Published : 03 Jul 2022 01:00 IST

పొట్టి పిల్లి.. మొహమాటం!

పూర్వం సదాశివకోన అనే దట్టమైన అడవి ఒకటి ఉండేది. వేలాది జీవరాశులకు అది నిలయం. ఆ అడవిని ఆనుకొనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరు పాడికి చాలా ప్రసిద్ధి. అక్కడి వారందరి ఇళ్ల వరండాల్లో పాలు, పెరుగు, వెన్న ఉట్లపై వేలాడుతూ ఉండేవి. స్థానిక పిల్లులతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవీ.. రోజూ ఆ ఊర్లోకి రావడం.. దొంగతనంగా అందిన కాడికి పాలు, వెన్న వంటివి తినడం చేస్తుండేవి. ఇంకా దొరికితే.. వేరే పిల్లుల కోసం నోట కరుచుకొని తీసుకెళ్తుండేవి.

వాటిలో మజ్జ అనే ఒక పొట్టి పిల్లి ఉండేది. అది ఇతర పిల్లులలాగే, రోజూ ఏదో ఒక ఇంటికి వెళ్తుండేది. కానీ, మజ్జ పొట్టిది కావడంతో అక్కడ ఉట్టికి వేలాడదీసిన పదార్థాలను అది అందుకోలేకపోయేది. ఈ విషయం సహచర పిల్లులకు తెలిస్తే పరువు పోతుందనీ, తనకు అవమానకరమని భావించేది మజ్జ. దాంతో అక్కడ పక్కనే నేలపైనో, ఎంగిలి పాత్రల్లోనో మిగిలిన పదార్థాలను నోటికి పూసుకునేది. అదే మూతితో తమ నివాసానికి తిరిగి వెళ్లేది.

అక్కడ ఉన్న మిగిలిన పిల్లులు ‘తిన్నావా?’ అని అడిగితే జరిగింది చెప్పకుండా.. ‘ఓ లక్షణంగా తిన్నా... అంతే కాదు మిగిలింది ఏం చేయాలో తెలియక అక్కడే పారేశా’ అంటూ గొప్పలు చెప్పేది. ఆ పిల్లులన్నీ ‘చూడు.. దీనికి ఎంత పొగరో.. ఎంత మంచి ఆహారం దొరికితే మాత్రం, అక్కడే తిని మూతి తుడుచుకోవాలి గానీ మనందరినీ ఊరించడానికి ఇలా తుడుచుకోకుండా వచ్చేయడమేంటి? పైపెచ్చు.. గర్వం కాకపోతే దొరికిన ఆహారాన్ని పట్టుకువచ్చి ముసలి వాటికీ, చిన్న పిల్లులకు ఇవ్వకుండా పారేశానని చెబుతోంది’ అని గుసగుసలాడుకున్నాయి. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని, సరైన సమయం కోసం ఎదురు చూడసాగాయి.

ఒకరోజు పిల్లులన్నీ కలసి, ఒక మాంసాహార విందు ఏర్పాటు చేసుకున్నాయి. అందులో అన్నీ కలిసి వేటాడి తెచ్చిన రకరకాల తినుబండారాలను గుండ్రంగా పేర్చి పెట్టాయి. మజ్జ మీద ఉన్న కోపంతో అవి దాన్ని పిలవలేదు. అయినా, విషయం తెలుసుకున్న పొట్టి పిల్లి మాత్రం ‘ఈరోజైనా కడుపునిండా తినొచ్చు’ అనుకుంటూ ఉత్సాహంగా విందు జరిగే ప్రాంతానికి వచ్చింది. మజ్జ అక్కడికి రాగానే మిగిలిన పిల్లులన్నీ ‘నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు.. నువ్వుంటే మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతాం’ అంటూ దాంతో వాదనకు దిగాయి.

వాటి కోపానికి కారణం తెలుసుకున్న మజ్జ.. జరిగింది చెప్పడానికి ఎంత ప్రయత్నించినా, మిగిలిన పిల్లులు వినిపించుకోలేదు. అంతలోనే అక్కడికి చేరుకున్న పిల్లి రాజు ‘మీరందరూ కాసేపు ఆగండి’ అంటూ ఆజ్ఞాపించింది. వెంటనే అవన్నీ శాంతించాయి. వేటి స్థానంలో అవి బుద్ధిగా కూర్చున్నాయి. ‘మజ్జను నేనే ఇక్కడికి పిలిచాను. ఇందులో పొట్టి పిల్లితోపాటు మీ తప్పు కూడా ఉంది’ అనగానే ‘మేమేం చేశామా..!’ అని పిల్లులన్నీ అయోమయంలో పడ్డాయి.

‘మీరందరూ కేవలం కళ్లతో చూసింది, చెవులతో విన్నది మాత్రమే నిజం అనుకొని పొరపడ్డారు. ఆ పొట్టి పిల్లి అన్ని పదార్థాలనూ ఒక్కతే తిని, మిగిలినవి పారేసి ఉంటుందని నమ్మేశారు. కానీ, మనలాంటి బలవంతులకే అందని ఉట్లపైన ఉండే ఆహారాన్ని అది రోజూ సంపాదించిందంటే మీరెలా నమ్మారు? అయినా.. అవతల వారికి కనీస మర్యాద ఇవ్వడం మన ధర్మం కదా..’ అంటూ మిగతా పిల్లులకు అర్థమయ్యేలా విషయాన్ని చెప్పింది పిల్లి రాజు.

‘నువ్వు ఎక్కడైనా మొహమాట పడవచ్చు కానీ.. తిండి దగ్గర ప్రదర్శిస్తే మాత్రం, అది నీకే నష్టం. కాబట్టి ఇకనుంచైనా అందరూ కలిసి మెలసి ఉండండి’ అంటూ మజ్జతో అంది పిల్లి రాజు. ‘చూసేది అంతా నిజం కాదు.. విన్నదంతా సత్యమూ కాదు.. మొహమాటం మొదటికే మోసం’ అని తెలుసుకున్న పిల్లులన్నీ.. మజ్జను విందులోకి ఆహ్వానించాయి. తాను చేసిన అమాయకపు పనికి లోలోపలే నవ్వుకుంటూ.. కడుపు నిండా తింది పొట్టి పిల్లి.

- సింగంపల్లి శేష సాయికుమార్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని