Published : 04 Jul 2022 00:56 IST

తల్లి ప్రేమంటే ఇదే..!

నిత్య అయిదో తరగతి చదువుతోంది. ఇంటి ముందున్న గులాబీ మొక్కంటే తనకు చాలా ఇష్టం. రోజూ దానికి పూసిన పువ్వును జడలో పెట్టుకుని బడికి వెళుతుంది. తిరిగి ఇంటికి రాగానే గులాబీ మొక్క పక్కనే ఉన్న జామ చెట్టుపైకి చూస్తుంది. దాని మీదున్న చిలుక, నిత్య చేతిలో ఒక జామపండును వేస్తుంది. దాన్ని తింటూ చిలుకతో కబుర్లాడటం అంటే నిత్యకు చాలా ఇష్టం. ఆ తర్వాత గులాబీ మొక్క మొదట్లో నీళ్లు పోస్తుంది. ‘రేపు పూసే గులాబీ పువ్వుల కోసం ఎదురు చూస్తూ ఉంటాను’ అని నవ్వుతూ అంటుంది.

తెల్లవారగానే.. నిత్య బడికి వెళుతూ గులాబీ మొక్క దగ్గరకు వచ్చింది. నాలుగు పువ్వులు విరబూశాయి. ఒక పువ్వును కోసి తన జడలో పెట్టుకుంది. మిగతా మూడు పువ్వుల వైపు నవ్వుతూ చూసింది. తిరిగి బడికి వెళ్లింది. అప్పుడే చిన్నగా వర్షం మొదలైంది. ఆ వానకు గులాబీ మొక్క వేర్లు పైకి కనిపించసాగాయి. ఆ వేర్లను చూస్తూ గులాబీ పువ్వులు.. ‘మనం ఎంత అందంగా ఉన్నామో, మన మొక్కకున్న వేర్లు అంత అందవికారంగా ఉన్నాయి. వాటిని చూస్తేనే అసహ్యం వేస్తోంది. కిందకు చూడద్దు!’ అనుకుంటూ వేర్లను వెక్కిరిస్తూ పైకి చూడసాగాయి. ఆ మాటలు అక్కడే జామచెట్టు మీదున్న చిలుక కూడా వింది.

‘తల్లిలాంటి వేర్లను పువ్వులు తిడుతుంటే బాధ కలగలేదా? పువ్వులకు మీరు గట్టిగా సమాధానం చెప్పేలేదే?’ ఆశ్చర్యంగా గులాబీ వేర్ల వైపు చూస్తూ అడిగింది చిలుక. వేర్లు ఏమీ సమాధానం చెప్పకుండా, మౌనంగానే ఉండిపోయాయి.

సాయంత్రమైంది. నిత్య బడి నుంచి ఇంటికి వచ్చింది. గులాబీ పువ్వులను ముద్దాడుతూ జామ చెట్టు మీదున్న చిలుకతో కబుర్లు చెప్పసాగింది. ‘చిలుకా! రోజూలా.. గలగలా కబుర్లు చెప్పడం లేదే?’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది నిత్య.

‘ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? గులాబీ పువ్వుల అందాలను చూస్తారే కానీ వాటి వేర్ల సంగతిని ఎవ్వరూ పట్టించుకోరు కదా!’ అంది చిలుక కొంచెం దీనంగా. ఇప్పుడు ఎందుకలా అడిగావు? ఏమైంది?’ చిలుకను మళ్లీ అడిగింది నిత్య. దాంతో గులాబీ పువ్వులు.. వేర్లను అసహ్యించుకున్న విషయం చెప్పింది.

‘అయ్యో! మొక్కకు నీళ్లు వేరు మొదట్లో పోస్తాం. ఎందుకంటే మొక్కకైనా, చెట్టుకైనా వేరే ఆధారం. దాన్ని మరిస్తే ఇబ్బంది పడేది మనమే. అంతెందుకు? నేను చూపుడు వేలు, బొటన వేలుతో రాస్తాను. అలా రాయడానికి ఆధారం మిగతా మూడు వేళ్లే కదా.. వాటి విలువను గుర్తించకపోతే నేనసలు రాయగలనా? ఇంకెప్పుడూ వేర్లను చులకన చేస్తూ మాట్లాడకండి.. సరేనా!’ అని పువ్వులతో సున్నితంగా అంది.

‘బాగా చెప్పావు’ అంటూ చిలుక నిత్యతో నవ్వుతూ అంది. ‘నా మాటలు నచ్చినందుకు ఆనందంగా ఉంది!’ అంటూ నిత్య ఇంటి లోపలికి వెళ్లింది. ‘పాపం పువ్వులు చిన్నబుచ్చుకునేలా ఎందుకు చేశావంటూ?’ చిలుకను అడిగాయి వేర్లు. అప్పుడు  ‘అన్నింటికీ మౌనం సమాధానం కాదు. మన పొరపాటు లేకపోయినా, తల దించుకుంటే ఆ తప్పును ఒప్పుకొన్నట్లవుతుంది. సమయమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందంటూ మౌనంగా కూర్చోకూడదు’ అని వివరించింది చిలుక.

అప్పుడే పువ్వులు.. ‘మమ్మల్ని క్షమించండి’ అని వేర్లను అడిగాయి. ‘బిడ్డలు తెలియక చేసిన తప్పులను తల్లి పట్టించుకోదు’ అన్నాయి వేర్లు. ‘తల్లిప్రేమ అంటే ఇదే సుమా!’ అని గులాబీ వేర్లతో నవ్వుతూ చెప్పింది చిలుక.

- కె.వి.లక్ష్మణరావు


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని