప్పి అక్కడికి తీసుకొని వచ్చింది. తండ్రిని చూడగానే ధమనుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది.

‘నాన్నా.. నన్ను ఈ గుంత నుంచి బయటకు తీసి రక్షించు.. వీళ్లెవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు’ అంటూ వేడుకుంది. అప్పుడు పింగళుడు కుమారునితో ‘ధమనా.. చూశావా! ఆపదలో చిక్కుకున్నా, ఎవరూ నిన్ను రక్షించడానికి ముందుకు రావడం లేదంటే.. నువ్వు అడవిలోని జంతువులతో ఇన్నాళ్లూ ఎలా ప్రవర్తించావో తెలిసిందా..’ అంటూ ప్రశ్నించింది.

‘అర్థమైంది నాన్న గారు! నన్ను క్షమించండి. మీరు నాకు ఎన్నిసార్లు చెప్పినా, మీ మాట వినకుండా అడవిలోని జంతువులతో మంత్రి కుమారుడిననే గర్వంతో ప్రవర్తించాను. ఇకపై అలా చేయను. నాకు బుద్ధి వచ్చింది. అందరితో సఖ్యంగా మెలుగుతాను. నన్ను రక్షించండి’ అంటూ ప్రాధేయపడింది.

అప్పుడు మంత్రి ఏనుగుతో ‘నా కుమారుడిని గుంత నుంచి బయటకు తీసుకురా’ అని కోరింది. మంత్రి ఆజ్ఞతో ఏనుగు ధమనుడిని రక్షించింది. ‘బతుకు జీవుడా!’ అనుకుంటూ.. జంతువులన్నింటికీ కృతజ్ఞతలు చెప్పిన ధమనుడు.. తాను చేసిన తప్పుల్ని క్షమించమని కోరింది.

తరవాత తండ్రితో కలిసి ఇంటిబాట పట్టింది. అప్పటి నుంచి అడవిలోని జంతువులతో స్నేహంగా ఉంటూ, గర్వాన్ని వీడి ఆనందంగా మెలగసాగింది. కుమారుడి ప్రవర్తనలో వచ్చిన మార్పునకు, మంత్రి నక్క ఆనందించింది.  

- మొర్రి గోపి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని