Published : 24 Jan 2020 00:28 IST

నది ఇసుకే ఎందుకు?

ఎందుకు ఏమిటి ఎలా?

ప్రశ్న: కట్టడాల్లో నది ఇసుకనే ఎందుకు వాడతారు? అసలు నదుల్లో ఇంతటి ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది?

-ఎస్‌.వి.సుబ్బలక్ష్మి, పదోతరగతి, జడ్పీహెచ్‌ స్కూల్‌, కవిటం, ప.గో.జిల్లా

దుల్లోని ఇసుకను ప్రధానంగా కట్టడాల్లో కాంక్రీటు తయారీలో, కట్టుబడి సున్నంలో ఉపయోగిస్తారు. ఈ ఇసుకను నదీ ప్రవాహం అడుగు నుంచి తవ్వి తీస్తారు. ఈ ఇసుక వాడకం వల్ల కాంక్రీటు మిశ్రమం, కట్టుబడి సున్నం పనితీరు చక్కగా ఉంటుంది. నదీ ఇసుకకు బదులుగా రాతిపొడి వంటి ప్రత్యామ్నాయాలు వాడినా వాటి పనితీరు నదిలోని ఇసుకతో సాటిరాదు. నదుల్లోని ఇసుకలో సిలికా ఉంటుంది. ఇది రసాయనికంగా అచేతనంగా ఉండటమే కాక, చాలా గట్టిదనాన్ని కలిగి ఉంటుంది. ఎటువంటి వాతావరణ మార్పులనైనా తట్టుకుంటుంది. సముద్రాల్లోని ఇసుకకు ఇంతటి బలం, ఒత్తిడిని తట్టుకోగల శక్తి ఉండదు. ఒక వేళ కట్టడాల్లో సముద్రపు ఇసుకను వాడితే అందులోని లవణం వాతావరణంలోని తేమను పీల్చుకుని చిత్తడిగా మారుతుంది. అందుకే సముద్రపు ఇసుకను కట్టడాల్లో వాడరు.

నదిలో ఇసుక ఏర్పడాలంటే అది సుదీర్ఘకాల ప్రక్రియ. నీరు, గాలి, గురుత్వాకర్షణ.. ఇలా ఇతర బలాల కారణంగా ఈ ఇసుక తయారవుతుంది. నదిలో నీటి అడుగున నేల నీటిలో కరుగుతుంది. ముందు ఇది మురికిగా తయారవుతుంది. నీటి ప్రవాహంతో ఈ మురికి కదులుతూ ఉండటం వల్ల అది బాగా అరిగిపోతుంది. బరువైన ఈ మురికి కణాలు ఇసుకగా రూపాంతరం చెంది నది అడుగు భాగాన, ఒడ్డున పేరుకుపోతుంది. భూమ్యాకర్షణ శక్తి ఈ ఇసుక కిందకు, దిగువ భాగాలకు రవాణా అయ్యేందుకు సహకరిస్తుంది. కెరటాలను సృష్టించి గాలీ ఇసుక తయారీలో తనవంతు పాత్ర పోషిస్తుంది. సన్నని ఇసుకా ఈ ప్రవాహంలో కొట్టుకుంటూ వేరు వేరు ప్రాంతాలకు నీటితో పాటే రవాణా అవుతుంది.

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని