Published : 02 Jul 2022 01:09 IST

అమ్మా.. నేను అందంగా లేనా!

దట్టమైన అడవిలో ఓ కాకి.. తన పిల్లకు ‘చిట్టి’ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఎప్పటిలానే ఆ రోజు కూడా అడవంతా తిరిగి, తన చిట్టికి ఇష్టమైన కీటకాలను, పండ్లను ఆహారంగా తీసుకువచ్చి దాని ముందుంచింది. చిట్టి ఒక్క పురుగును కూడా నోట కరవలేదు.. పండూ కొరకలేదు. ‘చిట్టీ.. తొందరగా తిను. చీకటి పడుతోంది. నిద్రపోవాలి కదా’ అంది తల్లి. అమ్మ మాట కాదనలేక.. ఏదో బలవంతంగా తింటోంది చిట్టి. అది గమనించి.. ‘నా చిట్టికి ఏమైంది ఈరోజు? అసలు ఏమీ తినటం లేదు’ అంది బిడ్డను బుజ్జగిస్తూ. ఒక్కసారిగా చిట్టి.. తల్లి రెక్కల కింద చేరి ‘నేను అందంగా ఉండనా?’ అని అడిగింది ఏడుస్తూ. ‘ఛీ ఛీ.. ఎవరు అలా అన్నది? నిగనిగలాడే రంగుతో, దృఢమైన ముక్కుతో, బలమైన రెక్కలతో నువ్వు ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా’ అంటూ చిట్టిని మరింత దగ్గరకు తీసుకొని ఓదార్చింది తల్లి.

‘కాకి పిల్ల, కాకికి ముద్దట కదా... అందుకే నేను బాగుంటాను అని అంటున్నావు!’ నీళ్లు నిండిన కళ్లతో అమాయకంగా అంది చిట్టి. కాకమ్మ ఉలిక్కిపడి ‘ఎవరన్నారు అలా?’ అంది చిట్టి రెక్కలను మెల్లగా దువ్వుతూ.. ‘మన చెట్టు మీద ఉన్న చిలకమ్మ..’ బదులిచ్చింది చిట్టి. ‘అవునా, తను నీ స్నేహితురాలేగా... అయినా అలా అందా?’ ఆశ్చర్యంగా అడిగింది కాకమ్మ. ‘నువ్వు మొత్తం నల్లగా ఉంటావు.. ఏమీ బాగుండవు.. నేను చూడు.. పచ్చటి రెక్కలతో... ఎర్రటి ముక్కుతో ఎంత అందంగా ఉంటానో...’ అని చిలకమ్మ అన్న మాటలను తల్లికి చెబుతూ.. దుఃఖం గొంతుకు అడ్డుపడి ఒక్కక్షణం ఆగిపోయింది చిట్టి. ‘అయ్యో... ఊరుకో చిట్టీ’ అంటూ బిడ్డ కళ్లు తుడిచింది కాకమ్మ.

‘ఆ కోకిలమ్మ కూడా నీలాగే నల్లగా ఉంటుంది. అయినా, తన గాత్రం చూడు ఎంత కమ్మగా ఉంటుందో! నీకు అది కూడా లేదు. నీ గొంతు ఎంతో భయంకరంగా ఉంటుందని ఆట పట్టిస్తూ, చిలక పకపకా నవ్వింది’ అంటూ దిగాలుగా తల్లిని అల్లుకుపోయింది బిడ్డ. తల్లి కాకి.. కొన్ని క్షణాలు దాన్ని అలాగే వదిలేసింది. తరవాత ‘ఆ చిలక పలుకులు పట్టించుకోకు చిట్టీ’ అంది ఓదారుస్తూ.. ‘ఎలా? తను చెప్పింది నిజం కాదా! నిజాల్ని నమ్మాలి అని నువ్వేగా చెబుతావు’ అని కాకమ్మను నిలదీసింది చిట్టి. కాకమ్మ కాసేపు మౌనంగా ఉంది. ‘‘కోయిల కొన్ని రోజులే కూస్తుంది. మనం మాత్రం ఎప్పుడూ ‘కావ్‌ఁ.. కావ్‌ఁ...’ అని అరుస్తాం.. అవునా’’ అంది కాకమ్మ.

‘అయితే ఏంటీ... కోకిల గొంతు నిజంగానే ఎంత బాగుంటుందో కదా’ కళ్లు చిట్లించి అడిగింది చిట్టి. ‘‘అదే చెబుతున్నాను. సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే కోకిల.. తన గొంతు వినిపిస్తుంది. మరి మనం, ప్రతి రోజూ ‘కావ్‌ఁ...కావ్‌ఁ...’ అంటూ అందరినీ పలకరిస్తాం.. నిజమేనా’’ అని నవ్వుతూ అడిగింది కాకమ్మ.

‘అవునవును’ అంది ఉత్సాహంగా చిట్టి. ‘నీకో రహస్యం చెప్పనా!’ అని కాకమ్మ అడిగింది. బాధ నుంచి కాస్త తేరుకున్న చిట్టి, ఉత్సాహంగా ‘చెప్పు... చెప్పు’ అంది. ‘ఆ కోకిల పిల్లలను మొదట పెంచేది మనమే, తెలుసా!’ అంది కొంత గర్వంగా..
‘అవునా’ అని ఆశ్చర్యపోయింది చిట్టి. ‘కోకిలమ్మ పిల్లలను కాకమ్మలే పెంచుతాయి. నేను కూడా నువ్వు పుట్టక ముందు ఓ కోకిల పిల్లని పెంచాను. అది పెద్దయిన తరువాత ఎగిరిపోయింది’ అంది తల్లి.

‘భలే.. భలే...’ అంటూ సంతోషంగా రెక్కలు టపాటపా కొట్టింది చిట్టి. ‘ఇంకో విషయం చిట్టీ’ అంది కాకమ్మ. ‘ఏమిటమ్మా?’ అని తల్లి ముఖంలో ముఖం పెట్టి ఆసక్తిగా అడిగింది బిడ్డ. ‘మనం రకరకాల ప్రాణులతోపాటు వృథాగా పడేసే ఆహారాన్ని కూడా తింటాం కదా!’ అడిగింది తల్లి. ‘అయితే.. ఏంటి?’ అని అర్థం కానట్లు చూసింది చిట్టి.

‘అలా అవన్నీ తిని, ఒకరకంగా మనం పరిసరాలను శుభ్రం చేస్తున్నట్లే లెక్క’ అని చెప్పింది కాకమ్మ. తల్లి మాటలను చెవులు రిక్కించి మరీ శ్రద్ధగా వింటోంది చిట్టి. ‘చిలకమ్మ తన రూపంతో, తియ్యటి పలుకులతో.. కోకిలమ్మ తన గొంతుతో అందరినీ అలరిస్తున్నాయి. మనం ఆ పనులు చేయలేకపోవచ్చు. కానీ, మనకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భూమిపైనున్న ప్రతి ప్రాణికి ఏదో ఒక గొప్ప లక్షణం ఉంటుంది. ఎవరిలోని ప్రతిభను వారు గుర్తించడంలోనే ఉందంతా.. ఈ లోకంలో ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు. అందుకని ఎవరో ఏదో అన్నారని బాధ పడకూడదు. మన పనేదో మనం చేసుకుంటూ, సంతోషంగా గడపాలి, సరేనా!’ అంటూ బిడ్డకు నచ్చజెప్పింది తల్లి కాకి. చిట్టికి విషయం పూర్తిగా అర్థమై ‘కావ్‌ఁ.. కావ్‌ఁ..’ అని గారాలుపోతూ తల్లిని అల్లుకుంది.

- యమున చింతపల్లి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts