Published : 05 Jul 2022 00:33 IST

రాజు మారాడు!

వంతీపుర రాజ్యాన్ని పాలించే ఆనందవర్మ సమర్థుడు, పరిపాలనా దక్షుడు. అయితే అతనికున్న పెద్ద వ్యసనం వేట. తరచూ పరివారంతో వేటకు వెళ్లి, వందలాది మృగాలను వేటాడేవాడు. మంత్రి మాధవభట్టు వద్దని ఎంత వారించినా పెడచెవిన పెట్టేవాడు.

ఒకసారి అరణ్యానికి వెళ్లి, మృగాలను ఇష్టం వచ్చినట్లు వేటాడుతూ పరివారం నుంచి విడిపోయి, దారి తప్పి పద్మవనం అనే కీకారణ్యాన్ని చేరుకున్నాడు. అక్కడ అతనికి కృష్ణజింక కనిపించింది. దానివెంట పరుగులు తీస్తూ దాని మీదకు వాడైన బాణం వదిలాడు. ఆ బాణం దాని వీపునకు గుచ్చుకుంది. అయినా అది వేగంగా గూడెం వైపునకు దూసుకుపోయింది. అక్కడ ఉన్న కొందరు ఆటవికులు దాని వీపున ఉన్న బాణం తీసి ఆకు పసరు పూసి చెట్టు నీడన దాన్ని పడుకోబెట్టారు. అదే సమయంలో నలుగురు ఆటవికులు అక్కడి నుంచి బయలుదేరి జింకను వేటాడిన వారి కోసం వెతుకుతూ వచ్చారు.

‘రాజ్యానికి ఎటు పోవాలా?’ అని దారి వెతుకున్న రాజును బంధించబోయారు. ‘నేనెవరో మీరు గుర్తించినట్లు లేదు. అవంతీపురానికి రాజును’ అన్నాడు ఆనందవర్మ వారితో. ‘మీరు ఎవరన్నది మాకు అవసరం లేదు. మా వనంలో వేటకు అనుమతి లేదు’ అంటూ వారు గూడెం పెద్ద వద్దకు రాజును తీసుకు వెళ్లారు.

‘మీరు చూస్తే రాజవంశీయుల్లాగా కనిపిస్తున్నారు. పద్మవనంలో వేట నిషిద్ధం అని మీకు తెలియదా? అదీకాక ఈ వనం మీ రాజ్యంలో భాగం కూడా కాదు. అనాదిగా ఇక్కడ వన్యమృగాలను తోబుట్టువులుగా చూసుకోవడం సంప్రదాయం. ఇక్కడ వేటాడినవారు ఎంతవారైనా శిక్ష తప్పదు. అయితే మీ అదృష్టవశాత్తూ మీరు వేటాడిన జింక చనిపోలేదు. అదీగాక మీరు దారితప్పి ఈ వనంలోకి వచ్చినట్టున్నారు. అందువల్ల మీ తప్పును మన్నించి శిక్ష వేయటం లేదు. మరెప్పుడూ ఇటువైపు రాకండి. మాతో కలిసి మెలిసి జీవనం సాగించే వన్యప్రాణులకు ఆపద కలిగితే, వాటిని కాపాడుకోవడానికి మేం ప్రాణాలైనా వదిలేందుకు సిద్ధం’ అన్నాడు గూడెం పెద్ద.

‘మీరు మాంసాహారులు కాదా?’ అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ‘అనేక రకాల ఫల, పుష్ప జాతులు మా అరణ్యంలో ఉన్నాయి. అవే మాకు కావాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇక మాకు మాంసాహారంతో పని ఏముంది?’ అన్నాడు గూడెం పెద్ద.  
రాజుకు నోట మాటరాలేదు. అప్పుడు గూడెం పెద్ద రాజును బంధించి తెచ్చిన నలుగురితో.... ‘రాజుగారిని క్షేమంగా అరణ్యం దాటించి రండి’ అని చెప్పాడు.

మార్గమధ్యలో రాజు వారితో మాటలు కలిపాడు. ఆ సంభాషణల మధ్యలో వారి పేర్లు గుర్రం చంద్రయ్య, ఏనుగు మల్లయ్య, జింక సుబ్బయ్య, ఆవు అనంతయ్యగా రాజుకు తెలిసింది. ఆశ్చర్యపోతున్న రాజుతో వాళ్లు ఇలా అన్నారు. ‘ఇందులో ఆశ్చర్యం ఏముంది ప్రభూ! అడవిలో ఉన్న జంతువుల సంరక్షణ మాకు అనాదిగా వస్తున్నదే! ఒక్కో జాతి జంతువులను సంరక్షించే బాధ్యత కొంతమందికి వస్తుంది. ఆ విధంగా మా పూర్వీకులకు వారు సంరక్షించే జంతువుల పేర్లే ఇళ్ల పేర్లయ్యాయి. తాత, ముత్తాతల నుంచి అవే మాకు వచ్చాయి. ఈ నాటికీ మేం అదే పని చేస్తున్నాం’ అన్నారు.

రాజుకు పశ్చాత్తాపం కలిగింది. ‘అడవిలో ఉన్న ఆటవికులకే అంత జీవకారుణ్యం ఉన్నప్పుడు అంతఃపురంలో ఉన్న తనకెంత ఉండాలి?’ అనుకున్నాడు. రాజధాని చేరగానే రాజ్యంలో వేట నిషేధించి, కఠినంగా అమలుపరిచాడు. మంత్రి మాధవభట్టు ఆనందానికి అంతులేదు. ప్రజలూ, రాజులో వచ్చిన మార్పునకు ఎంతో సంతోషించారు.

- గంగిశెట్టి శివకుమార్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని