కాగితాన్ని చించినప్పుడు శబ్దమెందుకు?

పొడిగా ఉన్న కాగితాన్ని చించినప్పుడు శబ్దం వస్తుంది. కానీ తడిగా ఉన్న కాగితాన్ని చించినపుడు శబ్దం రాదు ఎందుకు? గాలిలో కన్నా నీటిలో ధ్వని వేగం ఎక్కువ కదా? 

Published : 07 Feb 2020 00:48 IST

ప్రశ్న: పొడిగా ఉన్న కాగితాన్ని చించినప్పుడు శబ్దం వస్తుంది. కానీ తడిగా ఉన్న కాగితాన్ని చించినపుడు శబ్దం రాదు ఎందుకు? గాలిలో కన్నా నీటిలో ధ్వని వేగం ఎక్కువ కదా?      

- ఎ.ప్రణతి, పొదలకూరు, నెల్లూరు

గాలిలో కన్నా నీటిలో ధ్వని వేగం ఎక్కువ అన్న విషయం నిజమే. కానీ కాగితాన్ని చించినపుడు వచ్చే శబ్దానికి, తడి కాగితాన్ని చించినపుడు శబ్దం రాకపోవడానికి కారణాన్ని ధ్వని వేగం పరంగా చూడకూడదు. పొడి కాగితాన్ని చించినపుడు కాగితపు పొరల పోగుల మధ్య ఉన్న బంధాలు తెగిపోతుంటాయి. అలా తెగినపుడు వెలువడే శక్తి తరంగాలు చుట్టుపక్కల ఉన్న గాలిలో విస్తరించి మన చెవులకు శబ్దం చేరుతుంది. అందుకే పొడి కాగితాన్ని చించినపుడు పరపరమనే శబ్దం వస్తుంది. తడి కాగితపు పొరల మధ్య నీరు ఉంటుంది. అలాంటి కాగితపు పోగుల మధ్య బంధాలు బలంగా ఉండవు. కాబట్టి శక్తి ఎక్కువగా విడుదల కాదు. ఒక వేళ కొద్దోగొప్పో వెలువడ్డా కాగితపు పొరల మధ్య ఉన్న నీరు గ్రహించి శోషిస్తుంది. ఇక గాలిలో ధ్వని తరంగాలను ఏర్పరిచేందుకు ఏ శక్తీ మిగలదు. అందుకే తడి కాగితాన్ని చించినపుడు శబ్దం వెలువడదు.

- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని