నీరు చెప్పిన నీతి!

లక్ష్మీనాథుడనే శ్రీమంతుడు తనకు లేక లేక కలిగిన సంతానానికి వివేకవర్ధనుడు అనే పేరు పెట్టాడు. ఆ బిడ్డకు బడి ఈడు వచ్చింది. బడిలో వేశాక మొదట్లో బుద్ధిగా ఉండేవాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ

Published : 06 Jul 2022 00:53 IST

లక్ష్మీనాథుడనే శ్రీమంతుడు తనకు లేక లేక కలిగిన సంతానానికి వివేకవర్ధనుడు అనే పేరు పెట్టాడు. ఆ బిడ్డకు బడి ఈడు వచ్చింది. బడిలో వేశాక మొదట్లో బుద్ధిగా ఉండేవాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ చెడు సావాసాల వల్ల, పోకిరీగా తిరుగుతూ చదువుకు దూరమవసాగాడు. పన్నెండేళ్లు వచ్చినా ఓ దారికి రాలేదు. కానిపనులు చేసి తల్లిదండ్రులకు తలవంపులు తీసుకురాసాగాడు.

కొడుకు ప్రవర్తనతో దిగులు పడ్డ లక్ష్మీనాథుడికి.. నాగావళి నది ఒడ్డున విద్యానందుడనే గురువర్యులు నడిపే ఆశ్రమ పాఠశాల గురించి తెలిసింది. ఆయన దారి తప్పిన పిల్లలకు సరైన హితబోధ చేసి సన్మార్గంలో పెట్టగల సమర్థుడని విన్నాడు.
లక్ష్మీనాథుడు కొండంత ఆశతో కొడుకును అక్కడకు తీసుకువెళ్లాడు. పాఠశాల పరిసరాలు చూడ్డానికి కొడుకు బయటకు వెళ్లిన సమయంలో.. అతడి చెడు సావాసాల గురించి, చదువు మీదున్న నిరాసక్తతనూ గురువుకు వివరంగా చెప్పాడు. ఆ తర్వాత కొడుకును ఆయనకు అప్పజెప్పి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆశ్రమ పాఠశాలలో చేరిన వివేకవర్ధనుడిని గురువర్యులు ఒక కంట కనిపెట్టసాగాడు. వేళకు అతడు లేచేవాడు కాదు. కాలకృత్యాలు సకాలంలో తీర్చుకునే వాడు కాదు. తోటి విద్యార్థులు పాఠాలు వల్లెవేస్తూ ఉంటే... ఇతడు మాత్రం అవేమీ పట్టించుకొనే వాడు కాదు. పైగా వాళ్ల ఏకాగ్రతను భంగపరిచే పనులు చేస్తుండేవాడు. ఏ తుంటరి పనైనా చేయడానికి వెనుకాడేవాడు కాదు. అవతలి వారి మనసు ఎంత ఎక్కువ బాధ పడితే అంత ఆనందించేవాడు. అదంతా గమనించిన గురువు సమయం కోసం ఎదురు చూడసాగాడు.

ఒకరోజు విద్యానందుడు వివేకవర్ధనుడిని అధ్యయన సమయంలో నిలబెట్టించి.. ‘ఈ రోజు నుంచి ఇతడే మన గురుకుల విద్యార్థులకు నాయకుడిగా ఉంటాడు. మీరంతా వివేకవర్ధనుడి సూచనలు పాటించి గురుకులానికి మంచి పేరు తీసుకురండి’ అని చెప్పాడు.

తన ఆకతాయి పనులకు తిడతారేమోనని సందేహించిన వివేకవర్ధనుడికి, గురువు గారి ప్రకటన చాలా ఆశ్చర్యం కలిగించింది. ‘నేను నాయకుడిగా పనికి రానేమో’ అనే సందేహం వెలిబుచ్చాడు. విద్యానందుడు చిరునవ్వు నవ్వుతూ.. ‘వివేకవర్ధనా! నీ శక్తియుక్తులు నీకు తెలియవు. నీ చురుకుదనం సవ్యమైన మార్గంలో వినియోగిస్తే గొప్ప తెలివైనవాడివవుతావు. మీ అమ్మానాన్నలు నిన్ను చూసి గర్వపడతారు!’ అన్నాడు.

ఆ మాటలు విన్నప్పుడు వివేకవర్ధనుడి కళ్లు ఆనందంతో మెరవడం గురువు గమనించాడు. వెంటనే ఆయన తన పర్ణశాలకు వివేకవర్ధనుడిని తీసుకువెళ్లి నాయకుడిగా చేయాల్సిన పనులు చెప్పాడు. పెత్తనం అప్పజెప్పేసరికి వివేకవర్ధనుడిలో మార్పు వచ్చింది. మర్నాడు పక్షుల కిలకిలారావాలతో సూర్యోదయానికి ముందే లేచి, తోటి విద్యార్థులను నిద్ర లేపాడు. వారితో పరిసరాలను శుభ్రం చేయించాడు. పక్కనే ప్రవహిస్తున్న వాగు నుంచి నీరు తెప్పించాడు.

అందరూ కలిసి, వాగు వద్దకు మసిబారిన వంటపాత్రలను తీసుకువెళ్లి తళతళలాడేట్టు కడిగారు. మాసిన దుస్తులు ఉతుక్కున్నారు. పనులన్నీ చేయడం వల్ల చెమటతో మలినమైన వాళ్లు వాగు ప్రవాహంలో జలకాలాడారు.

వాగు ఒడ్డున నిలబడ్డ గురువు వారితో ‘నీటికి ఏ మలినాన్నైనా శుద్ధి చేసే గుణముంది. ఆ నీటి వల్లే  మనం శుభ్రమవుతున్నాం. మన పరిసరాలు, మనం వాడే సామగ్రి పరిశుభ్రమవుతున్నాయి. ఆ నీరే లేకపోతే లోకం ఎంత మురికి పట్టి కంపు కొడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నీటి గొప్పతనం మీకు ఎందుకు చెబుతున్నానంటే.. నీరు లాంటిదే చదువు కూడా. విద్య మనసులోని మలినాలు పోగొడుతుంది. వివేకాన్ని కలిగిస్తుంది. మంచి మార్గం చూపుతుంది. మీరు జ్ఞానం కోసం ఇక్కడ చేరారు. మంచివారిగా ఎదిగి మీ తల్లిదండ్రులకు, గురువులకు, దేశానికి మంచి పేరు తీసుకురండి’ అని అన్నాడు. గురువు గారి మాటలు వివేకవర్ధనుడి మీద చక్కగా పనిచేశాయి. అప్పటి నుంచి చక్కగా విద్యార్జన చేసి బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని